నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

లిక్విడ్ బల్క్ కెపాసిటీతో పాటు నౌక వాణిజ్య సామర్థ్యాన్ని పెంచే దృష్టితో న్యూ మంగళూరు పోర్టులో 9వ నంబరు బెర్తు పునరభివృద్ధికి ప్రభుత్వం ఆమోద ముద్ర

నాడు పోస్టు చేయడమైనది: 30 MAR 2026 11:05AM by PIB Hyderabad

న్యూ మంగళూర్ పోర్ట్ అథారిటీ (ఎన్ఎమ్‌పీఏ)  తొమ్మిదో నంబరు బెర్త్ పునరభివృద్ధి కోసం తీసుకువచ్చిన ప్రతిపాదనను ఓడరేవులు, నౌకాయానం, జల మార్గాల శాఖ గౌరవ మంత్రి ఆమోదించారు. ఇది భారత నౌకాశ్రయాల సంబంధిత మౌలిక సదుపాయాలను పెంచడంతో పాటు నౌకా వాణిజ్య సంబంధిత ఆధునిక రవాణా వ్యవస్థను పటిష్ట పరిచే దిశగా తీసుకున్న ఒక ప్రధాన నిర్ణయం. డీబీఎఫ్‌ఓటీ మోడల్‌లో భాగంగా ద్రవ రూప భారీ ఓడ సరుకు (లిక్విడ్ బల్క్ కార్గో)ను ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్య (పీపీపీ) ప్రాతిపదికన నిర్వహించడానికి 9వ నంబరు బెర్తును సరికొత్తగా పునరభివృద్ధిపరచడానికి సంబంధించిన ప్రతిపాదన ఇది.
ఈ ప్రాజెక్టులో భాగంగా ఇదివరకటి మౌలిక సదుపాయాలను తొలగించి, 9వ నంబరు బెర్తును పెద్ద ఎత్తున తిరిగి అభివృద్ధి పరుస్తారు. ఈ పునరభివృద్ధి పనులను పూర్తి చేసిన తరువాత 9వ నంబరు బెర్తు ముడి చమురు, పెట్రోలియమ్ ఉత్పాదనలు (పీఓఎల్), ఎల్‌పీజీ వంటి ద్రవ రూప భారీ ఓడ సరుకు (లిక్విడ్ బల్క్ కార్గో)ను  నిర్వహించగలుగుతుంది. ఆధునికీకరణలో భాగంగా, బెర్త్ డ్రాఫ్టును ఇప్పుడున్న 10.5 మీటర్ల స్థాయి నుంచి 14 మీటర్లకు పెంచుతారు. భవిష్యత్తులో 19.8 మీటర్ల వరకూ విస్తరించేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఫలితంగా చాలా పెద్ద గ్యాస్ క్యారియర్లు (వెరీ లార్జ్ గ్యాస్ క్యారియర్స్.. వీఎల్‌జీసీస్) సహా 2,00,000 డీడబ్ల్యూటీ (డెడ్ వెయిట్ టన్నేజి) వరకూ ఉండే నౌకలకు కూడా వసతిని కల్పించగల స్థాయిని ఈ ఓడరేవు అందుకుంటుంది.
కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జల మార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సొనొవాల్ ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని వివరిస్తూ, ‘‘ఈ మార్పునకు దారి తీసే ప్రాజెక్టు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గాని దార్శనిక నాయకత్వానికి అద్దం పడుతోంది. ప్రధానమంత్రి సారథ్యంలో భారత నౌకా వాణిజ్య సంబంధిత మౌలిక సదుపాయాల్ని ఇదివరకెన్నడూ ఎరుగనంత వేగంగా ఆధునికీకరిస్తున్నాం. కాలం చెల్లిన సదుపాయాల స్థానంలో, ప్రపంచ శ్రేణి నౌక వాణిజ్య మౌలిక సదుపాయాల్ని నిర్మించడం, సరకు నిర్వహణ సామర్థ్యాన్ని 10.90 ఎమ్‌టీపీఏ స్థాయికి పెంపొందించడంతో పాటు చాలా పెద్ద గ్యాస్ క్యారియర్లు సహా పెద్ద పెద్ద నౌకల్ని నిర్వహించే ఏర్పాట్లు కల్పిస్తూ మన నౌకాశ్రయాలను భావి ఇంధన, వాణిజ్య అవసరాలను తీర్చే స్థితికి తీసుకుపోతున్నాం. అదే సమయంలో ప్రపంచ నౌకావాణిజ్య రంగంలో నాయకత్వ పాత్రను దక్కించుకొనేటట్లు భారత్‌‌ స్థానాన్ని పటిష్ఠపరుస్తున్నామ’’న్నారు.  
