గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
‘ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా - 2026’ ప్రచురణ విడుదల
నాడు పోస్టు చేయడమైనది:
30 MAR 2026 1:46PM by PIB Hyderabad
‘ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా- 2026’ వార్షిక ప్రచురణను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్‌వో), గణాంక - కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేశాయి. మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ www.mospi.gov.inలో ఇది అందుబాటులో ఉంది.
2. బొగ్గు, లిగ్నైట్, పెట్రోలియం, సహజ వాయువు, పునరుత్పాదక ఇంధనం వంటి దేశంలోని అన్ని ఇంధన వనరుల నిల్వలు, సామర్థ్యం, ఉత్పత్తి, వినియోగం, ఎగుమతి/దిగుమతులకు సంబంధించిన కీలక సమాచారం ఉన్న సమగ్ర సమాచారం ఈ ప్రచురణలో ఉంది. వివిధ పట్టికలు (ఇంధన సమతౌల్యం వంటివి), గ్రాఫులు (సాంకీ రేఖాచిత్రం వంటివి), అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సుస్థిర ఇంధన సూచికలు కూడా ఈ ప్రచురణలో ఉన్నాయి.
ప్రచురణలో మెరుగుదల:
3. దేశీయ ఇంధన రంగాలకు రుణ లభ్యత, అంతర్జాతీయ ఇంధన గణాంకాల వంటి నూతన అంశాలను చేర్చడం ద్వారా ఈ ప్రచురణ 33వ ఎడిషన్ పరిధి విశేషంగా విస్తరించింది.
ఇ-వేలం ద్వారా దేశీయ బొగ్గు వినియోగం, దిగుమతి చేసుకున్న నాన్-కోకింగ్ బొగ్గు, వార్షిక పారిశ్రామిక సర్వే (ఏఎస్ఐ) డేటా ఆధారంగా పరిశ్రమల్లోని వివిధ ఉపరంగాల విద్యుత్ వినియోగ ధోరణుల వంటి పాత గణాంక లోపాలను సమర్థంగా అధిగమించింది. అంతేకాకుండా రిటైల్/ రీసెల్లర్ల ద్వారా పరిశ్రమల వారీగా హెచ్‌ఎస్‌డీ పంపిణీ వివరాలను, అంతర్జాతీయ విమానయాన, నౌకాయాన ఇంధన డేటా వంటి సమాచారాన్ని తొలిసారిగా దేశీయ ఇంధన సరఫరా/వినియోగ గణాంకాల్లో చేర్చారు.
4. తుది వినియోగ రంగాలను ప్రామాణీకరించడం ద్వారా.. అన్ని ఇంధన వనరుల రంగాల వారీ తుది వినియోగ గణాంకాల్లో ఈ ప్రచురణ సమన్వయాన్ని తీసుకొచ్చింది.
ముఖ్యాంశాలు
5. 2024-25లో భారత ఆర్థిక వ్యవస్థ మొత్తం ప్రాథమిక ఇంధన సరఫరా (టీపీఈఎస్)లో ఆరోగ్యకరమైన వృద్ధిని కనబరిచింది. గతేడాదితో పోలిస్తే ఇది 2.95 శాతం వృద్ధిని నమోదు చేస్తూ.. 9,32,816 కేటీవోఈ (కిలో టన్నుల చమురుకు సమానం) వద్ద నిలిచింది.
· పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో భారత్‌కు అపారమైన సామర్థ్యముంది. 2025 మార్చి 31 నాటికి ఇది 47,04,043 మెగావాట్లుగా ఉంది. మొత్తం సామర్థ్యంలో సౌరశక్తి అత్యధికంగా 71 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. ఇది 2023-24లో 7,48,990 మెగావాట్లుగా ఉండగా, 2024-25 నాటికి 33,43,378 మెగావాట్లకు చేరింది. అనంతరం పవన శక్తి 11,63,856 మెగావాట్లతో, భారీ జలవిద్యుత్ 1,33,410 మెగావాట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశంలోని మొత్తం పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో 70 శాతానికి పైగా వాటా ఆరు రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమై ఉంది. అవి: రాజస్థాన్ (23.70%), మహారాష్ట్ర (14.26%), గుజరాత్ (9.10%), ఆంధ్రప్రదేశ్ (9.1%), కర్ణాటక (8.59%), మధ్యప్రదేశ్ (8.09%).
