వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పీఎం కిసాన్: ప్రారంభం నుంచి 22 విడతల్లో రూ. 4.27 లక్షల కోట్లు విడుదల చేసిన కేంద్రం

నాడు పోస్టు చేయడమైనది: 24 MAR 2026 6:16PM by PIB Hyderabad

సాగుభూమి ఉన్న రైతులకు ఆర్థికంగా చేదోడువాదోడుగా నిలిచేందుకు 2019 ఫిబ్రవరిలో పీఎం - కిసాన్ పథకాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఏటా రూ. 6,000 ఆర్థిక సాయాన్ని మూడు సమాన వాయిదాల్లో రైతుల ఆధార్‌తో అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) విధానంలో ఈ ప్రక్రియ సాగుతుంది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి భారత ప్రభుత్వం 22 వాయిదాల్లో రూ. 4.27 లక్షల కోట్లకు పైగా నిధులను రైతులకు పంపిణీ చేసింది.

2025 నవంబర్ 19న పీఎం-కిసాన్ పథకం 21వ విడత విడుదల సందర్భంగా 9.35 కోట్లకు పైగా రైతులు లబ్ధి పొందారు.

పీఎం-కిసాన్ పథకం వల్ల రైతుల ఆదాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి సానుకూల ప్రభావం పడిందో వివరిస్తూ చేపట్టిన పలు అంచనాల అధ్యయనాల్లోని ముఖ్యాంశాలను ఇలా పేర్కొనవచ్చు:

(i) అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ (ఐఎఫ్‌పీఆర్ఐ) 2019లో నిర్వహించిన ఒక స్వతంత్ర అధ్యయనం ప్రకారం.. పీఎం-కిసాన్ ద్వారా అందించిన నిధులు గ్రామీణ ఆర్థిక వృద్ధికి గణనీయంగా దోహదపడ్డాయి. రైతులకు రుణ సంబంధిత పరిమితులను తగ్గించి, వ్యవసాయ ఉత్పాదకాలపై పెట్టుబడులు పెరిగాయని ఈ అధ్యయనం విశ్లేషించింది. అంతేకాకుండా ఈ నిధులు రైతుల్లో సంకటం లేకుండా ప్రయోగాలకు ముందుకెళ్లగల సామర్థ్యాన్ని పెంచాయనీ వెల్లడించింది. దీంతో కొంత రిస్కుతో కూడుకున్నప్పటికీ ఉత్పాదకతను పెంచేలా ధైర్యంగా పెట్టుబడులు చేయగలుగుతున్నారని వివరించింది.

(ii) కిసాన్ కాల్ సెంటర్ల (కేసీసీ) ద్వారా ఒక సమగ్రమైన అభిప్రాయ సేకరణ యంత్రాంగాన్ని కూడా వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ అమలు చేస్తోంది. దీని సర్వేల ప్రకారం.. 93 శాతానికి పైగా రైతులు ఈ పథకం ద్వారా పొందుతున్న ప్రయోజనాలను వ్యవసాయ కార్యకలాపాల కోసం వినియోగించుకున్నట్టు స్పష్టమైంది.

(iii) పీఎం-కిసాన్ పథకం ఎలాంటి ప్రభావాన్ని చూపిందో మదింపు చేయడం కోసం.. నీతి ఆయోగ్‌కు చెందిన అభివృద్ధి పర్యవేక్షణ, మదింపు కార్యాలయం (డీఎంఈవో) ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. సాగుభూమి ఉన్న రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సాయాన్ని అందించడం ద్వారా.. వారి ఆర్థిక స్థిరత్వాన్నీ, వ్యవసాయ ఉత్పాదకతనూ పెంపొందించాలన్న ప్రాథమిక లక్ష్యాన్ని ఈ పథకం విజయవంతంగా నెరవేరుస్తోందని ఈ అధ్యయనంలో స్పష్టమైంది. పెరుగుతున్న పెట్టుబడి వ్యయాలు, వాతావరణ అనిశ్చితుల దృష్ట్యా.. లబ్ధిదారులైన రైతుల్లో 92 శాతానికి పైగా ఈ ఆర్థిక సాయాన్ని విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వంటి అత్యవసర వ్యవసాయ ఉత్పాదకాల కొనుగోలు కోసం వినియోగించారని ఈ అధ్యయనం వెల్లడించింది. అలాగే తమ వ్యవసాయ ఆదాయం పెరిగిందనీ, అలాగే పంట నష్టం లేదా వైద్యపరంగా అత్యవసర సమయాల్లో ప్రైవేటు అప్పులపై ఆధారపడడం బాగా తగ్గిందనీ దాదాపు 85 శాతం మంది రైతులు పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన, ఆహార భద్రత, లింగ సమానత్వం, సంస్థాగత పారదర్శకత వంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల దిశగా దేశ పురోగతికి ఈ పథకం ఎంతగానో దోహదపడుతోందని ఈ అధ్యయనం నిరూపిస్తోంది.

