ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
టెలి-మానస్‌పై తాజా సమాచారం
దేశవ్యాప్తంగా విస్తరించిన టెలి-మానస్: 36 రాష్ట్రాలు/యూటీలు, 20 భాషల్లో కార్యకలాపాలను నిర్వహిస్తున్న 53 కేంద్రాలు
34.34 లక్షలకు పైగా కాల్స్ స్వీకరించి, సమస్యలను పరిష్కరించిన టెలిమానస్ హెల్ప్‌లైన్
నాడు పోస్టు చేయడమైనది:
23 MAR 2026 12:44PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా నాణ్యమైన మానసిక ఆరోగ్యాన్ని అందించే దిశగా- కౌన్సెలింగ్, సంరక్షణ సేవలను మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు 2022 అక్టోబర్ 10న నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రాంను భారత ప్రభుత్వం ప్రారంభించింది. 03.03.2026 నాటికి దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 53 టెలిమానస్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రాలు ఎంపిక చేసుకున్న భాష ఆధారంగా టెలిమానస్ సేవలు 20 భాషల్లో అందుబాటులో ఉన్నాయి. హెల్ప్ లైన్ సౌకర్యాన్ని ప్రారంభించిన నాటి నుంచి 34.34 లక్షల కాల్స్ స్వీకరించి, సమస్యలను పరిష్కరించారు.
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా 2024 అక్టోబర్ 10న టెలిమానస్ సేవల్ని సెల్ ఫోన్ ద్వారా పొందడానికి ఒక యాప్ ను ప్రారంభించారు. వివిధ రకాల మానసిక సమస్యల నుంచి బయటపడేందుకు తోడ్పాటునందించే సమగ్ర మొబైల్ వేదికగా టెలి-మానస్ మొబైల్ యాప్ అభివృద్ధి చేశారు. అత్యవసరం కాని వ్యక్తిగత సేవల కోసం 47,487 మందిని, తదుపరి వివరణాత్మక వైద్య మూల్యాంకనం కోసం 9,590 మందిని, మానసిక ఆరోగ్య నిపుణుల (ఎంహెచ్‌పీ) సేవలకు మరో 19,135 మందిని సిఫారసు చేశారు. స్థానికంగా నిరంతర సేవలను కొనసాగించడానికి 1,319 మంది జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం (డీఎంహెచ్‌పీ)లో పనిచేస్తున్నారు. బహుళ-విభాగాల నిపుణుల పర్యవేక్షణ అవసరమయ్యే కేసుల్లో 10,240 మంది వైద్య లేదా శస్త్రచికిత్స నిపుణుల వద్దకు పంపించారు. తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న 5,083 మందిని మానసిక ఆసుపత్రి అత్యవసర విభాగాలకు తక్షణమే పంపించగా, మరో 345 మందిని అధునాతన వైద్య సేవలు అందించడానికి వైద్య కళాశాలలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు పంపించారు.
అడాలసెంట్ ఫ్రెండ్లీ హెల్త్ క్లినిక్స్ (ఏఎఫ్‌హెచ్‌సీ), పీర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అండ్ అడాలసెంట్ హెల్త్ అండ్ వెల్‌నెస్ డేస్ (ఏహెచ్ అండ్ డబ్ల్యూడీ) తదితర కార్యక్రమాల ద్వారా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన రాష్ట్రీయ కిశోర్ స్వాస్థ్య కార్యక్రమం (ఆర్కేఎస్కే) మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించి, కౌన్సెలింగ్ సేవలను అందిస్తుంది.15-20 మంది బాలబాలికలతో బృందాలను ఏర్పాటు చేసి, మానసిక ఆరోగ్యం, సంక్షేమంతో సహా కౌమారదశ ఆరోగ్యంపై వారానికి ఒకటి నుంచి రెండు గంటల పాటు పీర్ ఎడ్యుకేటర్లు చర్చలను నిర్వహిస్తారు. ఆర్కేఎస్కే అనుసరించే వ్యూహంలో మానసిక ఆరోగ్యం ఒక సమగ్ర భాగం. దీనిలో కౌమార దశలో సాధారణంగా ఎదురయ్యే మానసిక ఆరోగ్య సమస్యలు, వాటిని అధిగమించడంపై వైద్యాధికారులు, ఏఎన్ఎమ్లు, కౌన్సిలర్లకు శిక్షణ కూడా ఉంది.
మానసిక ఆరోగ్యంపై విద్యార్థులు, ఉపాధ్యాయులు, కుటుంబాలకు ఆన్‌లైన్ వేదిక ద్వారా సూచనలను, దృశ్య-శ్రవణ వనరులను, భావోద్వేగ ఆరోగ్యంపై మార్గదర్శకత్వాన్ని విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న మనోదర్పణ్ అందిస్తుంది. విద్యాపరమైన ఒత్తిడి, మానసిక సమస్యలను అధిగమించడంలో విద్యార్థులకు సాయం చేసేందుకు సహయోగ్, పరిచర్చ లాంటి భాగస్వామ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఆయుష్మాన్ భారత్ పాఠశాల ఆరోగ్యం, సంక్షేమ కార్యక్రమం పరిధిలో "భావోద్వేగ శ్రేయస్సు - మానసిక ఆరోగ్యం"ను ఒక ప్రత్యేక మాడ్యూల్‌గా చేర్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఇతర అంశాలతో పాటుగా మానసిక ఆరోగ్యంపై శిక్షణ పొందిన ఆరోగ్యం, సంక్షేమ రాయబారులు (ఉపాధ్యాయులు) విద్యార్థులతో ఇంటరాక్టివ్ సెషన్లను నిర్వహిస్తారు. అలాగే ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకొనేలా వారాంతపు కార్యక్రమాలను నిర్వహిస్తారు.
పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు, ఐటీఐలు, విశ్వవిద్యాలయాలు, ఎన్జీవోలు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, ఆరోగ్య కేంద్రాలు, పని ప్రదేశాలు, వృత్తిపరమైన సమావేశాల్లో విస్తృతంగా ప్రచార, అవగాహనా కార్యక్రమాలను టెలిమానస్ బృందాలు చేపట్టాయి. భారతీయ రైల్వే లోకో పైలట్లు, వారి కుటుంబాలు, రిజర్వు పోలీసు సిబ్బంది, ఆదాయ పన్ను అధికారులు, నర్సింగ్, సోషల్ వర్కు విద్యార్థులు, ప్రాథమిక కౌన్సిలర్లు కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వీటిలో వేల మంది పాల్గొన్నారు.
కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్ రావ్ జాదవ్ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంగా ఈ సమాచారాన్ని అందించారు.
***
(రిలీజ్ ఐడి: 2244033)
సందర్శకుల సూచీ సంఖ్య : : 24