విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్ విద్యుత్ సదస్సులో భారత్-ఆఫ్రికా వ్యూహాత్మక భాగస్వామ్య సమావేశం


పునరుత్పాదక ఇంధనం, గ్రిడ్ ఆధునీకరణ, ఇంధన నిల్వ, సౌలభ్యం, సంస్థాగత సామర్థ్యం వంటి రంగాలు భారత్-ఆఫ్రికా సహకారానికి కీలకమని పేర్కొన్న శ్రీ మనోహర్ లాల్

నాడు పోస్టు చేయడమైనది: 21 MAR 2026 1:52PM by PIB Hyderabad

న్యూఢిల్లీలో జరుగుతున్న 2026 భారత్ విద్యుత్‌ సదస్సులో మూడో రోజైన నేడు (21-03-2026) భారత్-ఆఫ్రికా వ్యూహాత్మక భాగస్వామ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షత వహించారు.

ఈ సమావేశానికి విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద నాయక్, హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నయాబ్ సింగ్ సైనీ, మలావి ప్రభుత్వ ఇంధన, గనుల శాఖ మంత్రి డాక్టర్ జీన్ మాతంగా, ఆఫ్రికా 50 సీఈఓ అలైన్ ఎబోబిస్సే, పలు ఆఫ్రికా దేశాల మంత్రులు, ఆఫ్రికన్ యూనియన్, ఆఫ్రికా50 నాయకులు, రాయబారులు, హై కమిషనర్లు, విద్యుత్ సంస్థలు, ఆర్థిక సంస్థలు, అభివృద్ధి భాగస్వాములు, పారిశ్రామిక నాయకుల ప్రతినిధులు హాజరయ్యారు.

భారత్- ఆఫ్రికా దేశాలు తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ స్పష్టమైన ఫలితాలను సాధించే దిశగా ఒక నిర్మాణాత్మక, కార్యాచరణాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించడంపై ఈ చర్చలు దృష్టిసారించాయి. పునరుత్పాదక ఇంధన విస్తరణ, అనుసంధానిత గ్రిడ్ వ్యవస్థల అభివృద్ధి, ఇంధన నిల్వ, సౌలభ్య పరిష్కారాల అభివృద్ధి, సంస్థాగత బలోపేతం ద్వారా సామర్థ్య నిర్మాణం వంటి రంగాల్లో భారత్‌-ఆఫ్రికా దేశాలు కలిసికట్టుగా పనిచేస్తాయని ఈ సమావేశం స్పష్టం చేసింది. నమ్మకమైన, సరసమైన, సుస్థిరమైన ఇంధన లభ్యతను నిర్ధారించడానికి భారత్‌కు ఉన్న అనుభవాన్ని, ఆఫ్రికాకు ఉన్న అపారమైన సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. పెట్టుబడులతో కూడిన సహకారం, సాంకేతిక బదిలీ, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాల ప్రాముఖ్యతను కూడా ఇరుపక్షాలు చర్చించాయి. తద్వారా దీర్ఘకాలిక సామాజిక-ఆర్థిక మార్పునకు దారితీసే సమగ్రమైన, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ఉండే ఇంధన  వ్యవస్థను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

సభను ఉద్దేశించి శ్రీ మనోహర్‌లాల్‌ ప్రసంగిస్తూ.. ఆర్థిక వృద్ధిని సాధించడానికి, ఆత్మగౌరవాన్ని కాపాడటానికి, అవకాశాలను అందిపుచ్చుకోవడానికి విద్యుత్ రంగం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రపంచ ఇంధన అనుసంధానానికి ‘‘ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్’’ అనే దార్శనికత ఒక విప్లవాత్మక మార్గమని ఆయన ప్రస్తావించారు.

