కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
వికసిత్ భారత్‌లో భాగంగా అనుసంధానత: నిర్ణీత సమయంలో ఇండియా పోస్టు డెలివరీ సేవలను ప్రారంభించిన కేంద్రమంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా.. భారతదేశ వృద్ధి పథంలో అమృత కాలం నుంచి శతాబ్ది కాలం వైపు పయనం
ప్రధానమంత్రి దార్శనిక నాయకత్వంలో భారత రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులను వేగవంతం చేసేందుకు నిర్ణీత సమయంలో డెలివరీ సేవలను ప్రారంభించిన తపాలా శాఖ
నిర్ణీత సమయానికి డెలివరీ చేసే వ్యవస్థను బలోపేతం చేసేందుకు 24 స్పీడ్ పోస్టు, 48 స్పీడ్ పోస్టు, 24 స్పీడ్ పోస్టు పార్శిల్ సేవలను ప్రారంభించిన తపాలా శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
17 MAR 2026 6:24PM by PIB Hyderabad
భారతదేశ రవాణా రంగాన్ని సమూలంగా మార్చాలనే ప్రభుత్వ దార్శనికతను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర కమ్యూనికేషన్లు, డీఓఎన్ఈఆర్ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా.. 24 స్పీడ్ పోస్టు, 48 స్పీడ్ పోస్టు, 24 స్పీడ్ పోస్టు పార్శిల్ వంటి మూడు నూతన ప్రీమియం డెలివరీ సేవలను మార్చి 17, 2026న న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసానితో పాటు తపాలా శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వేగంగా విస్తరిస్తున్న రవాణా రంగంలో నిర్ణీత సమయంలో డెలివరీ సేవలను అందించే తపాలా శాఖ విభాగంలో సామర్థ్యాన్ని మెరుగుపరచటమే ఈ సేవల ప్రధాన ఉద్దేశం.
ఈ సందర్భంగా కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా మాట్లాడుతూ.. "ఈ రోజు మన శాఖకు చరిత్రాత్మకమైన రోజు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడికి, అంతర్జాతీయ ఖాతాదారులకు ఇండియా పోస్టు అంకితభావంతో సేవలందిస్తుందని మేం తెలియజేస్తున్నాం" అని తెలిపారు.
మూడు నెలలుగా ఈ సేవలను ప్రయోగాత్మకంగా పరిశీలించి, క్రమబద్ధమైన ట్రయల్ రన్స్ నిర్వహించి సేవలను మెరుగుపరచటంలో తపాలా సిబ్బంది చూపిన నిబద్ధతను, అవిశ్రాంత కృషిని ఆయన అభినందించారు. "ఇవాళ తపాలా శాఖకు నూతనోత్తేజం కలిగింది. ఇది వినియోగదారులకు భరోసానిచ్చే సమయం. పునరుద్ధరించుకున్న పురాతన సంస్థ.. స్పష్టత, ఆత్మవిశ్వాసం, నిర్దేశిత లక్ష్యంతో అమృత కాలం నుంచి శతాబ్ది కాలం వైపు ప్రయాణాన్ని సాగిస్తోందని దేశానికి చాటిచెప్పే సందర్భమిది" అని కేంద్రమంతి అన్నారు.
కమ్యూనికేషన్ల సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. “భారత తపాలా శాఖ 170 ఏళ్లకు పైగా ఉత్తరాలను చేరవేసింది. రాబోయే దశాబ్దాల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రపంచ స్థాయి మార్కెట్ల వరకు భారత ఆర్థిక ప్రగతిని ఈ శాఖ పరుగులు పెట్టిస్తుంది. గతంలో కంటే వేగంగా, విస్తృతంగా, మరింత నమ్మకంగా అవకాశాలను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తపాలా శాఖ కృషి చేస్తుంది" అని తెలిపారు.
వివిధ పని వాతావరణాల్లో కఠినమైన పైలట్ పరీక్షలను నిర్వహించి, ప్రోత్సాహకరమైన ఫలితాలతో ఆ ప్రయోగాలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత.. తపాలా శాఖ, వినియోగదారులకు ప్రాధాన్యతనిచ్చే ఈ మూడు రవాణా సేవలను ప్రవేశపెట్టింది. ఈ సానుకూల ఫలితాలతో దేశవ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తీసుకురావటం.. వేగంగా, ముందస్తు అంచనాలతో, సాంకేతికతతో కూడిన డెలివరీ సేవలను అందించటంలో ఇండియా పోస్టుకున్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఇవి పౌరులకు, వాణిజ్యానికి, పెరుగుతున్న దేశ ఆర్థిక ఆకాంక్షలకు ఎంతగానో తోడ్పడతాయి.
