వికసిత్ భారత్ 2047 దార్శనికతకు అనుగుణంగా దేశ యువత ఆకాంక్షలు, సామర్థ్యాలు భాగస్వామ్యాన్ని జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతలతో అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం ‘జాతీయ యువజన విధానం 2026’ ను ప్రతిపాదించింది. ఇది యువజన అభివృద్ధి పట్ల దేశ వ్యూహాత్మక పరిణామాన్ని సూచిస్తుంది. 2014 నాటి పాత జాతీయ యువజన విధానం పునాదులపై నిర్మితమైన ఈ కొత్త విధానం.. కేవలం సాధారణ మార్గదర్శకత్వానికే పరిమితం కాకుండా మరింత నిర్మాణాత్మకమైన, ఫలితాలను సాధించే లక్ష్యంతో రూపొందింది.
యువతను దేశాభివృద్ధిలో భాగస్వాములను చేసేందుకు ఈ విధానం ఆరు ప్రధాన రంగాలను గుర్తించింది. అవి యువ నాయకత్వం, స్వచ్ఛంద సేవ; విద్య; నైపుణ్యాభివృద్ధి, ఉపాధి; వ్యవస్థాపకత, ఆవిష్కరణలు; ఆరోగ్యం, శ్రేయస్సు; క్రీడలు, వినోదం; పర్యావరణం, వాతావరణ చర్యలు. ఈ రంగాలు కేవలం ఆర్థిక ఉత్పాదకతనే కాకుండా, పౌర బాధ్యత, సుస్థిరత, న్యాయకత్వం, సమగ్ర మానవ వనరుల అభివృద్ధిని ప్రతిబింబిస్తాయి.
ఈ విధానాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి ప్రభుత్వం మై భారత్ వేదికను ఒక కీలక సాధనంగా ప్రవేశపెట్టింది. ఇది డిజిటల్ వ్యవస్థ ద్వారా యువత భాగస్వామ్యాన్ని ఆచరణలోకి తీసుకువస్తుంది. ఈ వేదిక ద్వారా యువత తమ పేర్లను నమోదు చేసుకోవడానికి, యువత తమ పేర్లను నమోదు చేసుకోవడానికి, ప్రొఫైల్‌లను రూపొందించుకోవడానికి, అనుభవపూర్వక అభ్యాస కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, వివిధ భాగస్వామ్య కార్యక్రమాలలో ఆసక్తిగా పాల్గొనడానికి అవకాశం కల్పిస్తుంది. వివిధ మంత్రిత్వ శాఖలు, సంస్థలలోని అవకాశాలను ఒకే చోట చేర్చడం ద్వారా యువత భాగస్వామ్యానికి, వారి సామర్థ్యాల పెరుగుదలకు ఇది కేంద్రకృత వేదికగా పనిచేస్తుంది. మై భారత్ యువతలో సేవా భావాన్ని పెంపొందిస్తుంది. వారిని సామాజిక మార్పునకు ప్రతినిధులుగా తీర్చిదిద్దుతుంది. ఇది రిజిస్ట్రేషన్లు, కార్యక్రమాల్లో భాగస్వామ్యం, సంస్థాగత భాగస్వామ్యాల వంటి అంశాలను ఎప్పటికప్పుడు విశ్లేషించే ఒక డేటా ఆధారిత పాలనా సాధనంగా కూడా పనిచేస్తుంది. తద్వారా సాక్ష్యాధారాలతో కూడిన విధాన రూపకల్పనకు, కార్యక్రమాల రూపకల్పనను బలోపేతం చేస్తుంది.
ఈ విధాన రూపకల్పన ప్రక్రియ పౌర భాగస్వామ్యంతో కూడినది, సమగ్రమైనది. మై గవర్నమెంట్, మై భారత్ వంటి వేదికల ద్వారా పౌరుల నుంచి అభిప్రాయాలను సేకరించడంతో పాటు, వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల స్థాయిల్లో సంప్రదింపులు జరిపి దీనిని రూపొందించారు. ఇది వివిధ ప్రాంతీయ, జనాభా పరమైన దృక్పథాలను ఈ విధానంలో ప్రతిబింబించేలా చేస్తుంది.
ఈ విధాన వ్యవస్థకు ఆర్ జీఎన్ఐవైడీ రూపొందించిన యువజన అభివృద్ధి సూచిక (2017) వంటి విశ్లేషణాత్మక సాధనాలు మద్దతు ఇస్తున్నాయి. ఇవి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్య, ఆరోగ్య సూచికలపై అవగాహనను అందిస్తాయి. పర్యవేక్షణ, మూల్యాంకన యంత్రాంగాలు కూడా బలోపేతం చేశారు. మై భారత్ వేదికతో అనుసంధానించిన తక్షణ సమాచారం చూపే డాష్‌బోర్డ్‌లు, నీతి ఆయోగ్ అవుట్‌పుట్-అవుట్‌కమ్ మానిటరింగ్ వ్యవస్థ ద్వారా యువత భాగస్వామ్యం, కార్యక్రమాల ప్రభావాన్ని క్రమపద్ధతిలో పర్యవేక్షించడం సాధ్యమవుతుంది.
డిజిటల్ శక్తితో కూడిన, భాగస్వామ్య, ఫలితాల ఆధారిత యువజన పాలనా వ్యవస్థ వైపు జాతీయ యువజన విధానం 2026 ఒక కీలక మార్పును సూచిస్తుంది. ఇది యువతను కేవలం లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా దేశ అభివృద్ధి పథంలో కీలక భాగస్వాములుగా నిలుపుతుంది.
ఈ సమాచారాన్ని యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా గురువారం రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.