ఆఫ్రికన్‌ భాగస్వాములకు కేంద్రమంత్రి స్వాగతం పలికారు. నమ్మకమైన, చౌకైన, సుస్థిరమైన ఇంధనాన్ని సాధించాలనే ఉమ్మడి నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు. ప్రపంచ జనాభాలో దాదాపు మూడింట ఒక వంతు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్, ఆఫ్రికా అందరినీ కలుపుకుని పోయే, సమానమైన, భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉండే అభివృద్ధిని కోరుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇంధన లోటు నుంచి మిగులు వరకు భారత్‌  సాగించిన ప్రయాణాన్ని, పునరుత్పాదక ఇంధన రంగంలో సాధించిన వేగవంతమైన వృద్ధిని వివరించారు. ఈ అనుభవాలు ఆఫ్రికా దేశాలకు ఆచరణాత్మకమైన, విస్తరించదగిన నమూనాలుగా ఉపయోగపడతాయని తెలిపారు. ఆఫ్రికా50, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మధ్య కుదిరిన భాగస్వామ్యాన్ని, ముఖ్యంగా కెన్యా ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టును ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. వినూత్న ఆర్థిక వనరులు, సాంకేతిక నైపుణ్యం, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాల ద్వారా పటిష్టమైన మౌలిక సదుపాయాలను ఎలా నిర్మించవచ్చో ఈ ప్రాజెక్టు ఒక బలమైన నిదర్శనమని  తెలిపారు.

పునరుత్పాదక ఇంధన విస్తరణ, గ్రిడ్ ఆధునీకరణ, ఇంధన నిల్వ, సౌలభ్యం, అలాగే సంస్థాగత బలోపేతంతో కూడిన సామర్థ్య పెంపు వంటి కీలక సహకార రంగాలను శ్రీ మనోహర్ లాల్ వివరించారు. అంతర్జాతీయ సౌర కూటమి వంటి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ.. ఆఫ్రికాతో సహకారాన్ని మరింత లోతుగా కొనసాగించాలనే దేశ నిబద్ధతను ఆయన స్పష్టం చేశారు. భారత్-ఆఫ్రికా ఇంధన సహకారం కేవలం లావాదేవీల పరమైనది కాదని, అది పరస్పర సృజనాత్మకతతో కూడిన రూపాంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. ఈ ఉమ్మడి ప్రయాణంలో భారత్‌ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఉంటుందని చెబుతూ కేంద్రమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

భారత్-ఆఫ్రికా భాగస్వామ్యం కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా ఆచరణలోకి  రావాలని శ్రీ శ్రీపాద నాయక్ ఆకాంక్షించారు. ఇంధన లభ్యత అనేది కేవలం మౌలిక సదుపాయాల కల్పన మాత్రమే కాదని, అది ఆర్థిక పరివర్తనకు ఒక చోదక శక్తి అని అభివర్ణించారు. సమ్మిళిత వృద్ధికి పునాదిగా.. నమ్మకమైన, చౌకైన, సుస్థిరమైన ఇంధనాన్ని అందరికీ అందించాలనే ఉమ్మడి నిబద్ధతను ఆయన గుర్తుచేశారు. ఈ భాగస్వామ్యం సమగ్రమైన, సమానమైన, భవిష్యత్ దార్శనికతతో కూడినదని, ఇది దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతూ భారత్, ఆఫ్రికాలోని సమాజాలను శక్తిమంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆయన పేర్కొన్నారు.

హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సింగ్ సైనీ మాట్లాడుతూ.. సుస్థిరమైన సుపరిపాలనకు హర్యానా కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా సమర్థవంతమైన సాగునీటి నిర్వహణను అభివృద్ధికి మూలస్తంభంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ‘‘ఆధిపత్యం కాదు భాగస్వామ్యం; పోటీ కాదు సహకారం’’ అనేవి భారత్ -ఆఫ్రికాల మధ్య ఉమ్మడి విలువలుగా ఉండాలని పిలుపునిచ్చారు. హర్యానా, ఆఫ్రికా దేశాల మధ్య భాగస్వామ్యం ఇంధన నిర్వహణ, డిజిటల్ పరిపాలన, వ్యవసాయ సహకారం అనే పునాదులపై నిర్మితమైందని ఆయన స్పష్టం చేశారు.

ప్రపంచ పెట్టుబడుల దృక్పథాన్ని వివరిస్తూ.. ఆఫ్రికా50 సీఈఓ శ్రీ అలైన్ ఎబోబిస్సే కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కోరుకుంటున్నది సాయం కాదని, ప్రభావం, లాభదాయకమైన ప్రతిఫలాన్ని ఇచ్చే పెట్టుబడులను మాత్రమే కోరుకుంటున్నామని తెలిపారు. సమగ్ర ప్రణాళిక, కొత్త పెట్టుబడి వ్యవస్థల మద్దతుతో ఆఫ్రికా బ్యాంకులు రుణాలు ఇవ్వగల ప్రాజెక్టుల అభివృద్ధి, విద్యుత్ ప్రసార విస్తరణ, ప్రైవేటు మూలధనాన్ని సమీకరించడంపై ఎక్కువగా దృష్టి సారిస్తోందని ఆయన పేర్కొన్నారు.

