ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

అత్యవసర పరిస్థితి సమయంలో ఖాళీ సంపాదకీయాన్ని ప్రచురించడం ద్వారా నిశ్శబ్దానికి ఉన్న శక్తిని చాటిచెప్పిన శ్రీ రామ్ నాథ్ గోయెంకా: ఉపరాష్ట్రపతి


20వ ‘రామ్‌నాథ్ గోయెంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం’ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి

వృత్తిపరమైన విజయం, నిర్భయమైన విలువలతో కూడిన జర్నలిజం స్ఫూర్తిని కొనియాడుతున్న ‘రామ్‌నాథ్ గోయెంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం’ అవార్డులు: ఉపరాష్ట్రపతి

చర్చలు, వాదోపవాదాలు, భిన్నాభిప్రాయాలు జాతీయ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు తీసుకోవడానికి దారితీయాలి తప్ప ఆటంకాలు సృష్టించడానికి కాదు: ఉపరాష్ట్రపతి

వలసవాద మనస్తత్వాలను వదిలివేసే ప్రయత్నంలో వార్తాపత్రికలు ముందుండాలి: ఉపరాష్ట్రపతి

నాడు పోస్టు చేయడమైనది: 27 MAR 2026 8:26PM by PIB Hyderabad

ఈ రోజు ఢిల్లీలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ నిర్వహించిన 20వ ‘రామ్‌నాథ్ గోయెంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం’ అవార్డుల ప్రధానోత్సవంలో ఉపరాష్ట్రపతి శ్రీ సీ.పీ. రాధాకృష్ణన్ ప్రసంగించారు.

వృత్తిపరమైన విజయాలనే కాకుండా నిర్భయమైన, విలువలతో కూడిన జర్నలిజానికి ఉన్న శాశ్వత స్ఫూర్తిని కూడా ఈ అవార్డులు తెలియజేస్తున్నాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ అవార్డులు 20వ వార్షికంలోకి అడుగుపెట్టడాన్ని ప్రస్తావించిన ఆయన… భారతదేశ చరిత్రలో అత్యంత సవాలుతో కూడిన కాలంలో ధైర్యం, స్వేచ్ఛ, సత్యం పట్ల అచంచలమైన నిబద్ధతకు నిదర్శనంగా నిలిచిన శ్రీ రామ్ నాథ్ గోయెంకా వారసత్వాన్ని ఇవి గౌరవిస్తున్నాయని  అన్నారు. మీడియా శక్తిమంతంగా ఉండటంతో పాటు తీవ్రమైన పరిశీలనకు గురవుతున్న నేటి యుగంలో శ్రీ రామ్‌నాథ్ గోయెంకా ఆశయాలు ఇప్పటికీ మార్గదర్శిగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.

క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బ్రిటీష్ సెన్సార్‌షిప్‌కు నిరసనగా వార్తాపత్రికను మూసివేసిన శ్రీ రామ్‌నాథ్ గోయెంకా పాత్రను ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా ఆయన చేసిన సహకారాన్ని,   ముఖ్యంగా వార్తాపత్రికలపై పన్నుల వంటి అంశాలపై ఆయన చేసిన కృషిని కూడా ఈ సందర్భంగా శ్రీ సీ.పీ. రాథాకృష్ణన్ గుర్తు చేశారు. 

భారత్‌లో అత్యవసర పరిస్థితి కాలం గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి..  ఒక ఖాళీ సంపాదకీయాన్ని ప్రచురించడం ద్వారా నిశ్శబ్దానికి ఉన్న శక్తిని శ్రీ రామ్‌నాథ్ గోయెంకా చాటిచెప్పారని పేర్కొన్నారు. ఇది పత్రికా స్వేచ్ఛా, ప్రజల భావ వ్యక్తీకరణ హక్కుకు ఒక శక్తిమంతమైన చిహ్నంగా మారిందని ఆయన అన్నారు. సంపాదకుల అరెస్టులు, విద్యుత్ సరఫరా నిలిపివేత, ఆర్థిక నష్టాలు, వేధింపులను ఎదుర్కొన్నప్పటికీ ప్రజాస్వామ్య విలువలు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పట్ల శ్రీ రామ్‌నాథ్ గోయెంకా నిబద్ధతలో అచంచలంగా నిలిచారని ఉపరాష్ట్రపతి కొనియాడారు.

దర్భంగా నుంచి చెన్నై వరకు, తదనంతరం విదిశ నుంచి పార్లమెంటు సభ్యుని వరకు సాగిన శ్రీ రామ్‌నాథ్ గోయెంకా జీవన ప్రయాణం.. భారత్‌లోని 'భిన్నత్వంలో ఏకత్వం' సారాంశాన్ని ప్రతిబింబిస్తుందని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. వార్తాపత్రికలు మరింత విస్తృతంగా ప్రజల్లోకి చేరాలని శ్రీ రామ్‌నాథ్ గోయెంకా ఇంగ్లీషుతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో కూడా పత్రికలను ప్రచురించారని ఆయన గుర్తు చేశారు. నిష్పాక్షికత, ధైర్యం, స్వేచ్ఛకు చిహ్నంగా 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్'ను తీర్చిదిద్దిన ఆయన విలువలు నేటికీ కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

చర్చలు, వాదోపవాదాలు, భిన్నాభిప్రాయాలు చివరకు జాతీయ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు తీసుకోవడానికి దారితీయాలి తప్ప ఆటంకాలు సృష్టించేవిగా ఉండకూడదని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

వలసవాద మనస్తత్వాలను వదిలివేయాలని ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపును ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశ నాగరికత, విలువలతో కూడిన భారతీయ దృక్పథంతో ప్రపంచ, జాతీయ పరిణామాలను ప్రజలకు వివరించడంలో 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' వంటి మీడియా సంస్థలు కీలక పాత్ర పోషించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

అభివృద్ధి, ఆవిష్కరణలు, అట్టడుగు స్థాయిలో జరుగుతున్న మార్పులకు సంబంధించిన కథనాలను వెలుగులోకి తీసుకురావాల్సిన ప్రాముఖ్యతను ఉపరాష్ట్రపతి ప్రధానంగా చెప్పారు. సమతుల్యమైన కథనం అనేది సవాళ్లతో పాటు సాధించిన విజయాలను కూడా ప్రతిబింబించాలని ఆయన పేర్కొన్నారు.

ప్రసంగాన్ని ముగిస్తూ అవార్డు విజేతలందరినీ ఉపరాష్ట్రపతి అభినందించారు. జర్నలిజంలో అత్యుత్తమ ప్రతిభను గుర్తించే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు నిర్వాహకులను ఆయన ప్రశంసించారు. 

 

***


(రిలీజ్ ఐడి: 2246481) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati