భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పార్లమెంటు ప్రశ్న: సముద్రగర్భంలో గనుల తవ్వకాలు

నాడు పోస్టు చేయడమైనది: 12 MAR 2026 12:41PM by PIB Hyderabad

డీప్ ఓషన్ మిషన్‌కు సంబంధించి ఆరు ప్రధాన అంశాలున్నాయి. (1) సముద్రగర్భ గనుల తవ్వకం,

మానవసహిత జలాంతర్గాములు, సముద్రంలో పనిచేసే రోబోటిక్స్ కోసం సాంకేతిక అభివృద్ధి (2) సముద్ర వాతావరణ మార్పులకు సంబంధించి సలహా సేవల అభివృద్ధి (3) సముద్రగర్భ జీవవైవిధ్య అన్వేషణకు, పరిరక్షణకు సాంకేతిక ఆవిష్కరణలు (4) సముద్రగర్భ సర్వే, అన్వేషణ (5) సముద్రం నుంచి ఇంధనం, మంచినీటి వెలికితీత (6) సముద్ర జీవశాస్త్రం కోసం అధునాతన మెరైన్ స్టేషన్ ఏర్పాటు. డీప్ ఓషన్ మిషన్ ద్వారా సాధించిన కీలక విజయాలు ఇలా ఉన్నాయి:

·  ముగ్గురు అక్వానాట్స్‌ను 6,000 మీటర్ల లోతుకు తీసుకెళ్లగలిగే సామర్థ్యంతో భారతదేశ తొలి మానవసహిత జలాంతర్గామి  ‘మత్స్య-6000’ రూపకల్పన, ఇంజినీరింగ్ వ్యవస్థకు సంబంధించిన పనులు పూర్తయ్యాయి. దీని ఉప వ్యవస్థలు కార్యరూపం దాల్చటంతో, జనవరి-ఫిబ్రవరి 2025లో చెన్నై సమీపంలోని కట్టుపల్లిలో ఎల్ అండ్ టీ హార్బర్‌లో నీటి అడుగున పరీక్షల నిర్వహణ విజయవంతమైంది. ‘మత్స్య-6000’ అభివృద్ధి బాధ్యతను చేపట్టిన చెన్నైలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) శాస్త్రవేత్తలు ఆగస్టు 2025లో ఫ్రాన్స్ నాటిల్ జలాంతర్గామి ద్వారా పైలట్ అనుభవం పొందారు.

·  భారత ఉపఖండంలోని తీర ప్రాంతాల్లో 100 ఏళ్లకోసారి సంభవించే సముద్ర మట్టాల మార్పుల అంచనా పూర్తయింది. దీనికనుగుణంగా తీరప్రాంత ముంపును సూచించే మాప్స్‌ను సిద్ధం చేశారు. సముద్ర అంశాలపై పరిశీలను మరింత బలోపేతం చేసేందుకు, హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఐఎన్‌సీఓఐఎస్) అరేబియా మహాసముద్రం (67°ఈ), బంగాళాఖాతం (89°ఈ) లోని నిర్ణీత మార్గాల్లో 11 గ్లైడర్ మిషన్లను విజయవంతంగా పూర్తి చేశారు. హిందూ మహాసముద్రంలో 60 డైరెక్షనల్ వేవ్ స్పెక్ట్రా బారోమెట్రిక్ డ్రిఫ్టర్లను, 92 ఫిజికల్, బయోజియోకెమికల్ ఆర్గో ఫ్లోట్లను ప్రవేశపెట్టారు.

·   భారతదేశ ఈఈజడ్ పరిధిలోని సముద్రపు జలాలు, అవక్షేప నమూనాల నుంచి దాదాపు 1,845 రకాల సముద్రగర్భ సూక్ష్మజీవులను వేరు చేశారు. హిందూ మహాసముద్రంలో గతంలో ఎన్నడూ కనుగొనని కొన్ని అరుదైన సూక్ష్మజీవులను ఇప్పుడు గుర్తించారు. కొచ్చిలోని సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాలజీ (సీఎంఎల్ఆర్ఈ) సంస్థ వారు లక్షద్వీప్, అండమాన్, నికోబార్ ప్రాంతాల్లో జీవవైవిధ్యానికి నిలయాలైన 25 సీమౌంట్లను సర్వే చేశారు. ఈ పరిశోధనలో సముద్రగర్భంలోని 195 రకాల జీవజాతులను నమోదు చేశారు.

·   గోవాలోని నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ రీసెర్చ్ (ఎన్‌సీపీఏఆర్) హిందూ మహాసముద్రం అట్టడుగున జరిపిన ‘అటానమస్ అండర్ వాటర్ వెహికల్ (ఏయూవీ)‘ సర్వేల ద్వారా రెండు క్రియాశీలక, రెండు నిద్రాణ జల ఉష్ణ ప్రాంతాలను గుర్తించారు.

·   మిషన్ కార్యకలాపాలకు అనుబంధంగా సామర్థ్య పెంపుదల కోసం జాతీయ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు ఈ మిషన్ ద్వారా మొత్తం 144 ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టులు మంజూరయ్యాయి.

 

సముద్రగర్భం నుంచి లోహపు ముక్కలను సేకరించి, పంపింగ్‌కి వీలుగా చూర్ణం చేసే అన్వేషణాత్మక గనుల తవ్వక వ్యవస్థను అభివృద్ధి చేశారు. దీనికి సంబంధించి 2021లో హిందూ మహాసముద్రం మధ్యలో 5,270 మీటర్ల లోతులో మొబిలిటీ, సిస్టమ్-పవరింగ్‌పై పరీక్షలు నిర్వహించారు. అలాగే 2024లో అండమాన్ సముద్ర తీర ప్రాంతాల్లో అన్వేషణాత్మక మైనింగ్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేశారు. సముద్రపు డేటాను ఎప్పటికప్పుడు సులభంగా పొందటానికి, ఆధారాలతో కూడిన సముద్ర పాలనా నిర్వహణను ప్రోత్సహించటం, వాతావరణ అంచనా సముద్ర వనరుల ట్రాకింగ్, విపత్తు ముందస్తు హెచ్చరికల కోసం ఎస్ఏహెచ్ఏవీ పోర్టల్‌ను 2025లో ప్రారంభించారు.

అంతర్జాతీయ జలాల్లో వాణిజ్యపరమైన మైనింగ్.. పాలీమెటాలిక్ మైనింగ్ కోసం ఉద్దేశించిన అంతర్జాతీయ సీబెడ్ అథారిటీ (ఐఎస్ఏ) ఎక్స్‌ప్లాయిటేషన్ కోడ్ ప్రకారం జరగాలి. ప్రస్తుతం ఈ నియమావళి అమల్లోకి రాలేదు. ఎక్స్‌ప్లాయిటేషన్ కోడ్ సముద్రగర్భంలోని ఖనిజ నిక్షేపాలను పర్యావరణానికి హాని కలగకుండా సుస్థిర పద్ధతుల్లో సేకరించటానికి అవసరమైన పర్యావరణ ప్రమాణాలను, పర్యవేక్షణ వ్యవస్థలను వివరిస్తుంది. దీనికి అవసరమైన పెట్టుబడి, వేదిక, ఇతర వ్యవస్థలు ప్రస్తుత కాలపు సాంకేతికత, ఉమ్మడి అభివృద్ధి ప్రయత్నాలు, తెలిసిన పర్యావరణ నిబంధనల ఆధారంగా రూపొందించారు.

భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ సహాయమంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ 12 మార్చి 2026న రాజ్యసభకు ఈ సమాచారాన్ని అందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2239233) సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil