సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్త ఏవీజీసీ-ఎక్స్ఆర్ వ్యవస్థకు నాయకత్వం వహిస్తోన్న ఐఐసీటీ దేశవ్యాప్త సహకారం కోసం 'హబ్-అండ్-స్పోక్' నమూనా అమలు
నాడు పోస్టు చేయడమైనది:
27 MAR 2026 5:17PM by PIB Hyderabad
ఏవీజీసీ-ఎక్స్ఆర్ రంగం వృద్ధికి సమగ్ర వ్యూహాన్ని రూపొందించటం, విధానపరమైన చర్యలకు మార్గదర్శకత్వం వహించడానికి సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖ 2022 ఏప్రిల్‌లో 'ఏవీజీసీ ప్రోత్సాహక టాస్క్ ఫోర్స్'ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్‌ఫోర్స్ నివేదికలో రాష్ట్రాల్లో ఏవీజీసీ-ఎక్స్‌ఆర్ వ్యవస్థ అభివృద్ధికి మద్దతుగా ఒక 'రాష్ట్ర స్థాయి నమూనా విధానం ఫ్రేమ్‌వర్క్‌ను (మోడల్ స్టేట్ పాలసీ ఫ్రేమ్‌వర్క్)' కూడా సిద్ధం చేసింది.
అంతర్జాతీయ ఏవీజీసీ-ఎక్స్ఆర్ కేంద్రంగా భారత్‌ను మార్చడంలో భాగంగా కేంద్ర క్యాబినెట్ 'జాతీయ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ కేంద్రానికి ముంబయిలోని 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ' (ఐఐసీటీ) అని పేరు పెట్టారు.
రాష్ట్రాలతో సమన్వయం, సామర్థ్య పెంపుదల ప్రయత్నాలకు తోడ్పాటునందించే ఒక జాతీయ కేంద్రంగా 'ఐఐసీటీ' ఉంటుందన్న అంచనా ఉంది. ఏవీజీసీ రంగంలో ప్రాంతీయ నైపుణ్యాలు, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ల అభివృద్ధికి దోహదపడే సంస్థలతో అనుసంధానం కావడానికి ఇది సహాయపడుతుంది. దేశవ్యాప్తంగా పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఇతర భాగస్వాముల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి ఈ సంస్థను 'హబ్-అండ్-స్పోక్' నమూనాలో అభివృద్ధి చేస్తున్నారు.
అంతర్జాతీయ సాంకేతిక సంస్థలు, పరిశ్రమల భాగస్వాములు, విద్యా సంస్థలతో కలిసి ఐఐసీటీ పని చేస్తుంది. ఈ సహకారం ప్రధానంగా పాఠ్య ప్రణాళిక రూపకల్పన, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల అభివృద్ధి, పరిశోధన - అభివృద్ధి, ఇంటర్న్‌షిప్‌లు, ఉపకార వేతనాలు, అంకుర ఇంక్యుబేషన్ వంటి అంశాలపై పనిచేస్తుంది. తద్వారా పరిశ్రమ-విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ ఏవీజీసీ-ఎక్స్ఆర్ రంగంలో నైపుణ్యం కలిగిన ప్రతిభను అభివృద్ధి చేయడానికి ఇది తోడ్పడుతుంది.
ఈ సంస్థ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు, శిక్షణార్థులను ఆకర్షిస్తోంది. తద్వారా ఏవీజీసీ-ఎక్స్ఆర్ రంగంలో అఖిల భారత స్థాయి నైపుణ్యమైన మానవ వనరుల సమూహాన్ని ప్రోత్సహిస్తోంది.
ఏవీజీసీ-ఎక్స్ఆర్ రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు వివిధ అంశాలపై కేంద్ర మంత్రిత్వ శాఖ క్రమబద్ధంగా రాష్ట్రాలతో వర్క్‌షాపులు, సదస్సులు, వెబినార్లను నిర్వహిస్తోంది.
ఈ రోజు రాజ్యసభలో శ్రీ సన సతీష్ బాబు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ఈ సమాచారాన్ని సమర్పించారు.
***
(రిలీజ్ ఐడి: 2246492)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11