వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆవిష్కరణ వ్యవస్థ బలోపేతానికి, అంకుర సంస్థలకు మద్దతిచ్చేందుకు డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థతో డీపీఐఐటీ ఒప్పందం

నాడు పోస్టు చేయడమైనది: 26 MAR 2026 1:38PM by PIB Hyderabad

దేశంలోని అంకుర సంస్థలు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలకు మద్దతిచ్చేందుకు డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీనిని దేశ స్టార్టప్, ఆవిష్కరణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కీలక చర్యగా భావిస్తున్నారు.

 

డిజిటల్ వినోదం, ఆన్‌లైన్ గేమింగ్, ఈ-స్పోర్ట్స్, ఇంటరాక్టివ్ మీడియా, కృత్రిమ మేధ ఆధారిత సాంకేతిక వంటి రంగాల్లో పనిచేసే అంకుర సంస్థల వృద్ధిని ప్రోత్సహించడమే ఈ ఒప్పంద లక్ష్యం. నిర్మాణాత్మకమైన పరిశ్రమ భాగస్వామ్యం ద్వారా అంకుర సంస్థలు విస్తరించదగిన, పరిశ్రమ అవసరాలకు తగిన పరిష్కారాలను అభివృద్ధి చేసయడానికి ఇది దోహదపడుతుంది.

 

ఈ ఒప్పందంలో భాగంగా అంకుర సంస్థలకు మార్గదర్శకత్వం, పరిశ్రమల గురించి అవగాహన, అవగాహనా వేదికలు, ఎంపిక చేసిన భాగస్వామ్య అవకాశాలనూ కల్పిస్తారు. అంకుర సంస్థలు ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్ అభివృద్ధి, మార్కెట్ ప్రవేశం, పరిశ్రమ వ్యవస్థలలో విలీనం వంటి కీలక అంశాల్లో విజయం సాధించేందుకు ఈ భాగస్వామ్యం సహకారం అందిస్తుంది.

 

ఈ సందర్భంగా డీపీఐఐటీ సంయుక్త కార్యదర్శి శ్రీ సంజీవ్ మాట్లాడుతూ.. భారత డిజిటల్, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఈ భాగస్వామ్యాన్ని కీలక ముందడుగుగా అభివర్ణించారు. ఇటువంటి చర్యలు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో అంకుర సంస్థలు నూతన ఆవిష్కరణలు రూపొందించడానికి, తమ కార్యకలాపాలను విస్తరించుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా పోటీపడగల పరిష్కారాలను రూపొందించడానికి వీలు కల్పిస్తాయని ఆయన పేర్కొన్నారు.

 

ఈ ఒప్పందం ద్వారా డీపీఐఐటీ సంస్థ క్రాఫ్టన్ ఇండియా సంస్థతో కలిసి పనిచేస్తుంది. భారత్ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్ కింద ఆవిష్కరణల సవాళ్లను నిర్వహించడంతో పాటు.. గేమ్ డిజైన్, యానిమేషన్, లీనమయ్యే అనుభూతినిచ్చే సాంకేతికతలు, ఈ-స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్, కృత్రిమ మేధ అప్లికేషన్ల వంటి రంగాలలో హ్యాకథాన్‌లు, వర్క్‌షాప్‌లు, మాస్టర్‌క్లాస్‌లను నిర్వహించనున్నారు.

 

ఈ భాగస్వామ్యం పరిశ్రమల మధ్య పరస్పర చర్చలు, విజ్ఞాన మార్పిడి, ప్రపంచ ఉత్తమ పద్ధతులను తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఎంపిక చేసిన అంకుర సంస్థలు ప్రయోగాత్మక ప్రాజెక్టుల్లో సహకారం పొందే అవకాశం ఉంటుంది. వాటి ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో మరింత లోతైన అనుబంధాన్ని కొనసాగించేందుకు అవకాశముంటుంది.

 

అంకుర సంస్థల రంగంలో భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి, స్టార్టప్ ఇండియా కార్యక్రమాల్లో పాల్గొనడం, అవగాహన కార్యక్రమాల ద్వారా స్టార్టప్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం మద్దతు ఇస్తుంది.

 

ఈ ఒప్పందంపై డీపీఐఐటీ డిప్యూటీ సెక్రటరీ శ్రీ టీఎల్ కే సింగ్, క్రాఫ్టన్ ఇండియా ప్రభుత్వ సంబంధాల విభాగం అధిపతి శ్రీ విబోర్ కుక్రేతి సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇరు పక్షాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2245750) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Gujarati