గ్రామీణ, మారుమూల ప్రాంతాల కోసం తక్కువ ఖర్చుతో కూడిన సౌరశక్తి పరిష్కారాలు, పవన విద్యుత్ ప్రాజెక్టులు, భారతదేశ భాగస్వామ్యంతో కూడిన పటిష్టమైన ఇంధన పరివర్తన వంటి పునరుత్పాదక ఇంధన కార్యక్రమాల ద్వారా సుస్థిర అభివృద్ధిని, దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ జీన్ మతంగా పేర్కొన్నారు. ఆఫ్రికా సమగ్ర విద్యుత్ వ్యవస్థ లక్ష్యాలకు అనుగుణంగా విద్యుదీకరణ, ప్రసార మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్మార్ట్ మీటరింగ్, గ్రిడ్‌లు, మైక్రోగ్రిడ్లపై సహకారానికి ఆమె పిలుపునిచ్చారు. ఈ ప్రయత్నాల వల్ల దేశానికి ఇంధన భద్రత, ఖనిజాల లభ్యత, విస్తృత మార్కెట్ల వంటి బహుముఖ ప్రయోజనాలు ఉంటాయని ఆమె వివరించారు. ఆఫ్రికాకు సరసమైన సాంకేతికత, మౌలిక సదుపాయాలు, మెరుగైన గ్రిడ్ విశ్వసనీయత, విద్యుదీకరణ అందుతాయని తెలిపారు. తద్వారా భారత్‌ సాంకేతిక బలాన్ని, ఆఫ్రికా  అపారమైన వనరుల సామర్థ్యంతో అనుసంధానించి సురక్షితమైన, సమగ్రమైన విద్యుత్ వ్యవస్థలను నిర్మించవచ్చని ఆమె ఆకాంక్షించారు.

భారత్-ఆఫ్రికా వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రధానంగా ఇంధనం, మౌలిక సదుపాయాలు, సామర్థ్య పెంపుపై దృష్టి సారిస్తూ, సుస్థిర వృద్ధి కోసం పరస్పర ప్రయోజనకరమైన విధాన్ని నిర్మించడంపై కేంద్రీకృతమై ఉంది. ఆఫ్రికాలో మారుతున్న అభివృద్ధి పథానికి ముఖ్యంగా విద్యుదీకరణ, పునరుత్పాదక ఇంధనం, గ్రిడ్ అనుసంధానత వంటి రంగాలలో దేశ అనుభవాన్ని ఒక నమూనాగా ఈ భాగస్వామ్యం ఉపయోగిస్తుంది. ఆఫ్రికా50 వంటి సంస్థలు అంతర్జాతీయ సౌర కూటమి వంటి కార్యక్రమాల ద్వారా ఈ భాగస్వామ్యం పెట్టుబడులను, సాంకేతిక బదిలీని, సౌర పైకప్పులు, హైడ్రో-సోలార్ అనుసంధానం, మినీ గ్రిడ్లు వికేంద్రీకృత ఇంధన వ్యవస్థల వంటి విస్తరించదగిన పరిష్కారాలను ప్రోత్సహిస్తుంది. అలాగే సమగ్ర వృద్ధిని వేగవంతం చేయడానికి విధానపరమైన వ్యవస్థలు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలు, మానవ వనరుల అభివృద్ధిపై కూడా ఇది దృష్టి సారిస్తుంది. చివరగా ఈ భాగస్వామ్యం ఇంధన లభ్యతలోని అంతరాలను తొలగించి, ప్రాంతీయ సమగ్రతను పెంపొందించడం ద్వారా ఆఫ్రికా దేశాలలో దీర్ఘకాలిక పరివర్తనను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

డాక్టర్ నిమిష్ రుస్తగి

మీడియా, సమాచార విభాగ అధిపతి

విద్యుత్ మంత్రిత్వ శాఖ


(రిలీజ్ ఐడి: 2243465) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Telugu