ఎరువుల విభాగం
azadi ka amrit mahotsav

ఎరువుల ఉత్పత్తికి భరోసాతోపాటు రైతుకు తగినంత లభ్యత దిశగా పటిష్ఠ చర్యలు చేపట్టిన ప్రభుత్వం


· ఎరువుల రంగానికి మొత్తం సహజ వాయువు సరఫరా గత 6 నెలల సగటు వినియోగంలో దాదాపు 80 శాతానికి చేరిక

నాడు పోస్టు చేయడమైనది: 27 MAR 2026 5:32PM by PIB Hyderabad

సహజ వాయువు సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పటికీ ఎరువుల ఉత్పత్తికి భరోసాతోపాటు రైతుకు తగినంత లభ్యత కోసం కేంద్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంది. ఈ అంశంపై ఇవాళ లోక్‌సభలో ఒక సభ్యుడి ప్రశ్నకు రసాయనాలు-ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ ఎస్.పటేల్ లిఖితపూర్వక జవాబిచ్చారు. మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిణామాల ఫలితంగా తలెత్తిన అనివార్య పరిస్థితుల దృష్ట్యా ఈ నెల 9న నిత్యావసర వస్తువుల చట్టం-1955 కింద సహజ వాయువు (సరఫరా నియంత్రణ) ఉత్తర్వు-2026ను జారీ చేశామని ఆమె తెలిపారు. ఈ ఉత్తర్వు ప్రకారం- ఎరువుల కర్మాగారాలను ప్రాధాన్య రంగం-IIగా ప్రభుత్వం ప్రకటించింది. కర్మాగారాల పనితీరును బట్టి, వాటి గత 6 నెలల సగటు వినియోగంలో సుమారు 65 శాతం సహజ వాయువు సరఫరా కొనసాగింది.

అయితే, ఎరువుల రంగానికి సరఫరా మరింత పెంపు దిశగా ఈ నెల 18 నుంచి 31 వరకూ ‘ఎంపవర్డ్‌పూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఈపీఎంసీ) బిడ్డింగ్ ప్రక్రియ ప్రాతిపదికన అదనంగా ~7.31 ‘ఎంఎంఎస్‌సీఐఎండీ’ సహజ వాయువును కొనుగోలు చేశారు. దీంతో ఎరువుల రంగానికి మొత్తం సహజ వాయు లభ్యత గత 6 నెలల సగటు వినియోగంలో ~80 శాతానికి పెరిగింది.

ఇక ఈ నెల 1 నుంచి 24వ తేదీ వరకూ 13.55 ‘ఎల్‌ఎంటీ’ దేశీయ యూరియాను ఉత్పత్తి చేయగా, దాంతోపాటు ఇదే వ్యవధిలో ‘డీఏపీ, ఎన్‌పీకే’ ఎరువులు 7.62 ‘ఎల్‌ఎంటీ’, ‘ఎస్‌ఎస్‌పీ’ ఎరువు 3.06 ‘ఎల్‌ఎంటీ’ వంతున తయారయ్యాయి.

దేశంలో ప్రతి పంటకాలం ప్రారంభానికి ముందు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపుల ద్వారా నెలల వారీగా వాటి ఎరువుల అవసరాన్ని కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమ శాఖ అంచనా వేస్తుంది. ఈ అంచనాలను బట్టి ఎరువుల శాఖ నెలవారీ సరఫరా ప్రణాళికను ప్రకటించి, ఆయా రాష్ట్రాలకు తగు పరిమాణంలో ఎరువులు కేటాయించడంతోపాటు వాటి లభ్యతను సదా పర్యవేక్షిస్తుంది.

ఈ మేరకు పేర్కొన్న అంశాల దృష్ట్యా 23.03.2026 నాటికి దేశంలోని ప్రస్తుత ఎరువుల నిల్వలో యూరియా 53.08 లక్షల టన్నులు, ‘డీఏపీ’ 21.80 లక్షల టన్నులు, ‘ఎంఓపీ’ 7.98 లక్షల టన్నులు, ‘ఎన్‌పీకే' 48.38 లక్షల టన్నుల వంతున ఉన్నాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2246489) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी