భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
పార్లమెంటులో ప్రశ్న: మిషన్ మౌసమ్ అమలు తీరు
నాడు పోస్టు చేయడమైనది:
11 MAR 2026 12:21PM by PIB Hyderabad
‘మిషన్ మౌసమ్’లో భాగంగా, భూ విజ్ఞాన శాస్త్రాల శాఖకు చెందిన ఉన్నత పనితీరును ప్రదర్శించే కంప్యూటింగ్ (హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్.. హెచ్పీసీ) వ్యవస్థల్ని ప్రధానమంత్రి 2024 సెప్టెంబరు 26న పుణేలోని ఇండియన్ ట్రాపికల్ మెటియరాలజీ ఇనిస్టిట్యూట్‌తో పాటు నోయిడాలోని నేషనల్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ సెంటర్‌లో ప్రారంభించారు. ‘‘అర్క’’ , ‘‘అరుణిక’’ అనే పేర్లను పెట్టిన ఈ వ్యవస్థల్లో అర్క కంప్యూటింగ్ సామర్థ్యం 11.77 పెటాఫ్లాప్స్ ఉండగా, అరుణికకు 8.24 పెటాఫ్లాప్స్ సామర్థ్యాన్ని జోడించారు. దీనికి అదనంగా, 1.9 పెటాఫ్లాప్స్ సామర్థ్యంతో కూడిన కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) వ్యవస్థల్నీ వీటికి జత పరిచారు. దీంతో మంత్రిత్వ శాఖ మొత్తం కంప్యూటింగ్ సామర్థ్యం 21.91 పెటాఫ్లాప్స్‌కు వృద్ధి చెందింది. గణనకు సంబంధించిన మౌలిక సదుపాయాల హంగును ఈ మేరకు పెంపొందింప చేయడంతో, వాతావరణం శీతోష్ణస్థితి అంశాల్లో ముందస్తు అంచనాను వెలువరించడానికి అధునాతనమైన అధిక స్పష్టతతో కూడిన నమూనాలను అభివృద్ధిపరిచేందుకూ, ఏఐతో పాటు ఎంఎల్ సేవల్ని వినియోగించుకొనేందుకూ మార్గం సుగమమైంది.
ఉష్ణమండల తుపానులకు సంబంధించి ముందస్తు అంచనాలు వేయడంలో 2016-2020తో పోలిస్తే 2021-2025 మధ్య కాలంలో కచ్చితత్వాన్ని భారత వాతావరణ అధ్యయన విభాగం (ఐఎండీ) గణనీయంగా పెంచుకోగలిగింది. 48 గంటల వరకూ వర్తించే ముందస్తు అంచనా కాలానికి తుపాను కదలిక మార్గాన్ని అంచనా వేయడంలో పొరబాట్లు 5 నుంచి 10 శాతం మేరకు తగ్గాయి. ఇంతకన్నా ఎక్కువ ముందస్తు సూచన కాలాల విషయంలో ఈ లోపాలు 20 నుంచి 25 శాతం మేర తగ్గాయి. తీవ్రతను ముందుగా అంచనా వేయడంలో చెప్పుకోదగ్గ మెరుగుదల చోటుచేసుకొంది. 72 గంటల వరకూ ముందస్తు అంచనాను వేసే విషయంలో 33 నుంచి 35 శాతం వృద్ధి నమోదైంది. 96 గంటల ముందస్తు హెచ్చరిక కాలంలో పొరపాట్లు 10 శాతం వరకూ తగ్గిపోయాయి. అన్నిటి కన్న ఎక్కువ మెరుగుదల తుపాను తీరాన్ని దాటే వేళ విషయంలో భవిష్యవాణిని వెలువరించడంలో నమోదైంది.. ఇది తీర ప్రాంతాల నుంచి ప్రజలను అనువైన కాలంలోపే తరలించడానికి ఎంతో కీలకంగా మారింది. 24 నుంచి 48 గంటల ముందస్తు అంచనా కాలానికి తుపాను తీరాన్ని దాటే స్థలాన్ని చెప్పే విషయంలో పొరపాట్లు 35 నుంచి 45 శాతం వరకు తగ్గాయి. ఇతర ముందస్తు హెచ్చరిక కాలాల విషయంలో పొరపాట్లు దాదాపు 20 శాతం వరకూ తగ్గాయి. 2016-2020 మధ్య కాలంలో తుపాను సగటున 24 గంటలలో తీరాన్ని దాటే స్థలం విషయంలో పొరపాటు స్థాయి 31.9 కి.మీ. నుంచి తగ్గిపోయి, 2021-2025 మధ్య 19 కి.మీ.కి పరిమితమైంది. ఇక 48 గంటలలో తుపాను తీరం దాటొచ్చని చెప్పే విషయంలో పొరపాటు స్థాయి 61.5 కి.మీ. నుంచి 34.4 కి.మీ.కి పరిమితమైంది. వడగాడ్పుల ముందస్తు అంచనాను ప్రస్తుతం 4 రోజులు ముందు లేదా 5 రోజుల ముందు జారీ చేస్తున్నారు. దీంతో రాష్ట్రాల, జిల్లాల అధికార యంత్రాంగం వడగాడ్పుల సమస్యను ఎదుర్కొనేందుకు తగిన పథక రచనను ప్రభావవంతంగా అమలు చేయడానికి వీలవుతోంది. ఈ మెరుగుదల ఫలితంగా విశేష సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు సమకూరాయి. వాటిలో.. తుపానుల వేళల్లో సకాలంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వర్షరుతు కాలంలో చక్కని వ్యావసాయిక ప్రణాళికలను అమలుపరచడం, విపత్తులు విరుచుకుపడే కన్న ముందే తగిన సన్నద్ధతతో ఉండగలగడం వంటివి ఉన్నాయి. ఫలితంగా ప్రాణ నష్టాన్నీ, ఆస్తి నష్టాన్నీ తగ్గించడం, అనేక రంగాల్లో ఆర్థిక కార్యకలాపాల్లో అంతరాయాలు తలెత్తకుండా నివారించడం సాధ్యమవుతోంది.
