లోక్‌సభ సచివాలయం
azadi ka amrit mahotsav

విధానపరమైన చర్చలకు, ఆవిష్కరణలకు, అంతర్జాతీయ సహకారానికి కీలక వేదికగా ఎదుగుతున్న ఎన్‌ఎక్స్‌టీ 2026 సమ్మేళనం: లోక్‌సభ స్పీకర్


140 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలకు, వైవిధ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత పార్లమెంటు.. ఇక్కడ విభిన్న దృక్పథాల మధ్య జరిగే చర్చలు, సంభాషణల ద్వారా విధానాల రూపకల్పన: లోక్‌సభ స్పీకర్

ప్రభుత్వ పాలనలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని గణనీయంగా బలోపేతం చేసిన సాంకేతికత ఆధారిత పాలన, ప్రత్యక్ష నగదు బదిలీ విధానాలు, డిజిటల్ వేదికలు: లోక్‌సభ స్పీకర్

లోక్‌సభ స్పీకర్ తో ఎన్‌ఎక్స్‌టీ 2026 సమ్మేళనానికి విచ్చేసిన విదేశీ పార్లమెంటేరియన్లు, ప్రతినిధుల భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 13 MAR 2026 6:09PM by PIB Hyderabad

న్యూఢిల్లీలో జరిగిన ఎన్‌ఎక్స్‌టీ సమావేశం 2026కు హాజరైన 30కి పైగా దేశాల పార్లమెంటేరియన్లు, పారిశ్రామికవేత్తలు, మేధావులతో కూడిన ప్రతినిధి బృందం నేడు పార్లమెంట్ భవనంలో లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లాను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా శ్రీ బిర్లా మాట్లాడుతూ.. వివిధ ప్రజాస్వామ్య దేశాల ప్రజాప్రతినిధులకు, ఇతర ప్రముఖులకు పార్లమెంటు భవనంలో ఆతిథ్యం ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ పార్లమెంటరీ చర్చల ప్రాముఖ్యతను ఆయన వివరించారు.

విధానపరమైన చర్చలు, ఆవిష్కరణలు, అంతర్జాతీయ సహకారానికి ముఖ్యమైన వేదికగా అభివృద్ధి చెందుతున్న ఎన్‌ఎక్స్‌టీ 2026 సమావేశ కార్యక్రమానికి నాయకత్వం వహించినందుకు రాజ్యసభ ఎంపీ శ్రీ కార్తికేయ శర్మను శ్రీ బిర్లా అభినందించారు. సమకాలీన ప్రపంచ సవాళ్లు, అవకాశాలపై చర్చించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్లమెంటేరియన్లను, విధాన రూపకర్తలను, మేధావులను ఈ సదస్సు ఒకచోటకు చేర్చిందని శ్రీ బిర్లా పేర్కొన్నారు.

దేశ ప్రజాస్వామ్య వారసత్వాన్ని వివరిస్తూ.. చర్చలు, ఏకాభిప్రాయం, భాగస్వామ్య నిర్ణయానికున్న సుదీర్ఘ సంప్రదాయం కారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ను తరచుగా ‘‘ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు’’ గా పిలుస్తారు. 140 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు, వైవిధ్యానికి భారత పార్లమెంటు ప్రాతినిధ్యం వహిస్తుందని శ్రీ బిర్లా తెలిపారు. ఇక్కడి విధానాలు విభిన్న దృక్పథాల మధ్య చర్చలు, సంభాషణల ద్వారా రూపొందుతాయని అన్నారు.

గడిచిన దశాబ్ద కాలంలో సమ్మిళిత అభివృద్ధి, డిజిటల్ ఆవిష్కరణలు, సుపరిపాలనలో భారత్‌ సాధించిన పురోగతిని శ్రీ బిర్లా ప్రస్తావించారు. సాంకేతికత ఆధారిత పాలన, ప్రత్యక్ష నగదు బదిలీ విధానాలు, డిజిటల్ వేదికల ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని గణనీయంగా బలోపేతం చేశాయని ఆయన పేర్కొన్నారు.

డిజిటల్ సంసద్, మెరుగైన పార్లమెంటరీ పరిశోధన వ్యవస్థలు, ఆధునిక సమాచార వేదికల వంటి కార్యక్రమాల ద్వారా పార్లమెంటరీ ప్రక్రియలో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంపొందించడానికి కొత్త సాంకేతికతలు, కృత్రిమ మేధ వినియోగంపై భారత్‌ దృష్టి సారించిందని శ్రీ ఓం బిర్లా నొక్కి తెలిపారు.

పార్లమెంటరీ దౌత్యం ప్రాముఖ్యతను వివరిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాసనసభలతో సంబంధాలను, సహకారాన్ని బలోపేతం చేయడానికి భారత పార్లమెంటు ఇటీవల 60కి పైగా పార్లమెంటరీ మైత్రీ బృందాలను ఏర్పాటు చేసిందని స్పీకర్ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడానికి ఎంపీల మధ్య జ్ఞానం, ఆలోచనలు, అనుభవాల మార్పిడి మరింత పెరగాలని శ్రీ బిర్లా ప్రోత్సహించారు. ఎన్‌ఎక్స్‌టీ సమావేశం 2026లో జరిగే చర్చలు దేశాల మధ్య ప్రజాస్వామ్య సహకారాన్ని, పరస్పర అవగాహనను, భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

పాలన, సాంకేతికత, అంతర్జాతీయ సహకారంలో ఎదురవుతున్న సవాళ్లు, అవకాశాలపై చర్చించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్లమెంటేరియన్లను, విధానకర్తలను, పారిశ్రామికవేత్తలను, మేధావులను న్యూఢిల్లీలో జరుగుతున్న ఎన్‌ఎక్స్‌టీ సమ్మేళనం 2026 ఒకే వేదికపైకి చేర్చింది.

 

***


(రిలీజ్ ఐడి: 2240060) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , हिन्दी , Tamil