రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గుజరాత్‌లో 31న కీలక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం


· అనుసంధానం.. ప్రాంతీయ ఆర్థిక ప్రగతి.. వృద్ధికి ఈ ప్రాజెక్టులతో నవ్యోత్తేజం

· కనలుస్-జామ్‌నగర్ (28 కిలోమీటర్ల) మార్గం డబ్లింగ్‌తో రాజ్‌కోట్-జామ్‌నగర్ మధ్య ఇకపై మరిన్ని రైళ్ల రాకపోకలు

· రిఫైనరీ.. ఆలయ పట్టణాలు జామ్‌నగర్.. ద్వారకలను వాణిజ్య కూడలి రాజ్‌కోట్‌తో జోడించడం ద్వారా అనుసంధానం మెరుగుదలతో రైతులు.. వ్యాపారవేత్తలు.. పర్యాటకులకు ప్రయోజనం

· గాంధీధామ్-ఆదిపూర్ సెక్షన్ (10.69 కిలోమీటర్ల) మార్గం 4 వరుసలకు విస్తరించడంతో రూపుమారనున్న కచ్... సామర్థ్యం పెరుగుదలతో భారీ సరకు రవాణా రద్దీ తగ్గుతుంది

· గుడ్స్ రైళ్ల వేగం పెరుగుదల... ప్రయాణికులకు మరింత విశ్వసనీయ సేవలతో గుజరాత్‌లో రేవు ఆధారిత ప్రగతి బలోపేతం సహా అంతర్గత మార్కెట్ల అనుసంధానం మెరుగుదల

· హిమ్మత్‌నగర్–ఖేడ్‌బ్రహ్మ గేజ్ మార్పిడి (54.83 కిలోమీటర్లు) ప్రాజెక్టుతో విద్య.. ఆరోగ్య సంరక్షణ.. ఉపాధి ఇనుమడిస్తాయి... రైతులతోపాటు చిన్న వ్యాపారులకు మార్కెట్ సంధానం మెరుగుదల.. అధికాదాయార్జన
అవకాశాలు

· ఖేడ్‌బ్రహ్మ–హిమ్మత్‌నగర్–అసర్వా రైలును ప్రధానమంత్రి ప్రారంభించనుండటంతో సబర్కాంతలో ప్రాంతీయ అనుసంధానం.. చివరి అంచెదాకా సౌలభ్యం.. జీవనోపాధి.. పర్యాటకం.. నిత్యావసర సేవల లభ్యత
మెరుగుపడతాయి

నాడు పోస్టు చేయడమైనది: 30 MAR 2026 8:04PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు (31న) గుజరాత్‌లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా అనుసంధాన బలోపేతం, ప్రాంతీయ ప్రగతికి ప్రోత్సాహం లక్ష్యంగా చేపట్టిన కీలక రైలు మౌలిక సదుపాయాలు సహా వివిధ ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు.

ఈ కార్యక్రమాల్లో భాగంగా బృహత్తర రాజ్‌కోట్–కనలుస్ డబ్లింగ్ ప్రాజెక్టు (111.20 కిలోమీటర్లు)లో భాగమైన కనలుస్–జామ్‌నగర్ డబ్లింగ్ ప్రాజెక్టు (28 కిలోమీటర్లు) సహా గాంధీధామ్–ఆదిపూర్ సెక్షన్ 4 వరుసల (10.69 కిలోమీటర్ల) మార్గం ప్రాజెక్టులను ప్రధానమంత్రి దేశానికి అంకితం చేస్తారు. రైల్వేల సామర్థ్యం పెంచే ఈ ప్రాజెక్టులతో ఆయా మార్గాల్లో రైళ్ల రాకపోకల రద్దీ తగ్గుతుంది. కార్యాచరణ సామర్థ్యం మెరుగుదల ద్వారా ఈ ప్రాంతంలో రైల్వే మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడతాయి.

కనలుస్-జామ్‌నగర్ సెక్షన్ డబ్లింగ్ ద్వారా వేగంగా, మరింత ఎక్కువగా రైళ్ల సేవలు అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా అదనపు రైళ్లను నడపడం వల్ల జామ్‌నగర్, రాజ్‌కోట్ వంటి కీలక పట్టణ, పారిశ్రామిక కూడళ్లకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుతుంది. పెట్రోలియం శుద్ధి, ఇత్తడి పరిశ్రమలకు ప్రధాన కూడలి అయిన జామ్‌నగర్‌లో సరకు రవాణా మెరుగవుతుంది. దీనివల్ల రవాణాలో ఆలస్యం తగ్గడంతోపాటు పారిశ్రామిక ఉత్పాదకత పెరుగుతుంది. అలాగే, వ్యవసాయ ఉత్పత్తుల సత్వర రవాణాతోపాటు రైతులకు మార్కెట్‌ సౌలభ్యం మెరుగుదల వల్ల వ్యవసాయాధారిత పరిశ్రమలు కూడా బలోపేతం అవుతాయి. ప్రయాణికుల అనుసంధానంతో కీలక వాణిజ్య కూడలి రాజ్‌కోట్ కూడా ప్రయోజనం పొందుతుంది. ఇది వాణిజ్య సౌలభ్యం సహా వ్యాపార సంబంధిత, ప్రాంతీయ రాకపోకలకు దోహదం చేస్తుంది. మరోవైపు రైలు సౌకర్యం పెరిగినందు వల్ల ఈ ప్రాంతం మొత్తానికీ సౌలభ్యం, అనుసంధానం మెరుగుదల ద్వారా ద్వారకలో పర్యాటకానికి ప్రోత్సాహం లభిస్తోంది.