· పునరుత్పాదక ఇంధన వనరుల (వినియోగ, వినియోగేతర) ద్వారా విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యం కొన్నేళ్లుగా గణనీయమైన వృద్ధిని సాధించింది. 2016 మార్చి 31 నాటికి 90,134 మెగావాట్లుగా ఉన్న ఈ సామర్థ్యం.. 2025 మార్చి 31 నాటికి 2,29,346 మెగావాట్లకు చేరింది. ఈ సమయంలో 10.93% సమ్మిళిత వార్షిక వృద్ధి రేటును (సీఏజీఆర్) నమోదు చేసింది.
· కొన్నేళ్లలో పునరుత్పాదక ఇంధన వనరుల (వినియోగ, వినియోగేతర) ద్వారా స్థూల విద్యుదుత్పత్తిలోనూ గణనీయమైన వృద్ధి నమోదైంది. 2015-16లో ఇది 1,89,314 గిగావాట్ అవర్ల విద్యుదుత్పత్తి కాగా, 2024-25 నాటికి అది 4,16,823 గిగావాట్ అవర్లకు చేరుకుంది. ఈ కాలంలో 9.17% సమ్మిళిత వార్షిక వృద్ధి రేటును (సీఏజీఆర్) ఇది సూచిస్తుంది.
· గడిచిన కొన్నేళ్లలో దేశంలో తలసరి ఇంధన వినియోగంలో స్థిరమైన వృద్ధి నమోదైంది. 2015-16లో ఒక వ్యక్తికి సగటున 15,296 మెగా జూల్స్ ఇంధన వినియోగం ఉండగా, 2024-25లో అది 18,096 మెగా జూల్స్‌కు చేరింది. ఈ కాలంలో 1.89% సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)ను ఇది సూచిస్తుంది.
· ప్రసార, పంపిణీపరమైన నష్టాలు తగ్గడం వల్ల.. కొన్నేళ్లుగా విద్యుత్ వినియోగం గణనీయంగా మెరుగుపడింది. 2015-16లో ప్రసారం, పంపిణీ కారణంగా ఏర్పడిన నష్టం దాదాపు 22 శాతం ఉండగా.. 2024-25లో అది దాదాపు 17 శాతానికి చేరింది.
· ఇంధన సరఫరా వనరులన్నింటిలోనూ బొగ్గు అత్యంత ప్రధానమైన వనరుగా కొనసాగుతోంది. మొత్తం ఇంధన సరఫరాలో సింహభాగాన్ని అది ఆక్రమిస్తోంది. బొగ్గు (లిగ్నైట్‌తో కలిపి) ద్వారా లభించే ఇంధన సరఫరా 2015-16లో 3,87,761 కేటీఓఈ ఉండగా.. 2024-25 నాటికి అది 5,52,315 కేటీఓఈలకు పెరిగింది. ముడి చమురు, సహజ వాయువు వంటి ఇతర వనరులు కూడా కాలక్రమేణా స్థిరమైన వృద్ధిని నమోదు చేశాయి.
· వివిధ తుది వినియోగ రంగాల్లో.. మొత్తం ఇంధన తుది వినియోగం (టీఎఫ్‌సీ)లో కూడా స్థిరమైన పెరుగుదల నమోదైంది. 2015-16లో ఇంధన టీఎఫ్‌సీ 4,69,212 కేటీఓఈ ఉండగా.. 2024-25లో అది 6,08,578 కేటీఓఈకి పెరిగింది. ఇందులో 30.41 శాతానికి పైగా వృద్ధి నమోదైంది.
· దేశంలో ఇంధన రంగానికి రుణ ప్రవాహం కూడా కొన్నేళ్లుగా స్థిరమైన వృద్ధిని సాధించింది. 2021లో రూ. 1,688 కోట్ల నుంచి 2025 నాటికి రూ. 10,325 కోట్లకు చేరింది. ఈ తక్కువ కాలంలోనే ఆరు రెట్లకు పైగా వృద్ధి నమోదైంది.
***
(రిలీజ్ ఐడి: 2247160)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8