సుమారు రూ.438.29 కోట్లు ఖర్చు కావచ్చని అంచనా వేస్తున్న ఈ పునరభివృద్ధి పనులను అనుమతి పొందిన ఒక ప్రయివేటు వాణిజ్య సంస్థ (కన్సెషనేర్) ద్వారా చేపట్టనున్నారు.  పాల్గొనడానికి అన్ని వర్గాలకూ అవకాశం ఉండే స్పర్ధాత్మక వేలం పాట ప్రక్రియ (ఒకే ఒక దశ, రెండు స్థాయిల వ్యవస్థ)ను అనుసరించి కన్సెషనేర్‌ను ఎంపిక చేస్తారు. ఒక్కో సంవత్సరంలో 10.90 మిలియన్ టన్నుల నిర్వహణ సామర్థ్యం (ఎమ్‌టీపీఏ) ఈ ప్రాజెక్టుకు ఉంటుంది. నిర్వహణ కార్యకలాపాల్ని మొదలుపెట్టిన తరువాత 5వ సంవత్సరంలో 7.63 ఎమ్‌టీపీఏ స్థాయిలో కనీస పూచీకత్తుతో కూడిన ఓడ సరుకు (మినిమం గ్యారంటీడ్ కార్గో.. ఎమ్‌జీసీ) నిర్వహణ కార్యకలపాలకు కన్సెషనేర్ కట్టుబడుతుంది. ప్రాజెక్టు నిర్మాణ కాలం 2 సంవత్సరాలు. నిర్మాణ కాలాన్ని కూడా కలిపి, రాయితీల అనుమతి కాలాన్ని 30 సంవత్సరాలుగా ఖాయం చేశారు.
ఈ ప్రాజెక్టుతో ముఖ్యమైన వ్యూహాత్మక, నిర్వహణ సంబంధ ప్రయోజనాలు లభిస్తాయని ఆశిస్తున్నారు. దీనిలో భాగంగా సుమారు 50 సంవత్సరాల పాతవైన నిర్మాణాల స్థానే ఆధునిక నౌకా వాణిజ్య సంబంధిత మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. వీటిని 50 సంవత్సరాల పాటు మనగలిగేటట్లు డిజైన్ చేశారు. దీనితో దీర్ఘకాలిక స్థిరత్వంతో పాటు దృఢత్వం నెలకొంటుంది. ఓడరేవు సామర్థ్యాన్ని పెంచుతున్నందువల్ల, అంతకంతకూ పెరుగుతున్న లిక్విడ్ బల్క్ కార్గో అవసరాలను.. మరీ ముఖ్యంగా ఇంధన వస్తువుల డిమాండును పూర్తి చేసే సత్తాను పోర్టు సమకూర్చుకోనుంది.
పెద్ద నౌకలు, వీఎల్‌జీసీల నిర్వహణకు వీలు కల్పించడం ద్వారా, భారీ స్థాయి కార్యకలాపాలతో సమకూరే ప్రయోజనాలను  ఈ ప్రాజెక్టు మెరుగుపరచడమే కాకుండా, ఆధునిక రవాణా వ్యవస్థ తాలూకు ఖర్చులను తగ్గించడంతో పాటు ఓడరేవు పోటీ తత్వాన్నీ పెంచుతుంది. యంత్రీకరణ, అధిక సామర్థ్యం గల మెరైన్ అన్‌లోడింగ్ ఆర్మ్‌స్ (ఎమ్‌యూఎల్ఏస్), స్వయంచాలక లంగరు వ్యవస్థల అమరికతో నిర్వహణ సామర్థ్యం గణనీయంగా మెరుగుపడుతుంది.
ఈ ప్రాజెక్టులో ఆధునిక అగ్నిమాపక సంబంధిత మౌలిక సదుపాయాలు, నత్రజని ఉత్పాదన స్కిడ్లు, ఏకీకృత నియంత్రణ వ్యవస్థలు సహా ఉన్నత భద్రత, నియమపాలక వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. వీటి సాయంతో ప్రమాదకర, అపాయకారి ద్రవ రూప ఓడసరుకును సురక్షితంగా నిర్వహించడం సాధ్యపడుతుంది.
ఆర్థిక దృష్టికోణం నుంచి గమనిస్తే, ఈ ప్రాజెక్టు సరకు రాశులతో ముడిపడిన నిర్దిష్ట రాయల్టీ చెల్లింపులకు ఆస్కారం కల్పిస్తుంది. తప్పనిసరైన ఎమ్‌జీసీ వాగ్దానాలతో పోర్ట్ అథారిటీకి స్థిరమైన, నిరంతర ఆదాయ మార్గాలను సమకూరుస్తుంది.
వ్యూహాత్మక దృష్టికోణంలో నుంచి పరిశీలించినప్పుడు.. కర్నాటక, కేరళల లోపలి ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొంటే న్యూ మంగళూరు ఓడరేవు స్థితిని ఒక ప్రధాన నౌక వాణిజ్య ప్రవేశ ద్వారంగా ఈ పునరభివృద్ధి  పనులు పటిష్ట పరుస్తాయి. దీంతో వాణిజ్యానికి మార్గం సుగమం కాగలదు. అంతేకాదు, పారిశ్రామిక అభివృద్ధికీ మద్దతు లభిస్తుంది. సరఫరా వ్యవస్థలో బలం ఇప్పటితో పోలిస్తే అధికం అవుతుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2246914) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Kannada