గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పట్టణ ప్రాంతాల్లో ‘పీఎన్‌జీ’ సహా నిత్యావసర సేవల విస్తరణ-నిర్వహణపై రౌండ్‌టేబుల్ సమావేశం


· దేశవ్యాప్తంగా 50 లక్షల కొత్త ‘పీఎన్‌జీ’ కనెక్షన్లు ఇవ్వడం ప్రతిష్టాత్మక లక్ష్యంగా నిర్దేశించిన సమావేశం

నాడు పోస్టు చేయడమైనది: 28 MAR 2026 4:59PM by PIB Hyderabad

దేశంలోని పట్టణ ప్రాంతాల్లో “పైపుల ద్వారా సహజ వాయువు (పీఎన్‌జీ) సరఫరాతోపాటు నిత్యావసర సేవల నిర్వహణ” ప్రధానాంశంగా ఈ రోజు న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో రౌండ్‌టేబుల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘పీఎన్‌జీ’ నెట్‌వర్క్ విస్తరణను వేగిరపరచడం సహా నిరంతర నిత్యావసర సేవల ప్రదానానికి భరోసా ఇవ్వడంపై ఈ సమావేశంలో కీలక భాగస్వామ్య వ్యవస్థల ప్రతినిధులు చర్చించారు.

కేంద్ర గృహ-పట్టణ వ్యవహారాల శాఖ, పెట్రోలియం-సహజ వాయువు శాఖ, వినియోగదారు వ్యవహారాలు-ఆహార-ప్రజా పంపిణీ శాఖల మంత్రులు, కార్యదర్శులు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు రాష్ట్రాల మంత్రులు, పట్టణాభివృద్ధి, ఆహార-పౌర సరఫరాల శాఖల కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్లు సహా గెయిల్‌, ఇండియన్ ఆయిల్ సంస్థల ‘సీఎండీ’లు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) యూనిట్ల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ మేరకు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, ఒడిషా సహా వివిధ రాష్ట్రాల మంత్రులు ప్రత్యక్షంగా హాజరు కాగా- తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల ప్రతినిధులు ఆన్‌లైన్‌ మాధ్యమం ద్వారా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పట్టణ ఇంధన డిమాండ్‌ పెరుగుదలను కేంద్ర గృహ-పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ అవసరాలను తీర్చడానికి స్వచ్ఛమైన ఇంధన లభ్యత విస్తరణతో పాటు సమర్థ సేవల ప్రదానం ఆవశ్యకత ఉందని స్పష్టం చేశారు.

‘ఎల్‌పీజీ’ వంటగ్యాస్‌తో పోలిస్తే భద్రత, విశ్వసనీయత, చౌక ధర, పర్యావరణ సుస్థిరత పరంగా ‘పీఎన్‌జీ’ ఎంతో ప్రయోజనకరమని పెట్రోలియం-సహజ వాయువుల మంత్రిత్వ శాఖ బృందం సోదాహరణంగా విశదీకరించింది. అయితే- మున్సిపల్ అనుమతులలో జాప్యం, ‘రైట్ ఆఫ్ వే’ ఆమోదం, అధిక పునరుద్ధరణ ఛార్జీలు వంటివి సకాలంలో నెట్‌వర్క్‌ విస్తరణకు ఆటంకం కలిగిస్తున్న  కీలక సమస్యలుగా పేర్కొన్నారు.

గృహ-పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్ మాట్లాడుతూ- దేశ ఆర్థిక వృద్ధికి నగరాలు కీలక చోదక శక్తులని చెప్పారు. అందువల్ల నగరాల్లో ‘పీఎన్‌జీ’ నెట్‌వర్క్‌ విస్తరణను ఉద్యమ పంథాలో వేగిరపరచాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే సింగిల్-విండో ఆమోదాల సంస్థాగతీకరణ, పట్టణ ప్రణాళికలలో ‘పీఎన్‌జీ' మౌలిక సదుపాయాల ఏకీకరణ, చివరి అంచెదాకా సంధాన సౌలభ్యం, ఇప్పటికే కొనసాగుతున్న పట్టణాభివృద్ధి కార్యక్రమాలతో అనుసంధానం వంటివి కీలక ప్రాథమ్యాలని  మంత్రి చెప్పారు. తద్వారా 50 లక్షల కొత్త కనెక్షన్ల ప్రతిష్టాత్మక లక్ష్యం సాధించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు.

అనంతరం పెట్రోలియం-సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి ప్రసంగిస్తూ- పరిణామశీల ప్రపంచ ఇంధన రంగ స్వరూపాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఇంధన భద్రత, పునరుత్థాన సామర్థ్యం పెంపులో భాగంగా ‘పీఎన్‌జీ’ మౌలిక సదుపాయాల బలోపేతం ప్రాధాన్యాన్ని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇప్పటికే మౌలిక సదుపాయాలు అందుబాటులోగల ప్రాంతాల్లో పీఎన్‌జీ వినియోగాన్ని మరింత ప్రోత్సహించాలని రాష్ట్రాలకు, పట్టణ స్థానిక సంస్థల పాలక వర్గాలకు మంత్రి సూచించారు.

