రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఢిల్లీ–హౌరా అత్యంత రద్దీ కారిడార్‌ పరిధిలోని ప్రయాగరాజ్‌–కాన్పూర్ విభాగంలోని 190 కిలోమీటర్ల మేర కవచ్‌ను ప్రారంభించిన భారతీయ రైల్వే


ఈ కీలక విభాగం ప్రారంభం ద్వారా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడపడానికి మార్గం సుగమం..

ఇది భారతీయ రైల్వే అత్యంత కీలకమైన కారిడార్లలో భద్రతను, కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది

प्रविष्टि तिथि: 23 MAR 2026 5:57PM by PIB Hyderabad

అత్యంత రద్దీ కలిగిన ఢిల్లీ–హౌరా కారిడార్‌ పరిధిలోని ప్రయాగ్‌రాజ్ (మినహాయించి)-కాన్పూర్ (మినహాయించి) విభాగంలోని (190 మార్గ కిలోమీటర్లు) కవచ్ స్వయంచాలిత రైలు రక్షణ వ్యవస్థను భారతీయ రైల్వే 2026 మార్చి 22న విజయవంతంగా ప్రారంభించింది. రైలు సంఖ్య 14163 ద్వారా ఈ కవచ్ వ్యవస్థను అమలులోకి తీసుకొచ్చారు. ఈ వ్యవస్థ పనితీరును సమీక్షించేందుకు జనరల్ మేనేజర్ స్వయంగా సుబేదర్‌గంజ్ నుంచి మనౌరి స్టేషన్ వరకు రైలు ఇంజిన్ క్యాబిన్ నుంచి తనిఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌ఓడీలు, డీఆర్‌ఎం ప్రయాగ్‌రాజ్‌, ప్రధాన కార్యాలయ అధికారులు, డివిజనల్ అధికారులతో సహా పలువురు ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

ప్రాథమికంగా 8 జతల రైళ్లలో ( 14113/14114, 14163/14164, 12307/12308, 12417/12418, 22437/22438, 15003/15004, 20433/20434, 12403/12404) ఈ సదుపాయం కల్పించారు. తదుపరి దశల్లో వందే భారత్ సహా ఇతర రైళ్లకు దీనిని విస్తరించనున్నారు.

గంటకు 160 కిలోమీటర్ల గరిష్ట వేగంతో రైళ్లను నడపడానికి, ప్రయాణ భద్రతను పటిష్టం చేయడానికి, రైల్వే నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడానికి ఈ ప్రారంభోత్సవం ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.

ప్రయాగ్‌రాజ్-కాన్పూర్ విభాగంలో కవచ్ వ్యవస్థను అధికారికంగా అందుబాటులోకి తెచ్చే ముందు భారతీయ రైల్వే అత్యంత కఠినమైన, విస్తృతమైన క్షేత్రస్థాయి పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. 8, 16, 22 ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల అమరికతో పాటు, 20 కోచ్‌ల వందే భారత్ రేక్‌తో కూడా వ్యవస్థ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. తద్వారా వివిధ రకాల కార్యాచరణ పరిస్థితులలో వ్యవస్థ విశ్వసనీయతను నిర్ధారించారు. రాజధాని, శతాబ్ది, దురంతో ఎక్స్‌ప్రెస్‌ వంటి ప్రీమియం రైళ్లను నడిపే అత్యంత శక్తివంతమైన డబ్ల్యూఏపీ-7 విద్యుత్ ఇంజిన్లతో ఈ పరీక్షలు జరిగాయి.

రైలు నెంబర్‌ చౌరీ చౌరా ఎక్స్‌ప్రెస్ (15003/15004)ను ఉపయోగించి కూడా ప్యాసింజర్‌ ట్రయల్స్‌ నిర్వహించారు. ఇవి సాధారణ సర్వీసు సమయంలో స్థిరమైన, నమ్మకమైన ఫలితాలను ఇచ్చాయి.

ఇప్పటివరకు సుమారు 20,000 కిలోమీటర్లకు పైగా ప్యాసింజర్ ట్రయల్ రన్స్‌ను విజయవంతంగా పూర్తి చేసి, వ్యవస్థ విశ్వసనీయతను ధృవీకరించారు.

కవచ్ వ్యవస్థ ఈ కింది  విశిష్ట లక్షణాల ద్వారా రైల్వే భద్రతను గణనీయంగా మెరుగుపరుస్తుంది.

·       స్వయంచాలిత రైలు రక్షణ

·       ప్రమాదకర సిగ్నల్‌ దాటడాన్ని నివారించడం

·       మానవ తప్పిదం జరిగినప్పుడు స్వయచాలిత బ్రేకింగ్‌

మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఈ కవచ్ అనేది ఒక అత్యాధునిక స్వయంచాలిత రైలు రక్షణ వ్యవస్థ. రైలు కార్యకలాపాలను ఆధునీకరించడానికి, భద్రతను పటిష్టం చేయడానికి భారతీయ రైల్వే ఈ వ్యవస్థను దశలవారీగా విస్తరిస్తోంది.

గతంలో నిర్వహించిన విస్తృతమైన, లోతైన క్షేత్రస్థాయి పరిశీలనల అనంతరం ‘కవచ్ వెర్షన్ 4.0’ను ఇప్పటికే అత్యధిక రద్దీ కలిగిన ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా మార్గాల్లో 1,452 కిలోమీటర్ల మేర విజయవంతంగా అందుబాటులోకి వచ్చింది.

ప్రయాణికులకు అత్యంత సురక్షితమైన, విశ్వసనీయమైన, సమర్థవంతమైన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో ఆధునిక భద్రతా సాంకేతికతలను అందిపుచ్చుకోవడానికి, భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడానికి భారతీయ రైల్వే కట్టుబడి ఉంది.

తదుపరి దశలో ‘మిషన్ రఫ్తార్’ లక్ష్యాలను సాధించే క్రమంలో భాగంగా ఘాజియాబాద్-తుండ్లా విభాగంలో రైళ్లను గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడపడానికి కవచ్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు.

 

***


(रिलीज़ आईडी: 2244197) आगंतुक पटल : 65
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Kannada