వ్యాపార, ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, వ్యక్తిగత వినియోగదారులకు వేగవంతమైన, భద్రతతో కూడిన, కచ్చితత్వంతో డెలివరీ సర్వీసును అందించేందుకు నూతనంగా ప్రవేశపెట్టిన సేవలను ప్రారంభిస్తూ హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరులోని ప్రధాన తపాలా కార్యాలయాల్లో ప్రత్యక్ష సరకు రవాణా బుకింగ్స్ నిర్వహించారు.
24 స్పీడ్ పోస్టు, 24 స్పీడ్ పోస్టు పార్శిల్ సర్వీస్ ద్వారా దేశంలోని ఆరు ప్రధాన మెట్రో నగరాలైన న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ మధ్య మరుసటి రోజే (డీ+1) డెలివరీ జరుగుతుందని హామీ ఇచ్చారు. నిర్ణీత సమయంలో పార్శిల్ అందజేయటమే కాక, డెలివరీలో ఆలస్యమైతే పరిహారం చెల్లిస్తారు. రియల్-టైం ట్రాకింగ్, ఓటీపీ ఆధారిత డెలివరీ నిర్ధారణ ద్వారా పారదర్శత, భద్రత పెరుగుతుంది. జాతీయ సెలవు రోజుల్లో మినహా అన్ని ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లోనూ డెలివరీలు కొనసాగుతాయి. ప్రస్తుతం ఆరు మెట్రో నగరాల్లో ప్రారంభమైన ఈ సేవలు.. దశలవారీగా టైర్-1, టైర్-2 నగరాలకు విస్తరించనున్నారు. ప్రధాన వాణిజ్య కేంద్రాల మధ్య వేగవంతమైన రవాణా సౌకర్యం ద్వారా ఈ సేవలు.. ఈ-కామర్స్ సంస్థలకు, ఎంఎస్ఎంఈలకు, అంకురసంస్థలకు, ఇతర వ్యాపార వినియోగదారులకు ఎంతో మేలు చేకూరుస్తాయి.
ఈ సేవలు ప్రారంభమైన మెట్రో నగరాల మధ్య 48 స్పీడ్ పోస్టు సర్వీసు రెండు రోజుల్లో (డీ+2) కచ్చితంగా సరకును డెలివరీ చేస్తుంది. ఇది ఎండ్-టు-ఎండ్ ట్రాకింగ్, ఎస్ఎంఎస్, సురక్షితమైన డెలివరీ నిర్ధారణతో నమ్మకమైన నిర్ణీత సమయంలో డాక్యుమెంట్ డెలివరీని వినియోగదారులకు అందుబాటులోకి తెస్తుంది.
ఆవిష్కరణలు, సామర్థ్యం, వినియోగదారులకు ప్రాధాన్యత పట్ల తపాలా శాఖకు ఉన్న నిబద్ధతను ఈ ప్రీమియం సేవల ప్రారంభం ప్రతిబింబిస్తుంది. ఈ నూతన సేవల ద్వారా ప్రీమియం ఎక్స్‌ప్రెస్ డెలివరీ విభాగంలో తపాలా శాఖ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ముఖ్యమైన మెట్రోపాలిటన్ నగరాల్లో అత్యవసర డెలివరీలకు నమ్మకమైన, భద్రతతో కూడిన, నిర్ణీత సమయానికి వస్తువులను చేరవేస్తుంది. దేశవ్యాప్తంగా వ్యాపార సంస్థలకు, పౌరులకు మద్దతునిచ్చే విశ్వసనీయమైన జాతీయ రవాణా భాగస్వామిగా తపాలా శాఖ పాత్రను మరింత బలోపేతం చేస్తుంది.
మరిన్ని వివరాలకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి:
https://www.indiapost.gov.in/speedpost/locateus
(రిలీజ్ ఐడి: 2241675)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9