అదేవిధంగా గాంధీధామ్-ఆదిపూర్ విభాగం 4 వరుసలకు విస్తరించడం వల్ల కచ్ ప్రాంతంపైనే కాకుండా గాంధీధామ్, ఆదిపూర్ పరిసర ప్రాంతాలపైనా పరివర్తనాత్మక ప్రభావం ప్రస్ఫుటమవుతుంది. ఓడరేవులు-పారిశ్రామిక మండళ్ల అనుసంధానంలో ఈ కారిడార్ కీలక పాత్ర పోషిస్తుంది. సదుపాయాల సామర్థ్యం పెరుగుదలతో భారీ సరకు రవాణాలో రద్దీ తగ్గి, గుడ్స్ రైళ్ల రాకపోకలు వేగం పుంజుకుంటాయి. ప్రయాణికులకు మరింత విశ్వసనీయ సేవలు లభిస్తాయి. రేవుల ఆధారిత అభివృద్ధి బలం పుంజుకోవడమే కాకుండా అంతర్గత మార్కెట్లతో అనుసంధానం మెరుగవుతుంది.

ప్రధానమంత్రి హిమ్మత్‌నగర్-ఖేడ్‌బ్రహ్మ గేజ్ మార్పిడి ప్రాజెక్టును (54.83 కిలోమీటర్లు) కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఇది ఉత్తర గుజరాత్‌లోని గిరిజన, పాక్షిక పట్టణ ప్రాంతాలకు అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. హిమ్మత్‌నగర్, ఖేడ్‌బ్రహ్మ పరిసర ప్రాంతాలు ఇప్పుడు బ్రాడ్ గేజ్ లైన్ల ద్వారా విస్తృత రైలు నెట్‌వర్క్‌తో నిరంతర సంధానం కాగలవు. దీనివల్ల రైళ్ల వేగం పెరగడమే కాకుండా సేవల మెరుగుదల సాధ్యమవుతుంది.

ఈ గేజ్ మార్పిడితో విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి అవకాశాల మెరుగుదల ద్వారా స్థానిక ప్రజలకు ప్రత్యేక ప్రయోజనం కలుగుతుంది. ఈ ప్రాంతాల్లోని రైతులకు, చిన్న వ్యాపారులకు భారీ మార్కెట్ల సౌలభ్యం చేకూరుతుంది. వ్యవసాయ ఉత్పత్తులను మరింత సమర్థంగా, తక్కువ వ్యయంతో రవాణా చేసే వెసులుబాటు లభించడమే కాకుండా ఆదాయార్జన సామర్థ్యం కూడా పెరుగుతుంది.

ప్రాంతీయ అనుసంధానం మరింత మెరుగుపరిచే ఖేడ్‌బ్రహ్మ–హిమ్మత్‌నగర్–అసర్వా రైలును కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ కొత్త రైలుతో సబర్‌కాంత వాసులకు అహ్మదాబాద్‌ వెళ్లే ప్రత్యక్ష రైలు సదుపాయం లభిస్తుంది. తద్వారా మారుమూల ప్రాంతాలు, పట్టణ కేంద్రాల మధ్య కీలక రవాణా అనుసంధానం ఏర్పడుతుంది. దీంతో జీవనోపాధి అవకాశాలు మెరుగుపడి, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతోపాటు ఈ ప్రాంతంలో పర్యాటక వృద్ధికి ప్రోత్సాహం లభిస్తుంది. అనుసంధానం మెరుగుదల ఫలితంగా ఆరోగ్య సంరక్షణ, విద్య, నిత్యావసర సేవల సౌలభ్యం ఇనుమడిస్తుంది. ఈ రైలు ద్వారా సురక్షిత, సౌలభ్య, సమర్థ ప్రయాణ సౌకర్యం లభించి దైనందిన ప్రయాణికులకు, విద్యార్థులకు, చికిత్స కోసం వెళ్లేవారికి ఎంతగానో ప్రయోజనం కలుగుతుంది.

మొత్తం మీద ఈ రైలు ప్రాజెక్టులు, సేవలన్నిటితో పారిశ్రామిక కూడళ్లు, ఓడరేవులు, వ్యవసాయ ప్రాంతాలు, పట్టణ కేంద్రాల మధ్య అనుసంధానం మెరుగుపడి ప్రాంతీయ ప్రగతిపై బహుగుణ ప్రభావం ఉంటుంది. ప్రయాణ సమయం తగ్గగడంతోపాటు విశ్వసనీయత మెరుగుపడి, వాణిజ్య-వ్యాపారాలకు ప్రోత్సాహం లభిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా సమ్మిళిత వృద్ధికి దోహదపడే ఈ మౌలిక సదుపాయాలు ఆధునిక, సమర్థ రైల్వే నెట్‌వర్క్‌ నిర్మాణంపై ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2247161) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Gujarati , Kannada