విద్యుత్తు మంత్రిత్వ శాఖ
భారత్ విద్యుత్ సదస్సు - 2026: భారత ఇంధన భవితను రూపుదిద్దే దిశగా ఒకే వేదికపైకి విధాన నిర్ణేతలు, పారిశ్రామికాధినేతలు
నాడు పోస్టు చేయడమైనది:
18 MAR 2026 2:03PM by PIB Hyderabad
ఇంధన, విద్యుత్ రంగానికి సంబంధించి అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రపంచ స్థాయి సదస్సు, ప్రదర్శన అయిన భారత్ విద్యుత్ – 2026ను మార్చి 19 నుంచి 22 వరకు న్యూఢిల్లీలోని యశోభూమిలో నిర్వహించనున్నారు.
ఈ సదస్సులో 100కు పైగా ఉన్నత స్థాయి సమావేశాలు, 300కు పైగా వక్తలు, 80కి పైగా దేశాల ప్రతినిధులు, 100 అంకుర సంస్థలు సహా మొత్తం 500కు పైగా ప్రదర్శనకారులు, 25,000 మందికి పైగా సందర్శకులు పాల్గొంటారని అంచనా. విద్యుత్ రంగానికి సంబంధించి ఇది ప్రపంచంలో అతిపెద్ద వేదికల్లో ఒకటిగా ఇది నిలవనుంది.
‘విద్యుదీకరణతో వృద్ధి.. సాధికారికంగా సుస్థిరత.. ప్రపంచంతో అనుసంధానం..’ అన్న ఇతివృత్తంతో నిర్వహించనున్న ఈ సదస్సులో వ్యూహాత్మక సమావేశాలు, సాంకేతిక సదస్సులు, పారిశ్రామికాధినేతల బృందాల చర్చలు, పరిశ్రమల మధ్య పరస్పర చర్చల వంటి ఉన్నత స్థాయి సమావేశాలతో కూడిన సమగ్ర కార్యక్రమాలుంటాయి. అంతర్జాతీయంగా విద్యుత్ రంగంలో వృద్ధిని పెంపొందిస్తూ, దాన్ని మరింత తీర్చిదిద్దుతూ ముందుకు తీసుకెళ్లడమే వీటి లక్ష్యం.
వివిధ దేశాలకు చెందిన ఇంధన శాఖ మంత్రులు, భారతీయ రాష్ట్రాల మంత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నత స్థాయి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కాబోతున్నారు. విద్యుత్, శుద్ధ ఇంధన రంగంలో చర్చలకూ, సహకారానికీ, ఆవిష్కరణలకూ అంతర్జాతీయంగా ముఖ్యమైన వేదికల్లో ఒకటిగా ఈ సదస్సు నిలుస్తుందని.. ఇంతటి భారీ స్థాయిలో ప్రతినిధుల భాగస్వామ్యం ద్వారా స్పష్టమవుతోంది.
సదస్సులో ప్రసంగించబోయే ముఖ్య వక్తల్లో కేంద్ర విద్యుత్, గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ మనోహర్ లాల్, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార - ప్రజా పంపిణీ శాఖ, నూతన - పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి, విద్యుత్, నూతన - పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద నాయక్, కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీ పంకజ్ అగర్వాల్, కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) చైర్మన్ శ్రీ ఘనశ్యామ్ ప్రసాద్ ఉన్నారు. వీరితోపాటు 10 దేశాల ఇంధన శాఖ మంత్రులు, దేశంలోని 25కు పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విద్యుత్ శాఖ మంత్రులు, కార్యదర్శులు, 60 దేశాల ప్రతినిధులు, అన్ని కేంద్ర విద్యుత్ రంగ సంస్థల అధిపతులు సహా వందకు పైగా సీఈవోలు సదస్సులో భాగస్వాములు కాబోతున్నారు.
ఈ విధంగా దేశంలో మారుతున్న విద్యుత్ వ్యవస్థను ప్రభావితం చేసే కీలక అంశాలపై చర్చించడానికి.. ఉన్నత స్థాయి విధానకర్తలు, నియంత్రణాధికారులు, విద్యావేత్తలు, ఈ రంగంలో నిపుణులు, విద్యుత్ సంస్థలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు, పరిశ్రమల అధినేతలను ఈ సదస్సు ఒకే వేదికపైకి తీసుకురాబోతోంది.
మేక్ ఇన్ ఇండియా కింద సరఫరాదారుల అభివృద్ధిపై ఈ సదస్సు ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. ముఖ్యంగా కాలుష్య నియంత్రణ వ్యవస్థలు, సౌరశక్తి, ఇంధన నిల్వ, విద్యుత్ ప్రసార మౌలిక సదుపాయాలు, పంపిణీకి సంబంధించి డిజిటల్ సాంకేతికతల్లో దేశీయ పరిజ్ఞానాన్ని పెంపొందించడంపై ఇది ప్రధానంగా దృష్టి సారిస్తుంది. 2032 నాటికి విద్యుదుత్పత్తి, ప్రసారం, పంపిణీ, ఇంధన నిల్వ రంగాల్లో రూ. 50 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి అవకాశాలున్నట్టు అంచనా. ఈ నేపథ్యంలో దేశ విద్యుత్ రంగంలో ఆవిష్కరణలనూ, పోటీతత్వాన్నీ పెంపొందించడం, ఈ రంగంలో ఉత్తేజం నింపడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యం.
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత విద్యుత్ రంగంపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆసక్తిని.. 80కి పైగా దేశాల ప్రతినిధుల భాగస్వామ్యం ప్రతిబింబిస్తుంది. అలాగే అవాంతరాలను తట్టుకుని నిలిచేలా, అందుబాటు ధరలో లభించేలా, పర్యావరణ హిత పద్ధతుల వైపు ఇంధన పరివర్తనను సాధ్యం చేసే దిశగా- భారత్ స్థాయి పెరుగుతోందని ఇది చాటుతోంది.
అంతర్జాతీయ ప్రతినిధులతోపాటు దేశంలోని 25కు పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఉన్నత స్థాయి నేతలు, అధికారులు కూడా ఈ సదస్సులో భాగస్వాములు కాబోతున్నట్టు ధ్రువీకరించారు. హర్యానా (వ్యూహాత్మక రాష్ట్ర భాగస్వామి), రాజస్థాన్ (భాగస్వామి రాష్ట్రం), ఉత్తరప్రదేశ్ (వ్యూహాత్మక రాష్ట్ర భాగస్వామి), మహారాష్ట్ర (వ్యూహాత్మక రాష్ట్ర భాగస్వామి), ఆంధ్రప్రదేశ్ (ప్రత్యేకంగా దృష్టి సారించిన రాష్ట్రం), బీహార్ (ప్రత్యేకంగా దృష్టి సారించిన రాష్ట్రం), ఒడిశా (ప్రత్యేకంగా దృష్టి సారించిన రాష్ట్రం), గుజరాత్ (వ్యూహాత్మక రాష్ట్ర భాగస్వామి), పంజాబ్ (భాగస్వామి రాష్ట్రం), మధ్యప్రదేశ్ (భాగస్వామి రాష్ట్రం), ఛత్తిస్ గఢ్ (భాగస్వామి రాష్ట్రం), ఢిల్లీ (ప్రత్యేకంగా దృష్టి సారించిన రాష్ట్రం) రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ సదస్సులో ప్రత్యేక భాగస్వామ్యం లభించనుంది. దేశ విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడం, పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని వేగవంతం చేయడం, గ్రిడ్ మౌలిక సదుపాయాల ఆధునికీకరణ, దేశవ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటి కీలక అంశాలపై చర్చలను సానుకూలం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం కీలకమవుతుందని భావిస్తున్నారు.
ఈ సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలిచే 20,000 చదరపు మీటర్ల భారీ ప్రదర్శనలో విద్యుత్ రంగంలోని అన్ని దశలకూ చెందిన అత్యాధునిక సాంకేతికతలను, ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనను విద్యుదుత్పత్తి, ప్రసారం, పునరుత్పాదక, శుద్ధ ఇంధనం, ఇంధన నిల్వ, పంపిణీ, స్మార్ట్ గ్రిడ్ సాంకేతికతల వంటి వివిధ నేపథ్య విభాగాలుగా విభజించారు. వీటితోపాటు ఇంధన ఆవిష్కరణలు, అంకుర సంస్థలు, అధునాతన సాంకేతికతల కోసం ప్రత్యేక ప్రదర్శనలుంటాయి. విద్యుదుత్పత్తి సాంకేతికతలు, ప్రసార వ్యవస్థలు, నియంత్రణ మార్గాలు, డిజిటల్ సాంకేతికతలు, బ్యాటరీ ఆవిష్కరణలు, ఇంధన సామర్థ్య మార్గాల ప్రదర్శన కోసం.. పరిశ్రమల అధినేతలు, ఆవిష్కర్తలు, తయారీదారులకు ఈ విభాగాలు ఒక గొప్ప వేదికగా ఉపయోగపడతాయి.
ఈ సదస్సులో భాగంగా పరిశ్రమల మధ్య సహకారాన్ని, ప్రభావవంతమైన చర్చలను పెంపొందించడం కోసం వరుసగా పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. అంతర్జాతీయ మంత్రిత్వ స్థాయి సమావేశం, జాతీయ విద్యుత్ మంత్రిత్వ స్థాయి సమావేశం, విద్యుదుత్పత్తి - ప్రసారం - పంపిణీ విభాగాల సీఈవోల ఫోరమ్‌లు ఇందులో భాగంగా ఉంటాయి. అలాగే ఈ రంగంలోని ప్రముఖ సంస్థల సీఈవోలతో (హిటాచీ - యూఎస్ఏ, రొసెట్టి - రష్యా, ఎస్కోమ్, టీఎన్బీ - మలేషియా, ఆఫ్రికా50, ఈడీఎఫ్ పవర్ సొల్యూషన్స్, జెస్కో కంపెనీల సీఈవోలు సహా) రంగాలవారీ సమగ్ర చర్చా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. అంతేకాకుండా స్థిర ఇంధన నిల్వ, ప్రసార రంగంలో ఇండస్ట్రీ 4.0 సాంకేతికతలు, జల విద్యుత్ అభివృద్ధి, కార్బన్ మార్కెట్లు, చట్టపరమైన, నియంత్రణ వ్యవస్థలు, విద్యుత్ సరఫరా వ్యవస్థలో సరఫరాదారుల అభివృద్ధి అవకాశాల వంటి కీలక పారిశ్రామిక ప్రాధాన్యాలపై ఇతివృత్తాల వారీగా ఈ సదస్సులో సమావేశాలను నిర్వహిస్తారు. ఇంధన రంగంలో అంకుర సంస్థలు, నవతరం సాంకేతికతలు, యువ నిపుణులు, విద్యుత్ రంగ నాయకత్వ స్థానంలో మహిళలను ప్రోత్సహించే కార్యక్రమాలపై ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తారు.
ఆఫ్రికా సెషన్, బ్రిటిష్ హై కమిషన్, ప్రముఖ అంతర్జాతీయ ఇంధన సంఘాలు సహా అంతర్జాతీయ సహకార వేదికలకు ఈ సదస్సులో మరింత ప్రాధాన్యముంటుంది. వీటితోపాటు కేబుల్‌టెక్-2026 వంటి ప్రత్యేక పారిశ్రామిక చర్చలు, వికేంద్రీకృత పునరుత్పాదక ఇంధనం కోసం వినియోగదారుడి ప్రాంగణంలోనే ఏర్పాటు చేసుకునే ఇంధన నిల్వ వ్యవస్థలపై చర్చలు ఉంటాయి. విద్యుత్ రంగ భవితను నిర్దేశించే సరికొత్త సాంకేతికతలు, పెట్టుబడి అవకాశాలను అన్వేషించేలా.. భారత ఇంధన నిల్వ కూటమి (ఐఈఎస్ఏ) వంటి సంస్థల నేతృత్వంలో సమావేశాలు కూడా జరుగుతాయి.
