వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవటమే డబ్ల్యూటీఓ చట్టబద్ధతకు మూలం.. డబ్ల్యూటీఓ ఎంసీ14లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
ఉరుగ్వే రౌండ్ నాటి అసమానతలను సరిదిద్దేలా డబ్ల్యూటీఓ సంస్కరణలుండాలన్న శ్రీ పీయూష్ గోయల్
ఉత్పాదక సామర్థ్య పెంపునకు, ఉపాధి కల్పనకు, ప్రపంచ వాణిజ్యంలో అర్థవంతమైన భాగస్వామ్యానికి సభ్యులందరికీ సమాన అవకాశాలుండటం కీలకమని శ్రీ పీయూష్ గోయల్ వ్యాఖ్య
నిర్ణీత కాలంలో పూర్తిచేసేలా వాణిజ్య సంస్కరణల పునఃప్రారంభాన్ని సమర్థించిన భారత్.. బహుముఖ వాణిజ్య వ‌్యవస్థను దెబ్బతీసే పక్షపాత వాణిజ్య ఒప్పంద ధోరణులపై హెచ్చరిక
నాడు పోస్టు చేయడమైనది:
28 MAR 2026 12:07PM by PIB Hyderabad
కామెరూన్‌లోని యావుండేలో జరుగుతున్న డబ్ల్యూటీఓ ఎంసీ 14 రెండో రోజు సమావేశంలో సంస్థాగత సంస్కరణలపై సభ్య దేశాల వాణిజ్య మంత్రులు చర్చించారు. ఈ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ నాయకత్వం వహించారు.
'గత ఆదేశాలతో నిర్ణయాధికారం' అంశంపై శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవటమే డబ్ల్యూటీఓ చట్టబద్ధతకు మూలమని స్పష్టం చేశారు. సమ్మతం లేని నిబంధనలకు కట్టుబడి ఉండాలా వద్దా అనే అంశం ఆయా దేశాల సార్వభౌమాధికారమని.. ఆ హక్కును డబ్ల్యూటీఓ విస్మరించకూడదన్నారు. ఏకాభిప్రాయం ద్వారా నిర్ణయం తీసుకోవటంలోని సవాళ్లను అధిగమించేందుకు పరస్పర విశ్వాసాన్ని పునరుద్ధరించుకోవాల్సిన అవసరాన్ని భారత్ స్పష్టం చేసింది. ప్రస్తుత ప్రతిష్టంభన, దానికి గల మూలకారణాలను డబ్ల్యూటీఓ జాగ్రత్తగా సమీక్షించాలని భారత్ కోరింది. ఈ చర్చలు పారదర్శకంగా, సమ్మిళితంగా, సభ్య దేశాల నేతృత్వంలోనే జరగాలని స్పష్టం చేసింది. అంతర్గతంగా ముక్కలైన వ్యవస్థలో సమగ్ర బహుముఖ వాణిజ్య వ్యవస్థ అభివృద్ధి చెందటం సాధ్యం కాదని భారత్ హెచ్చరించింది.
'సమాన అవకాశాల కల్పన' అంశంపై మాట్లాడిన శ్రీ పీయూష్ గోయల్.. ఉరుగ్వే రౌండ్ నాటి అసమానతలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. నిర్మాణాత్మక అసమానతల పరిష్కారానికి నూతన అంశాలను చేపట్టే ముందు, వ్యవస్థలో పేరుకుపోయిన వ్యత్యాసాలను సరిదిద్దేందుకు ఆహార భద్రత, పీఎస్హెచ్, పత్తిపై ఎస్‌ఎస్‌ఎం వంటి పెండింగ్ అంశాలకు ప్రాధాన్యతనివ్వాలని భారత్ స్పష్టం చేసింది. వివాద పరిష్కార వ్యవస్థ నిరంతరం విఫలమవుతుండటంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. సమర్థవంతమైన తీర్పులు లేకపోతే, అమలు శక్తిని నిబంధనలు కోల్పోవటం వల్ల చిన్న ఆర్థిక వ‌్యవస్థలు తీవ్రంగా నష్టపోతాయని హెచ్చరించింది. వాణిజ్యపరమైన ప్రతీకార చర్యలను సమర్థించుకోవటానికి, దేశ చట్టబద్ధ స్వదేశీ విధానాలను అడ్డుకునేందుకు పారదర్శకతను ఆయుధంగా ఉపయోగించవద్దని భారత్ హెచ్చరించింది. బదులుగా, సభ్య దేశాలన్నింటికీ అర్థవంతమైన, నిరంతర సామర్థ్య పెంపుదలకు సహకారం అందించాలని, తద్వారా న్యాయంగా, సమర్థవంతంగా దేశాల బాధ్యతలను నిర్వర్తిస్తాయని తెలిపింది. ఉత్పాదక సామర్థ్య పెంపునకు, ఉపాధి కల్పనకు, ప్రపంచ వాణిజ్యంలో అర్థవంతమైన భాగస్వామ్యానికి సభ్య దేశాలకు సమాన అవకాశాలుండాలని భారత్ స్పష్టం చేసింది.
డబ్ల్యూటీఓ సంస్కరణల పారదర్శకతపై జరిగిన మినిస్టీరియల్ ప్లీనరీ సెషన్‌తో చర్చలు ముగిశాయి. ఈ సమావేశంలో వాణిజ్య కార్యదర్శి శ్రీ రాజేశ్ అగర్వాల్ మాట్లాడుతూ.. మరింత పటిష్టమైన సాక్ష్యాధారిత విశ్లేషణ, సమర్పించిన ప్రతిపాదనలు, మంత్రుల నిర్ణయాలతో కూడిన పద్ధతిలో నిర్ణీత కాలంలో పూర్తి చేసే వాణిజ్య సంస్కరణల ప్రక్రియను తిరిగి ప్రారంభించేందుకు భారత్ మద్దతిస్తుందని తెలిపారు. లాభాలను చేకూర్చే అంశాలను మాత్రమే ఎంచుకోవటాన్ని, ముందుగా నిర్ణయించుకున్న ఏకపక్ష వైఖరిని ప్రచారం చేయటాన్ని భారత్ వ్యతిరేకించింది. డబ్ల్యూటీఓ కమిటీల పాత్రకు అధిక ప్రాధాన్యతనిస్తూ.. ఆయా కమిటీల అనుభవాలు, క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని సేకరించే విధానం ద్వారా సమగ్ర సమీక్ష నిర్వహించవచ్చని సూచించింది. బహుముఖ వాణిజ్య వ‌్యవస్థను దెబ్బతీసే పక్షపాత వాణిజ్య ఒప్పంద ధోరణులపై హెచ్చరిస్తూనే.. బహిరంగంగా, పారదర్శకతతో కూడిన, సమగ్రత గల, సభ్య దేశాల భాగస్వామ్యంతో ప్రజాస్వామ్య సూత్రాలపై ఏకాభిప్రాయ ప్రక్రియ ఆధారపడి ఉండాలని శ్రీ అగర్వాల్ పిలుపునిచ్చారు.
ఎంసీ14 సమావేశాల రెండో రోజున.. అమెరికా, చైనా, కొరియా, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, కెనడా, మొరాకో, ఒమన్ దేశాల ప్రతినిధులతో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఎంసీ14 అజెండాతో పాటు ఆయా దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయటంపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించాయి.
***
(రిలీజ్ ఐడి: 2246473)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14