హోం మంత్రిత్వ శాఖ
పద్మ అవార్డులు-2027 నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
నాడు పోస్టు చేయడమైనది:
15 MAR 2026 5:04PM by PIB Hyderabad
2027 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించనున్న 'పద్మ అవార్డులు-2027' కోసం నామినేషన్లు, సిఫార్సుల ప్రక్రియ 2026 మార్చి 15న ప్రారంభమైంది. పద్మ అవార్డుల నామినేషన్లకు 2026 జూలై 31 చివరి తేదీ. ఈ నామినేషన్లు లేదా సిఫార్సులను కేవలం 'రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్' (https://awards.gov.in ) ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది.
మన దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీలు ఒక భాగం. 1954లో ప్రారంభమైన ఈ అవార్డులను ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, శాస్త్ర సాంకేతికత- ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ సర్వీస్, వ్యాపారం, పరిశ్రమలు మొదలైన అన్ని రంగాలలో విశిష్ట, అసాధారణమైన విజయాలు, సేవలను గుర్తించి ఈ పురస్కారాలను అందజేస్తారు. జాతి, వృత్తి, పదవి లేదా లింగ వివక్ష లేకుండా వ్యక్తులందరూ ఈ అవార్డులకు అర్హులు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారితో సహా ప్రభుత్వ ఉద్యోగులు ఈ అవార్డులకు అర్హులు కారు. కానీ డాక్టర్లు, శాస్త్రవేత్తలకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంటుంది.
పద్మ అవార్డులను ప్రజాదరణ చూరగొన్న అవార్డులగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాబట్టి ప్రజలందరూ నామినేషన్లను లేదా ఇతరుల పేర్లను సిఫార్సు చేయాల్సిందిగా కేంద్రం కోరుతోంది. స్వీయ నామినేషన్లను సమర్పించే అవకాశం కూడా ఉంది. మహిళలు, సమాజంలోని బలహీన వర్గాలు, ఎస్సీ - ఎస్టీ వర్గాలు, దివ్యాంగులు, నిస్వార్థంగా సమాజ సేవ చేస్తున్న వారిలో నిజమైన ప్రతిభావంతులు, అత్యున్నత లక్ష్యాలను సాధించిన వారిని గుర్తించి వారిని ఈ అవార్డుల కోసం ప్రతిపాదించేందుకు ప్రయత్నించాలని ప్రభుత్వం తెలియజేసింది.
నామినేషన్లు లేదా సిఫార్సులు పైన పేర్కొన్న పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ఫార్మట్ ప్రకారం అన్ని సంబంధిత వివరాలను కలిగి ఉండాలి. ఒక రంగం లేదా విభాగంలో ఒక వ్యక్తి సాధించిన విశిష్ట, అసాధారణమైన విజయాలను లేదా వారు అందించిన సేవలను స్పష్టంగా తెలియజేయాలి.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లోని (https://mha.gov.in) ‘అవార్డ్స్ అండ్ మెడల్స్’ విభాగం, పద్మ అవార్డుల పోర్టల్‌లో (https://padmaawards.gov.in) అందుబాటులో ఉన్నాయి. ఈ అవార్డులకు సంబంధించిన నియమ నిబంధనలు ఈ లింక్‌లో https://padmaawards.gov.in/AboutAwards.aspx చూడవచ్చు.
***
(రిలీజ్ ఐడి: 2240424)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Tamil
,
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam