రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్యాస్ సరఫరాని పెంచిన ప్రభుత్వం: 23 శాతం పెరిగిన యూరియా ఉత్పత్తి


ఖరీఫ్ 2026 సమయంలో ఎరువుల భద్రత: భారతీయ రైతుల ప్రయోజనం కోసం ఎరువుల దిగుమతుల వికేంద్రీకరణ

మార్చి నెలాఖరులోపు భారతీయ గోదాముల్లోకి చేరుకోనున్న అత్యధిక శాతం ఎరువులు

నాడు పోస్టు చేయడమైనది: 19 MAR 2026 7:06PM by PIB Hyderabad

పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాల మధ్య 2026 ఖరీఫ్ సీజన్‌కు ముందు ఎరువుల లభ్యతను స్థిరీకరించటం, పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేసింది. దేశీయ ఉత్పత్తిని పెంచడం, అత్యాధునిక ప్రపంచవ్యాప్త సేకరణ వ్యూహాల కలయిక ద్వారా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో తలెత్తే అస్థిరతల నుంచి భారతీయ రైతులను రక్షించడానికి ఎరువుల శాఖ తగిన చర్యలు చేపట్టింది.

 

గ్లోబల్ టెండర్ ద్వారా గ్యాస్ సరఫరా

సహజ వాయువు కోసం ప్రభుత్వం ఈపీఎంసీ (ఎంపవర్డ్ పూల్ మేనేజ్‌మెంట్ కమిటీ) వేలాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. దీనివల్ల క్షేత్రస్థాయిలో యూరియా లభ్యత ప్రత్యక్షంగా పెరుగుతుంది. ప్రస్తుత ధరల (స్పాట్ ప్రాతిపదికన) వద్ద అదనంగా 7.31 ఎంఎంఎస్‌సీఎండీ (రోజుకు మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు) గ్యాస్‌ను సేకరించడం ద్వారా యూరియా ఉత్పత్తి కేంద్రాలకు మొత్తం సరఫరా 23 శాతం పెరిగింది (అంటే 32 ఎంఎంఎస్‌సీఎండీ నుంచి 39.31 ఎంఎంఎస్‌సీఎండీకి చేరింది).

ఈ జోక్యం తక్షణ ఫలితాలను ఇవ్వనుంది. దేశీయ యూరియా ఉత్పత్తి రోజుకు 54,500 మెట్రిక్ టన్నుల (ఎంటీ) నుంచి 67,000 మెట్రిక్ టన్నులకు.. అంటే దాదాపు 23 శాతం పెరగనుందన్న అంచనా ఉంది. దీనివల్ల యూరియా ఉత్పత్తి కేంద్రాల సగటు గ్యాస్ అవసరాలు తీరే శాతం గతంలో ఉన్న 62 నుంచి గణనీయంగా పెరిగి 72 శాతానికి చేరుకుంది. 

మెరుగైన నిల్వ సామర్థ్యం

ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల ఫలితంగా గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ప్రస్తుతం ఎరువుల నిల్వలు గణనీయంగా మెరుగుపడ్డాయి. 2025 మార్చిలో 55.22 లక్షల మెట్రిక్ టన్నులుగా (ఎల్ఎంటీ) ఉన్న మొత్తం యూరియా నిల్వలు ప్రస్తుతం 61.14 ఎల్ఎంటీకి చేరుకున్నాయి. మరీ ముఖ్యంగా డీఏపీ నిల్వలు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగి 24.24 ఎల్ఎంటీలకు చేరాయి. ఇది రాబోయే సాగు సీజన్‌కు తగినంత భరోసాను కల్పిస్తుంది.

 

ఉత్పత్తి (ఎల్ఎంటీ)

19.03.2026 నాటి నిల్వలు

19.03.2025 నాటి నిల్వలు

యూరియా

61.14

55.22

డీఏపీ

24.24

11.85

ఎన్‌పీకే

57.21

34.44

ఎస్ఎస్‌పీ

24.8

23.15

ఎంఓపీ

12.65

14.13

దౌత్యపరమైన ప్రయోజనం:

వివిధ మంత్రిత్వ శాఖల (ఇంటర్ మినిస్ట్రీయల్) మీడియా సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి శ్రీ రణధీర్ జైస్వాల్ ప్రభుత్వ వ్యూహాన్ని వివరిస్తూ.. ఈ బహుముఖ, వికేంద్రీకరణ విధానాన్ని ఈ కింది విధంగా పేర్కొన్నారు:

"ప్రస్తుత తరుణంలో మన ఎరువుల పరిస్థితిని చూస్తే ముఖ్యంగా 2026 ఖరీఫ్ సాగు సీజన్‌కు సంబంధించి మన దగ్గర తగినంత నిల్వలు ఉన్నాయి. మనం సంతృప్తికరమైన స్థితిలో ఉన్నాం. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ముందే ఊహించి ఎరువుల శాఖ తగినంత ముందుగానే గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. వీటికి చాలా మంచి స్పందన లభించింది. వివిధ వనరుల నుంచి ఆర్డర్ చేసిన దానిలోని అత్యధిక పరిమాణంలో ఎరువులు మార్చి నెలాఖరు నాటికి దేశానికి చేరుకుంటాయని మేం భావిస్తున్నాం. అదే సమయంలో నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే… అవును ఎరువుల దిగుమతుల సేకరణ విషయంలో మేం వికేంద్రీకరణ విధానాన్ని అనుసరిస్తున్నాం. ఆ విషయంలో మేం పలు దేశాలతో నిరంతరం సంప్రదిస్తున్నాం."

గ్లోబల్ టెండర్లను విషయంలో దూకుడుగా వ్యవహరించటం, ఎరువులను సరఫరా చేసే పలు దేశాలతో ఉన్నత స్థాయి దౌత్యపరమైన సంప్రదింపులను కొనసాగించడం ద్వారా ఈ నెల ముగిసేలోపే అత్యధిక శాతం ఎరువుల నిల్వలు భారతీయ గిడ్డంగులకు చేరుకునేలా ఎరువుల శాఖ చూసుకుంది. ఇది ప్రభుత్వ ముందస్తు క్రియాశీలక పరిపాలనకు దక్కిన ఒక ముఖ్యమైన విజయం.

 

***


(రిలీజ్ ఐడి: 2242765) సందర్శకుల సూచీ సంఖ్య : : 126
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Kannada