జల శక్తి మంత్రిత్వ శాఖ
జల జీవన్ మిషన్ 2.0 కింద ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలతో సంస్కరణల అనుసంధాన అవగాహన ఒప్పందాలు
జవాబుదారీతనం, సమాజ ప్రాతినిధ్యంతో కూడిన నీటి యాజమాన్యం కోసం సుస్థిరమైన గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థను అందించడంలో సంస్కరణలను వేగవంతం చేస్తున్న కేంద్ర, రాష్ట్రాల భాగస్వామ్యం
నాడు పోస్టు చేయడమైనది:
24 MAR 2026 4:59PM by PIB Hyderabad
జల్ జీవన్ మిషన్ 2.0 కింద దేశవ్యాప్తంగా సంస్కరణల అమలు కొనసాగింపులో భాగంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాల ద్వారా స్థిరమైన, పారదర్శకమైన సమాజ ఆధారిత గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థను అమలు చేయడానికి ఏర్పాటు చేసిన సంస్కరణల వ్యవస్థ పట్ల తమ నిబద్ధతను ప్రకటించాయి.
జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన తాగునీరు, పారిశుద్ధ్య విభాగం (డీడీడబ్ల్యూఎస్) కార్యాలయంలో కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ సి.ఆర్. పాటిల్ సమక్షంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ తో అవగాహన ఒప్పందం కార్యక్రమానికి ఆయనతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, సైన్స్, టెక్నాలజీ మంత్రి ఇతర ఉన్నతాధికారులతో కలిసి వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్, కేంద్ర తాగునీరు-పారిశుద్ధ్య విభాగం సంయుక్త కార్యదర్శి (నీటి విభాగం) శ్రీమతి స్వాతి మీనా నాయక్ ఈ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసి పత్రాలను మార్చుకున్నారు.

కేంద్ర-రాష్ట్రాల సహకారంలో ఒక కీలక ఘట్టంగా.. మధ్యాహ్నం 12:30 గంటలకు ఒడిశా రాష్ట్రంతో ఈ అవగాహన ఒప్పందం జరిగింది. ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒడిశా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, తాగునీటి శాఖ మంత్రి శ్రీ రబీ నారాయణ్ నాయక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి అను గార్గ్, అభివృద్ధి కమిషనర్, అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ దేవరంజన్ కుమార్ సింగ్, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీ సంజీవ్ కుమార్ మిశ్రా సహా రాష్ట్రానికి చెందిన ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

కేంద్ర తాగునీరు,పారిశుద్ధ్య విభాగం సంయుక్త కార్యదర్శి (నీటి విభాగం) శ్రీమతి స్వాతి మీనా నాయక్, ఒడిశా పంచాయతీరాజ్, తాగునీటి శాఖ కమిషనర్, కార్యదర్శి శ్రీ గిరీష్ ఎస్.ఎన్ ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒడిశా ప్రభుత్వ ప్రధాన నివాస కమిషనర్ శ్రీ విశాల్ గగన్ ఒప్పంద పత్రాలను పరస్పరం మార్పిడి చేశారు.

కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ సి.ఆర్. పాటిల్ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, జల జీవన్ మిషన్ కింద ఇప్పటికే కోట్ల సంఖ్యలో గ్రామీణ ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చామని పేర్కొన్నారు. జల జీవన్ మిషన్ 2.0 ద్వారా పాత మౌలిక సదుపాయాల్లోని లోపాలను సవరించడం, మిగిలిన ఇళ్లకు నీటి సౌకర్యం కల్పించడం, సుస్థిరమైన, నమ్మదగిన నీటి సరఫరా వ్యవస్థలను నిర్మించడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని ఆయన వివరించారు. పూర్తయిన తాగునీటి పథకాలను సరైన పత్రాలతో అధికారికంగా గ్రామ సంఘాలకు అప్పగించడం అత్యంత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. నీటి సరఫరా వ్యవస్థల సమర్థ నిర్వహణ, పర్యవేక్షణ కోసం సమాజ ఆధ్వర్యంలోని నీటి నిర్వహణ వ్యవస్థలను బలోపేతం చేయాలని ఆయన సూచించారు. ఫీల్డ్ టెస్ట్ కిట్ల ద్వారా నీటి నాణ్యతను పరీక్షించడంలో మహిళలకు శిక్షణ ఇచ్చి వారికి సాధికారత కల్పించవలసిన అవసరాన్ని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు. ఈ మిషన్ ఇప్పటికే సుమారు 9 కోట్ల మంది మహిళలకు నీటిని మోసుకొచ్చే భారం నుంచి విముక్తి కలిగించిందని, ఇది ఒక గొప్ప సామాజిక మార్పు అని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, 'హర్ ఘర్ జల్' (ప్రతి ఇంటికి నీరు) లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 'వికసిత భారత్ 2047' సాధనలో ఆంధ్రప్రదేశ్ తనవంతు సహకారం అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సాగునీటి సరఫరాలో పైపుల వినియోగం, బిందు సేద్యాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలపై ప్రధానమంత్రి ప్రత్యేకంగా దృష్టి పెట్టారని ఆయన వివరించారు. జల సంచయ్ సే జన్ భాగీదారి (నీటి నిల్వలో ప్రజా భాగస్వామ్యం) ద్వారా నీటి వనరుల సుస్థిరత అవసరాన్ని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు. నీటి సంరక్షణలో సమాజ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని ఆయన కోరారు. పథకం అమలును వేగవంతం చేయడానికి.. నిధుల సద్వినియోగం కోసం జిల్లా కలెక్టర్లు, అధికారులతో క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని ఆయన రాష్ట్రాన్ని కోరారు. ఈ మిషన్ విజయవంతం కావడానికి భారత ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
జల జీవన్ మిషన్ 2.0 ను సమర్థవంతంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ఈ మిషన్ గడువును పొడిగించినందుకు ప్రధానమంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందించే లక్ష్యం వైపు వేగంగా అడుగులు వేసే అవకాశం కలిగిందని వారు పేర్కొన్నారు. ప్రతి ఇంటికి సురక్షితమైన, స్వచ్ఛమైన తాగునీరు అందించే ఈ మిషన్ ఒక సమగ్రమైన కార్యక్రమం అని రాష్ట్ర నాయకత్వం అభివర్ణించింది. ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఇది విప్లవాత్మక మార్పులు తెస్తుందని వారు పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా ఈ మిషన్ పూర్తి అయ్యేలా అమలును వేగవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సర్వసిద్ధంగా ఉందని వారు హామీ ఇచ్చారు. నమ్మదగిన, సుస్థిరమైన, హామీతో కూడిన తాగునీటి సేవలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వారు పునరుద్ఘాటించారు. సేవలందివ్వడం, సుస్థిరత, సమాజ భాగస్వామ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతూ.. మిగిలి ఉన్న లోపాలను సవరించడానికి భారత ప్రభుత్వం నిరంతర సహకారం అందించాలని కోరారు. ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించడం రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ముఖ్యమంత్రి చెప్పారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేయాలని భావిస్తున్న తాగునీరు, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని చూడటానికి, వాటిని ప్రారంభించడానికి రాష్ట్రానికి రావాలని కేంద్ర నాయకత్వాన్ని ఆయన ఆహ్వానించారు.
ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం, ఒడిశా ప్రభుత్వం మధ్య జరిగిన ఈ అవగాహన ఒప్పందం.. 'హర్ ఘర్ జల్' లక్ష్యాన్ని చేరుకోవడానికి, వికసిత భారత్'l సాధనకు ఒక ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు. జల జీవన్ మిషన్ 2.0 కింద ప్రతి ఇంటికీ నీటి సౌకర్యం, సుస్థిర సేవలను అందించడానికి కేంద్రం అందిస్తున్న నిరంతర సహకారాన్ని ఆయన అభినందించారు. సమాజ భాగస్వామ్యం, ఆర్థిక సుస్థిరత, నిర్వహణ, పర్యవేక్షణ, సమర్థవంతమైన నిఘాపై ప్రత్యేక దృష్టి పెడుతూ రాష్ట్రంలో ఈ మిషన్‌ను అమలు చేస్తున్నామని ఆయన వివరించారు. సమగ్ర నిర్వహణ విధానం, సమన్వయంతో కూడిన అమలు ప్రయత్నాలు దీనికి అండగా నిలుస్తున్నాయని ఆయన తెలిపారు.
ఆస్తుల బలోపేతం, డిజిటల్ అనుసంధానం కోసం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. నీటి సరఫరా ఆస్తులను 'సుజల్ భారత్' వేదికపై నమోదు చేస్తున్నామని, పర్యవేక్షణలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడానికి ప్రతి గ్రామానికి ప్రత్యేక సుజల్ గ్రామ్ ఐడి కేటాయిస్తున్నామని ఆయన తెలిపారు. 'వసుధ' హెల్ప్‌లైన్, వాట్సాప్ మాధ్యమాల ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గ్రామ నీటి, పారిశుద్ధ్య కమిటీల ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నామని ఆయన వివరించారు.
నీటి సరఫరా పథకాల పర్యవేక్షణ, జవాబుదారీతనం పెంచడానికి ఒడిశా రాష్ట్రం డిజిటల్ వ్యవస్థలను బలోపేతం చేయడాన్ని కేంద్ర మంత్రి శ్రీ పాటిల్ అభినందించారు. ముఖ్యంగా నీటి సంరక్షణ, జల వనరుల పునరుద్ధరణలో జల శక్తి అభియాన్ కింద సాధించిన పురోగతిని ఆయన కొనియాడారు. ప్రజలకు సేవలందించే హెల్ప్‌లైన్లు, ఫిర్యాదుల పరిష్కార వేదికలు, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేలా బలోపేతం చేసిన గ్రామ నీటి, పారిశుద్ధ్య కమిటీల వంటి కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు.
ప్రతి గ్రామీణ ఇంటికి తగిన పరిమాణంలో, నిర్ణీత నాణ్యతతో కూడిన తాగునీటిని క్రమం తప్పకుండా అందించడమే ఈ సంస్కరణల ఒప్పందం ప్రధాన ఉద్దేశం. బలమైన సమాజ భాగస్వామ్యం, సుస్థిర నిర్వహణ,పర్యవేక్షణ కోసం వ్యవస్థాగత మార్పులు చేయడం ద్వారా గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయాలని ఇది లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచి, 2047 నాటికి వికసిత భారత్ ఆశయ సాధనకు అనుగుణంగా దీర్ఘకాలిక నీటి భద్రత కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం.
***
(రిలీజ్ ఐడి: 2244756)
సందర్శకుల సూచీ సంఖ్య : : 27