పీఎం-కిసాన్ వెబ్‌సైట్‌లో రైతుల కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని (ఫార్మర్స్ కార్నర్) ఏర్పాటు చేశారు. దీని ద్వారా రైతులు తమకు రావాల్సిన ప్రయోజనాలు ఏ దశలో ఉన్నాయో తెలుసుకోవచ్చు. అలాగే వాయిదాల చెల్లింపు వివరాలనూ చూసుకోవచ్చు. అంతేకాకుండా రైతులు తమ అర్హతనూ, చెల్లింపుల స్థితినీ తెలుసుకోవడం కోసం వెబ్‌సైట్‌లో ‘నో యువర్ స్టేటస్’ అనే ప్రత్యేక ఫీచర్‌ను కూడా అందుబాటులో ఉంచారు. అలాగే రైతులు తమ సమీపంలోని ఉమ్మడి సేవా కేంద్రాలను (కామన్ సర్వీస్ సెంటర్లు) సందర్శించి కూడా తమకు రావాల్సిన ప్రయోజనాల స్థితినీ, వాయిదాల చెల్లింపుల వివరాలనూ తెలుసుకోవచ్చు.

ఈ పథకానికి ఉన్న భారీ లబ్ధిదారుల సంఖ్యను దృష్ట్యా.. వారి సందేహాలనూ, ఫిర్యాదులనూ తక్షణమే పరిష్కరించడం కోసం వాయిస్ ఆధారిత పీఎం-కిసాన్ ఏఐ చాట్‌బాట్‌ను సంబంధిత విభాగం రూపొందించింది. ఇది ఏ సమయంలోనైనా రైతులకు వారి సొంత భాషలోనే వేగవంతమైన, కచ్చితమైన, స్పష్టమైన సమాధానాలను అందిస్తూ.. ఈ వ్యవస్థను మరింత సులభంగా, రైతులకు అనుకూలంగా మార్చింది. వెబ్, మొబైల్ వంటి అన్ని వేదికల నుంచి ఇది అందుబాటులో ఉంటుంది. కిసాన్ ఇ-మిత్ర చాట్‌బాట్ ప్రస్తుతం ఇంగ్లిష్, హిందీ, ఒడియా, తమిళం, బెంగాలీ, మలయాళం, గుజరాతీ, పంజాబీ, కన్నడ, తెలుగు, మరాఠీ.. 11 భాషల్లో సేవలందిస్తోంది. ఇప్పటివరకు 53 లక్షల మందికి పైగా రైతులు అడిగిన 95 లక్షలకు పైగా సందేహాలను పరిష్కరించింది. అలాగే రైతుల ప్రయోజనం ఏ దశలో ఉందో తెలపడంతోపాటు చెల్లింపుల వివరాలను కూడా అందిస్తుంది.

పీఎం-కిసాన్ పథకంలో నమోదు చేసుకోవడానికి ఆధార్ సంఖ్య తప్పనిసరి. పథకం కింద ఉన్న లబ్ధిదారులంతా ఆధార్ ధ్రువీకరణ పొందినవారే. అలాగే ఆధార్ ప్రాతిపదికగా ఉన్న చెల్లింపు వ్యవస్థ విధానం ద్వారా.. లబ్ధిదారుల ఆధార్‌తో అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాల్లోకే నేరుగా చెల్లింపులన్నీ జరుగుతాయి.

బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియను సులభతరం చేయడం కోసం - రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు, ఉమ్మడి సేవా కేంద్రాలు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులతో సమన్వయం చేసుకుంటూ.. అర్హులందరినీ పథకం పరిధిలోకి తెచ్చేలా, వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ రాంనాథ్ ఠాకూర్ లోక్‌సభలో ఇచ్చిన ఓ లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.  

***

(రిలీజ్ ఐడి: 2244774) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Kannada