వాతావరణంతో పాటు శీతోష్ణ స్థితి సంబంధిత సేవల అందజేతను మెరుగుపరచడం వల్ల కలుగుతున్న ప్రయోజనాలను భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎస్) నిర్ణీత కాల ప్రాతిపదికన అంచనా వేస్తుంటుంది. దీని కోసం.. వ్యవసాయం, వైపరీత్యాల వేళ తీసుకొనే చర్యలు, ఈ సమాచారాన్ని వినియోగించుకొంటున్న విమానయానం, మత్స్య పరిశ్రమ, ఇంధనం వంటి రంగాల ప్రతిస్పందనల్నీ, ఫోర్కాస్ట్ స్కిల్ స్కోర్లనీ సరిచూడటం, అంచనా ఎంతవరకు ఫలించాయో సమీక్షించడం వంటి మార్గాల్ని మంత్రిత్వ శాఖ అనుసరిస్తుంది. ఈ సమీక్షలు ఐఎండీ, ఇండియన్ ట్రాపికల్ మెటియరాలజీ ఇనిస్టిట్యూట్, మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ నేషనల్ సెంటర్ వంటి సంస్థలు అమలుచేసిన మెరుగైన ముందస్తు అంచనా సామర్థ్యాలు ప్రజలకు ఎంత కీలక ఫలితాలను అందించాయో తెలియజేస్తుంటాయి. ఈ కీలక ఫలితాల్లో.. తుపానులు, వడగాడ్పులు, భారీ వర్షపాతం తదితర తీవ్ర వాతావరణ ఘటనల విషయంలో చక్కని ముందస్తు హెచ్చరికలు చేయడం వంటివి భాగంగా ఉన్నాయి. మెరుగుపరిచిన సమాచారం ప్రజలను సకాలంలో ప్రమాదకర ప్రదేశాల నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలించ గలగడానికీ, విపత్తు వేళ తీసుకోవాల్సిన సన్నాహక చర్యల్ని ఇదివరకటి కన్నా మరింత పెంచడానికీ, వ్యవసాయానికి సంబంధించి ఉత్తమ నిర్ణయాల్ని తీసుకోవడానికీ, ప్రాణనష్టాన్నీ, ఆస్తినష్టాన్నీ తగ్గించడానికీ తోడ్పడింది.
దీనికి అదనంగా, మిషన్ మౌసమ్‌ను బహుళ దశలతో కూడిన కార్యక్రమంగా తీర్చిదిద్దారు. మొదటి దశలో వచ్చిన ఫలితాలను ఆధారంగా చేసుకొని తరువాతి దశల్లోనూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించడంతో పాటు మరింత విస్తరించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఈ మిషన్ ద్వారా అమలుచేసే అనేక కార్యక్రమాలు సంక్లిష్ట వాతావరణ ప్రక్రియలను మనం అర్థం చేసుకొనే పద్ధతి మెరుగుపడుతుందని ఆశిస్తున్నారు. ప్రతిపాదించిన రెండో దశలో జాతీయ వాతావరణ పరిశీలక నెట్‌వర్కును మరింత పటిష్ఠపరచడంపై, ఉన్నత పనితీరును ప్రదర్శించే కంప్యూటింగ్ సాయంతో వాతావరణ, శీతోష్ణ స్థితుల గురించి అధిక స్పష్టతను కలిగివుండే నమూనాల్ని అందించడంపై, ముందస్తు అంచనాలు వెలువరించే వ్యవస్థల్లో కృత్రిమ మేధనీ, మెషీన్ లర్నింగ్ సాంకేతికతనీ ఏకీకరించడంపై దృష్టి కేంద్రీకరిస్తారు.
ఈ సమాచారాన్ని భూ విజ్ఞాన శాస్త్రాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు లోక్‌సభలో తెలియజేశారు.
***
(రిలీజ్ ఐడి: 2238280)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5