రైల్వే మంత్రిత్వ శాఖ
సమాచార, కవచ్ వ్యవస్థలను మెరుగుపరచడానికి రూ.1,236 కోట్ల విలువైన ప్రాజెక్టులకు భారతీయ రైల్వేల ఆమోదం
మధ్య రైల్వేలో ఉన్న అయిదు డివిజన్లలోనూ రూ. 623.63 కోట్ల వ్యయంతో డ్యూయల్ ఫైబర్ కమ్యూనికేషన్ నెట్వర్క్
గుజరాత్‌లోని రాజ్‌కోట్, భావనగర్ డివిజన్లలో రూ. 302.26 కోట్లతో
ఫైబర్ కమ్యూనికేషన్ వ్యవస్థను పూర్తి చేయనున్న భారతీయ రైల్వేలు
తమిళనాడు, కేరళ, కర్ణాటకలో రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో రూ. 310.18 కోట్లతో
548 కి.మీ. మేర ప్రమాదాలను నివారించే కవచ్ 4.0 ఏర్పాటు
నాడు పోస్టు చేయడమైనది:
25 MAR 2026 8:35PM by PIB Hyderabad
వివిధ జోన్లలో సమాచార వ్యవస్థను మెరుగుపరచడం, కవచ్ ఆటోమేటిక్ రైలు భద్రతా వ్యవస్థలను విస్తరించడమే లక్ష్యంగా సుమారు రూ. 1,236 కోట్ల విలువైన ప్రాజెక్టులకు భారతీయ రైల్వేలు ఆమోదం తెలిపింది. వీటిలో మూడు వేర్వేరు ప్రతిపాదనలున్నాయి. మధ్య, పశ్చిమ రైల్వేల్లో ఆప్టికల్ ఫైబర్, భూగర్భ కేబుళ్ల మౌలిక వసతులపై రెండు ప్రతిపాదనలు, దక్షిణ రైల్వేలో రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో కవచ్ ఏర్పాటు చేయడంపై మరో ప్రతిపాదన దృష్టి సారిస్తాయి.
మధ్య రైల్వేలో ఫైబర్ వ్యవస్థను మెరుగుపరచడం: రూ. 623.63 కోట్లు
మధ్య రైల్వేలోని మొత్తం అయిదు డివిజన్లు - షోలాపూర్, నాగపూర్, పుణె, భూసావల్, ముంబయిలో విస్తృతమైన, రెండు విధాలుగా పనిచేసే సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రెండు పనులకు ఆమోదం లభించింది.
మొదటిది, షోలాపూర్, నాగపూర్, పుణె, భూసావల్ డివిజన్లలో ఇప్పటికే ఉన్న 25 కేవీ విద్యుత్ లైన్లపై 2,250.68 రూట్ కిలోమీటర్ల మేర ఓపీజీడబ్ల్యూ (96 ఫైబర్) అనే ప్రత్యేక రకం మిశ్రమ తీగను ఏర్పాటు చేస్తారు. ఈ తీగ రెండు పనులను ఒకేసారి నిర్వహిస్తుంది. ఇది ట్రాక్షన్ వ్యవస్థకు ఎర్త్ ప్రొటెక్షన్ వైరుగా, సమాచారాన్ని ప్రసారం చేసే ఆప్టికల్ ఫైబర్‌గానూ పనిచేస్తుంది. ఇప్పటికే ఉన్న ట్రాక్షన్ టవర్లపైనే వీటిని ఏర్పాటు చేస్తారు కాబట్టి, కొత్తగా మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. దీని వ్యయం రూ. 238.9363 కోట్లు.
రెండోది, షోలాపూర్, పుణె, నాగపూర్, భూసావల్, ముంబయి – అయిదు డివిజన్లలోనూ 2,673.21 రూట్ కిలోమీటర్ల మేర పట్టాల వెంబడి ఒక వైపు భూగర్భ ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లను ఏర్పాటు చేస్తారు. మరో వైపు ఓపీజీడబ్ల్యూ ఏర్పాటుతో ప్రతి మార్గంలోనూ రెండు స్వతంత్ర ఫైబర్ మార్గాలను ఇది సిద్ధం చేస్తుంది. ఒక మార్గం విఫలమైనప్పటికీ మరొకదానితో సమాచార ప్రసారం జరిగేలా హామీ లభిస్తుంది. ఖర్చు రూ. 384.6887 కోట్లు.
