హోం మంత్రిత్వ శాఖ
‘జనాభా లెక్కలు-2027’ సేకరణలో జాగ్రత్త చర్యలు
నాడు పోస్టు చేయడమైనది:
24 MAR 2026 4:26PM by PIB Hyderabad
జనాభా లెక్కలు-2027 నమోదు కార్యక్రమాన్ని డిజిటల్ మాధ్యమం ద్వారా నిర్వహించాలని సంకల్పించి అందుకు అనుగుణంగా రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. జనాభా లెక్కల సమాచారాన్ని సేకరించే వారు (ఎన్యూమరేటర్లు) మొబైల్ యాప్‌ని ఉపయోగించి, సమాచారాన్ని సేకరించనున్నారు. దీంతో పాటు, పౌరులే స్వయంగా ఈ జనాభా లెక్కల సేకరణకు తమ వంతుగా సహకరించే ఏర్పాటునూ చేశారు. ఇందుకోసం మొదటి సారి ఒక వెబ్ పోర్టల్ సాయాన్ని తీసుకుంటారు. జన గణన (సెన్సస్)-2027కు సంబంధించిన వివిధ కార్యకలాపాల నిర్వహణకీ, పర్యవేక్షణకీ ఈ వెబ్ పోర్టల్‌ను రూపొందించారు. సెన్సస్-2027 తొలి దశలో ఉపయోగించే ప్రశ్నల్ని వెల్లడించారు. రెండో దశను నిర్వహించే ముందుగా దానికి సంబంధించిన ప్రశ్నలను నోటిఫై చేస్తారు. గృహ స్థితికి సంబంధించిన సమాచారం, కుటుంబ వివరాలు, అందుబాటులో ఉన్న సదుపాయాలు, కుటుంబానికి ఉన్న ఆస్తుల సమాచారాన్ని జనాభా లెక్కల మొదటి దశలో సేకరించనున్నారు. వ్యక్తుల వయస్సు, ఆదాయం వగైరా సమాచారం, సామాజిక-ఆర్థిక, విద్యా, ప్రవాసం వగైరా వివరాల్ని రెండో దశలో సేకరిస్తారు.
జన సంఖ్య ఎంత ఉందీ తెలుసుకొనే కార్యక్రమాన్ని సెన్సస్ చట్టం-1948, సెన్సస్ నియమావళి-1990తో పాటు వాటిలో చేసిన సవరణలకు సంబంధించిన నిబంధనలను అనుసరించి చేపడుతారు. జన గణన ప్రక్రియలో సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు. వివిధ పరిపాలక స్థాయుల్లో సేకరించిన మొత్తం డేటాను మాత్రమే ప్రచురిస్తారు.
వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలూ, కేంద్ర పాలిత ప్రాంతాల పాలన యంత్రాంగాలూ సెన్సస్ చట్టం-1948, సెన్సస్ నియమావళి-1990ల నిబంధనల ప్రకారం నియమించే, రంగంలోకి దింపే జనగణన అధికారులు సమాచారాన్ని సేకరించడం, సరిచూడటం, పర్యవేక్షణ, ఈ కార్యక్రమ పురోగతిపై సమీక్ష నిర్వహించడం వంటి వేర్వేరు క్షేత్రస్థాయి కార్యకలాపాలను నిర్వర్తిస్తారు. ఈ కారణంగా ఎలాంటి ఇబ్బందికీ తావివ్వకుండా జనాభా సంఖ్యను లెక్కించడంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఓ ముఖ్య పాత్రను పోషిస్తాయి.
ఈ సమాచారాన్ని కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ లోక్‌సభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలియజేశారు.
***
(రిలీజ్ ఐడి: 2244579)
సందర్శకుల సూచీ సంఖ్య : : 21