భారత ఎన్నికల సంఘం
హౌరాలో ఈసీఐ భారీ ఎస్‌వీఈఈపీ ప్రచార కార్యక్రమాలు.. ‘‘చునావ్ కా పర్వ్, పశ్చిమ బెంగాల్ కా గర్వ్’’
పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా ఓటరు అవగాహన ప్రచారం
అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఊపందుకున్న ఎస్‌వీఈఈపీ ప్రచార కార్యక్రమాలు
నాడు పోస్టు చేయడమైనది:
27 MAR 2026 1:36PM by PIB Hyderabad
1. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరుగుతున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ), జిల్లా ఎన్నికల అధికారుల (డీఈఓ) సమన్వయంతో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) రాష్ట్రవ్యాప్తంగా ఓటరు అవగాహన కార్యక్రమాలను ప్రారంభించింది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రజాస్వామ్య పండుగను ఆనందకరంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం.
2. ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, స్వేచ్ఛాయుత, పారదర్శక, పండుగ వాతావరణంలో ఓటు ప్రక్రియ జరిగేలా చూసేందుకు నేడు హౌరాలో భారీ “వ్యవస్థీకృత ఓటరు అవగాహన, ఎన్నికల్లో పాల్గొనడం” (ఎస్‌వీఈఈపీ) ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. పశ్చిమ బెంగాల్‌లోని అన్ని జిల్లాలలోనూ ఇలాంటి కార్యక్రమాలను చేపట్టారు.
3. హౌరా జిల్లాలో ఈ కార్యక్రమం ఉత్సాహభరితమైన సైకిల్ ర్యాలీతో ప్రారంభమైంది. ఇందులో ఈసీఐ, సీఈఓ కార్యాలయ అధికారులు, పోలీసు కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి, ఇతర శాఖల అధికారులతోపాటు పాఠశాల, కళాశాల విద్యార్థులు, తొలిసారి ఓటు వేయబోతున్న యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం 7:00 గంటలకు హౌరా వంతెన చెక్ పోస్టు వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ.. రైల్ మ్యూజియం మీదుగా సాగి రామకృష్ణాపూర్ ఫెర్రీ ఘాట్ వద్ద ముగిసింది. ర్యాలీ అనంతరం జానపద గీతాలు, నృత్యాలు, నాటకాల ద్వారా ఓటు హక్కు ప్రాముఖ్యతను, ఎన్నికల పండుగ స్ఫూర్తిని వివరించే సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహించారు. ఓటరు అవగాహన కోసం నదిలో బోట్ ఫెర్రీ వంటి ఇతర ఎస్‌వీఈఈపీ కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
4. ప్రముఖ యానిమేషన్ పాత్రలైన చోటా భీమ్, చుట్కీలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యువత, తొలిసారి ఓటు వేయబోతున్న వారిలో అవగాహన కల్పించడానికి, ఓటు హక్కు ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు ఈ కార్యక్రమంలో ఈ పాత్రలు కూడా పాల్గొన్నాయి.
5. ఓటు ప్రాముఖ్యత గురించి, ఓటర్లు తమ పోలింగ్ కేంద్రాలను ఎలా గుర్తించాలి? ఎన్నికల రోజు షెడ్యూల్ వంటి ముఖ్యమైన వివరాల గురించి వారిలో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం. పౌరులు, ఇతర భాగస్వాములలో ఎన్నికల ప్రక్రియపై అవగాహనను బలోపేతం చేయడంతోపాటు పట్టణ ఓటర్లు, మహిళలు, దివ్యాంగులు, యువత, తొలిసారి ఓటు వేసేవారిలో ఓటింగ్ శాతాన్ని అధికంగా పెంచడమే ఈ ప్రయత్నాల లక్ష్యం.
6. పశ్చిమ బెంగాల్‌లోని గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ఓటరు అవగాహన ప్రచారంలో భాగంగా ఉపయోగించనున్నారు. ఇందులో భాగంగా కాళీఘాట్ చిత్రలేఖనం, పట్టచిత్ర కళ, ఛౌ నృత్యం, జాతర నాటకం, బావుల్ జానపద సంప్రదాయాల ద్వారా ఎన్నికల సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారు.
7. ఓటింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి, పారదర్శకతను, విశ్వసనీయతను మరిత బలోపేతం చేయడానికి భారత ఎన్నికల సంఘం ఇటీవల అమలు చేస్తున్న చర్యలను కూడా ఈ కార్యక్రమాలు వివరించాయి. పోలింగ్ కేంద్రాల వెలుపల మొబైల్ ఫోన్లను భద్రపరుచుకునే వసతి, ఎన్నికల సమాచారం కోసం ఈసీఐఎన్‌ఈటీ యాప్, 100 శాతం వెబ్‌కాస్టింగ్, మెరుగైన ఓటరు సమాచార స్లిప్పులు, ఇతర సహాయక చర్యలు ఇందులో ఉన్నాయి.
8. తొలిసారి ఓటు వేయబోతున్న వారిని, యువతను ప్రోత్సహించడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లోని ఎన్నికల అక్షరాస్యత క్లబ్బులు విద్యార్థుల్లో ఓటరు అవగాహనను పెంపొందిస్తాయి. రాష్ట్రానికి చెందిన సాంస్కృతిక అంశాలను ఉపయోగించి యువతను ఆకట్టుకునేలా, వారిని చైతన్యపరిచేలా సోషల్ మీడియా ద్వారా విస్తృతమైన ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
9. కార్పొరేట్ సంస్థల సహకారంతో ప్రభుత్వ శాఖలు ఈ అవగాహన కార్యక్రమాలను మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నాయి.
10. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే వారందరూ భయం లేని వాతావరణంలో, ప్రలోభాలకు లోనుకాని విధంగా, పూర్తి అవగాహనతో ఓటు వేసేలా చేయడమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యం. ‘‘చునావ్ కా పర్వ్, పశ్చిమ బెంగాల్ కా గర్వ్’’ అనే ప్రధాన నినాదంతో ఎస్‌వీఈఈపీ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2246049)
సందర్శకుల సూచీ సంఖ్య : : 21