అదనపు ఫైబర్ సామర్థ్యాన్ని లీజుకు ఇచ్చి భారతీయ రైల్వే ఆదాయం ఆర్జిస్తుంది.
దక్షిణ రైల్వేలో 548 కి.మీ.లకు కవచ్ సురక్షా వ్యవస్థ విస్తరణ: రూ. 310.18 కోట్లు
స్వయంచాలితంగా పనిచేసే రైలు భద్రతా వ్యవస్థే కవచ్. ఇది ఒకే పట్టాలపై రెండు రైళ్లు ఉన్నప్పుడు లేదా, సిగ్నల్ దాటి ముందుకు వెళుతున్నప్పుడు ప్రమాదాన్ని నివారించడానికి తనంత తానే బ్రేకులు వేస్తుంది. ఈ ప్రాజెక్టు కింద తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు.
దక్షిణ రైల్వేలోని రెండు సెక్షన్లలో కవచ్ 4.0 ను ఆమోదం పొందిన ప్రతిపాదన పరిధిలో ఏర్పాటు చేస్తారు.
జోలార్‌పేట-ఈరోడ్ (180 ఆర్కేఎం, సేలం డివిజన్), చెన్నై బీచ్-తాంబరం-చెంగల్పట్టు (60 కి.మీ., చెన్నై డివిజన్) – కొత్త ఆప్టికల్ ఫైబర్ ఏర్పాటుతో సహా వ్యయం రూ. 158.74 కోట్లు.
షోరన్‌పూర్-మంగళూరు (308 కి.మీ. పాలక్కడ్ డివిజన్) – కొత్త 4x48 ఫైబర్ ఓఎఫ్‌సీ కేబుల్ ఏర్పాటుతో సహా వ్యయం రూ. 151.44 కోట్లు.
ఈ పనులన్నీ రూ.2,950 కోట్ల విలువైన దక్షిణ రైల్వే ఉప ప్రాజెక్టుల పరిధిలోకి వస్తాయి.
రాజ్‌కోట్, భావనగర్ డివిజన్లలో రూ. 302.2589 కోట్లతో ఫైబర్ వ్యవస్థను పశ్చిమ రైల్వే పూర్తి చేస్తుంది.
గుజరాత్‌లోని పశ్చిమ రైల్వే డివిజిన్లలో మిగిలిన మార్గాల్లో ఆప్టికల్ పైబర్ కేబుళ్లు (2x48 ఫైబర్, పట్టాలకు ఇరువైపులా) ఏర్పాటు చేస్తారు. రాజ్‌కోట్ డివిజన్లోని 1,064 కి.మీ, భావనగర్ డివిజన్లోని 589 కి.మీ. మొత్తం 1,653కి.మీ. మేర వీటిని ఏర్పాటు చేస్తారు. ఈ డివిజన్లో సమాచార వ్యవస్థలో ఉన్న లోపాలను ఇవి పూరిస్తాయి.
కవచ్, ఎల్టీఈ ఆధారిత రైలు నియంత్రణ వ్యవస్థలు విశ్వసనీయంగా పని చేయాలంటే బలమైన ఫైబర్ వ్యవస్థ అవసరం. పశ్చిమ రైల్వేలో ఈ పనులు పూర్తయితే ఎలాంటి జాప్యం లేకుండా కవచ్ విస్తరణ ముందుకు సాగుతుంది. రూ. 2,800 కోట్ల విలువతో పశ్చిమ రైల్వే చేపడుతున్న ఉప ప్రాజెక్టుల పరిధిలోకి ఈ పనులు వస్తాయి.
మొత్తం ప్రభావం
అధునాతన సమాచార వ్యవస్థలు, భద్రతా సాంకేతిక పరిజ్ఞానాలను ఏకీకృతం చేసి మౌలిక వసతులను ఆధునికీకరించాలన్న రైల్వేల విస్తృత వ్యూహంలో ఈ ప్రాజెక్టులు భాగంగా ఉన్నాయి. ట్రాక్షన్కు అనుసంధానమైన సమాచార వ్యవస్థలను బలోపేతం చేయడం, ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను విస్తరించడం ద్వారా కవచ్ అమలుకు తోడ్పాటు లభిస్తుంది. దీని వల్ల కార్యకలాపాల సామర్థ్యం, భద్రత బలోపేతమవుతాయి. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రైల్వే వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది.
***
(రిలీజ్ ఐడి: 2245646)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5