ప్రపంచ విద్యుత్ వ్యవస్థ భవిష్యత్తుకు కీలకమైన అంశాలపై ఈ సదస్సులో జరిగే వ్యూహాత్మక చర్చలు ప్రధానంగా దృష్టి సారిస్తాయి. 120 మందికి పైగా ప్రముఖ నాయకులు, కీలక నిర్ణేతలు ప్యానెల్ చర్చల్లో పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా పరస్పరానుసంధాన విద్యుత్ వ్యవస్థల బలోపేతం, ఇంధన పరివర్తనలో ప్రపంచవ్యాప్తంగా భారత అగ్రగణ్యతను ముందుకు తీసుకెళ్లడం, పటిష్టమైన విద్యుత్ సరఫరా వ్యవస్థల నిర్మాణం వంటివి ఇందులో ప్రధానాంశాలుగా ఉంటాయి. వీటితోపాటు విద్యుత్ రంగంలో కొత్త పెట్టుబడులకు దారులు వెతకడం, శుద్ధ ఇంధన సాంకేతికతల వినియోగాన్ని వేగవంతం చేయడం, విద్యుత్ రంగానికి సంబంధించి ప్రతీ దశలోనూ అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించడంపైనా ఇందులో చర్చలు నిర్వహిస్తారు.
విద్యుత్ రంగంలో సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరిచే మార్గాలపై కూడా ఈ సదస్సులో చర్చిస్తారు. ఇంధన లభ్యతలో సమ్మిళితత్వాన్ని విస్తరించడం, అలాగే వేగంగా మారుతున్న ఈ రంగానికి అవసరమైన అధునాతన నైపుణ్యం కలిగిన సిబ్బందిని తీర్చిదిద్దడంపై కూడా ఈ సమావేశాలు ప్రత్యేకంగా దృష్టి సారిస్తాయి.
ప్రభుత్వాధినేతలు, ప్రాజెక్టు యజమానులు, ఈపీసీ కంపెనీలు, మౌలిక సదుపాయాల నిర్మాణ సంస్థలు, అంతర్జాతీయ కొనుగోలుదారులు, సాంకేతిక - ఇంజనీరింగ్ నిపుణులు, ఆర్థిక సంస్థలు, ఎంఎస్ఎంఈలు, భారీ తయారీదారులు, పరిశ్రమల సంఘాలు, విద్యావేత్తలు సహా.. ప్రపంచవ్యాప్త వివిధ వర్గాలకు చెందిన వీక్షకుల దృష్టిని ఈ కార్యక్రమం ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. ఈ సదస్సులో భాగంగా కొనుగోలుదారు – విక్రేతల సమావేశాలను కూడా నిర్వహిస్తారు. అంతర్జాతీయ కొనుగోలు సంస్థలు, విద్యుత్ సంస్థలు, మౌలిక సదుపాయాల నిర్మాణ సంస్థలు.. భారతీయ తయారీదారులు, సాంకేతిక నిపుణులతో నేరుగా చర్చించేందుకు ఇవి వీలు కల్పిస్తాయి.
ఇంధన భద్రత, సుస్థిరతలతోపాటు అంతర్జాతీయ స్థాయిలో ముందువరుసలో నిలవాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా – పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడంతోపాటు.. ప్రపంచ విద్యుత్ వ్యవస్థలో భారత్ పాత్రను మరింత బలోపేతం చేసే దిశగా ఈ సదస్సు ఉత్ప్రేరకంగా నిలుస్తుందని భావిస్తున్నారు.
భారత్ విద్యుత్ సదస్సు- 2026కు సంబంధించి మరింత సమాచారం కోసం ఈ వెబ్‌సైటును సందర్శించండి: www.bharatelectricitysummit.com
***
(రిలీజ్ ఐడి: 2242312)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7