వినియోగదారుల వ్యవహారాలు-ఆహారం-ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ- నిరంతర నిత్యావసరాల సరఫరా, తప్పుదోవ పట్టించే సమాచార నిరోధం, ఇంధనం అక్రమ విక్రయ నివారణ చర్యల ఆవశ్యకతను స్పష్టం చేశారు. ఈ దిశగా పర్యవేక్షణ-నిఘా యంత్రాంగాల బలోపేతం, సాధ్యమైనంత మేర ‘ఎల్‌పీజీ' నుంచి ‘పీఎన్‌జీ’ వినియోగం వైపు ప్రజలను ప్రోత్సహించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేకించి పాఠశాలలు, కళాశాలల వంటి ప్రభుత్వ సంస్థలకు ఇందులో ప్రాధాన్యమివ్వాలని రాష్ట్రాలకు ఆయన సూచించారు.

రోడ్-కటింగ్ అనుమతులను వేగిరపరచడం, ప్రాజెక్టుల పనుల సత్వర నిర్వహణ కోసం నిర్దిష్ట ఆమోద విధానాల అనుసరణ వంటి అనేక ఉత్తమ పద్ధతులను పాటించాలని ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులందరూ అభిప్రాయపడ్డారు. అయితే, అధిక ‘రైట్‌ ఆఫ్‌ వే’ రుసుములు, విధానపరమైన జాప్యాలపై ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని హేతుబద్ధీకరించడం లేదా తాత్కాలికంగా మాఫీ చేయడం సహా సింగిల్-విండో, వ్యవధి సహిత అనుమతి వ్యవస్థల ఏర్పాటు అవసరాన్ని స్పష్టం చేశారు.

సమావేశంలో చర్చల సందర్భంగా రాష్ట్ర ప్రతినిధులు తమ అనుభవాలను పంచుకున్నారు. అలాగే,  ప్రణాళికల నిరంతర అమలులో పట్టణాభివృద్ధి శాఖలు, పురపాలక సంస్థలు, ఆహార-పౌర సరఫరా శాఖల మధ్య మెరుగైన సమన్వయం అవసరాన్ని స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాలు అందుబాటులోగల ప్రాంతాల్లో వినియోగదారులకు అవగాహన పెంపుతోపాటు నిత్యావసర సేవలకు అంతరాయం నివారణ అవశ్యమని పేర్కొన్నారు. అంతేకాకుండా ‘ఎల్‌పీజీ’ నుంచి పీఎన్‌జీ’కి దశలవారీగా, నిర్మాణాత్మకంగా మారే సౌలభ్యం కల్పనలో రక్షణ చర్యల మద్దతుపై విస్తృత ఏకాభిప్రాయం వ్యక్తమైంది.

ఆమోద ప్రక్రియను క్రమబద్ధీకరణ, రోడ్‌ కటింగ్‌ ఛార్జీల హేతుబద్ధీకరణ, సమర్థ సమన్వయం కోసం నోడల్ అధికారుల నియామకం తదితరాలపై రాష్ట్రాలు, పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గాలు అంగీకారం తెలిపాయి. కార్యాచరణలో సమస్యల పరిష్కారం, సేవల ప్రదానం మెరుగు దిశగా సన్నిహిత సహకారానికి ‘సీజీడీ’లు, పురపాలక కమిషనర్లు నిబద్ధత ప్రకటించారు.

ఈ రౌండ్‌టేబుల్ సమావేశం తర్వాత ‘సీజీడీ’ సంస్థలు, పురపాలక కమిషనర్లతో ఒక మధ్యంతర సమావేశం నిర్వహించారు. నగరాల వారీ సమస్యలు, కీలక అవరోధాల గుర్తింపు, పెండింగ్‌ ఆమోదాలు తదితరాలపై ఈ సందర్భంగా చర్చించారు. ‘పీఎన్‌జీ' నెట్‌వర్క్ విస్తరణలో జవాబుదారీతనం, సకాలంలో ప్రగతికి భరోసా, నిర్దిష్ట వ్యవధితో నిర్మాణాత్మక కార్యాచరణ ప్రణాళికకు ఆమోదం, స్థానిక కార్యాచరణ బృందాల ఏర్పాటు సహా క్రమబద్ధ పర్యవేక్షణ-సమీక్ష యంత్రాంగాల అమలు తదితరాలపై అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు.

 

***


(రిలీజ్ ఐడి: 2246549) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Gujarati , English , Urdu , Marathi , हिन्दी