మంత్రిమండలి
‘జల్ జీవన్ మిషన్’ (జేజేఎం)ను 2028 డిసెంబరు దాకా పొడిగించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం
· జేజేఎం 2.0 కింద గ్రామీణ తాగునీటి సరఫరా రంగంలో నిర్మాణాత్మక సంస్కరణల అమలుపై నిశిత దృష్టి
· అంచనాల పెంపు సహా పునర్వ్యవస్థీకృత అమలు లక్ష్యంగా పథకం వ్యవధి పొడిగింపు
నాడు పోస్టు చేయడమైనది:
10 MAR 2026 4:12PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఇవాళ జల్ జీవన్ మిషన్ (జేజేఎం) అమలు వ్యవధిని పొడిగించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు మౌలిపాయాల కల్పన నుంచి సేవా ప్రదానం దాకా పథకాన్ని పునర్వ్యవస్థీకరించడంపై జలశక్తి మంత్రిత్వశాఖ పంపిన ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. తదనుగుణంగా తాగునీటి వ్యవస్థల నిర్వహణ, గ్రామీణ ప్రాంతాలకు పైపులైన్ల ద్వారా సజావుగా తాగునీటి సరఫరా కోసం ఈ పథకం మద్దతిస్తుంది.
ఈ క్రమంలో నిర్మాణాత్మక సంస్కరణలపై దృష్టి సారిస్తూ ‘జేజేఎం’ పునర్వ్యవస్థీకరణ నిమిత్తం పథకం వ్యయాన్ని రూ.8.69 లక్షల కోట్లకు పెంచడానికి మంత్రిమండలి తీర్మానించింది. ఇందులో కేంద్ర సహాయం కింద ప్రభుత్వ వాటా 2019-20లో 2.08 లక్షల కోట్లు కాగా, రూ.1.51 లక్షల కోట్ల మేర పెంచి రూ.3.59 లక్షల కోట్లు కేటాయించేందుకు ఆమోదించింది.
ఈ లక్ష్యంతో “సుజలాం భారత్” పేరిట ఏకీకృత జాతీయ డిజిటల్ చట్రాన్ని ఏర్పాటు చేస్తారు. దీనికింద ప్రతి గ్రామానికీ ప్రత్యేకమైన ‘సుజల్ గావ్/సర్వీస్ ఏరియా’ గుర్తింపునిస్తారు. జల వనరుల నుంచి ఇంటి కొళాయిదాకా తాగునీటి సరఫరా వ్యవస్థను ఇది సంపూర్ణంగా డిజిటలీకరిస్తుంది. అలాగే పారదర్శకత, జవాబుదారీతనం దిశగా “జల్ అర్పణ్” ద్వారా పథకాల ప్రారంభం, అధికారిక అప్పగింతలో గ్రామ పంచాయతీలు, ‘వీడబ్ల్యూఎస్‌సీ’లకు భాగస్వామ్యం ఉంటుంది.
దీనికింద పనులు పూర్తి కావడాన్ని గ్రామ పంచాయతీ ధ్రువీకరించాలి. అటుపైన గ్రామీణ స్థాయిలో తగుమేర కార్యకలాపాలు-నిర్వహణ యంత్రాంగాల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ధారించాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక మాత్రమే “ఇంటింటికీ నీరు” (హర్ ఘర్ జల్) లక్ష్యం సాధించినట్లు ప్రకటించుకోవాలి. జల వనరుల సుస్థిరత, కార్యాచరణ సామర్థ్యంలో సామాజిక యాజమాన్యం, భాగస్వామ్యాలను కీలకమైనవిగా ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు వార్షిక, సామాజిక నేతృత్వ నిర్వహణ-సమీక్ష కార్యక్రమం కింద ‘జలోత్సవ్’ను ప్రోత్సహిస్తుంది. తద్వారా స్థానిక సాంస్కృతిక నైతికత ఏకీకృతం కావడంతోపాటు సురక్షిత తాగునీటి సరఫరా భవిష్యత్తుపై సమష్టి బాధ్యత బలోపేతం అవుతుంది.
దేశవ్యాప్తంగా 2019లో 3.23 కోట్ల (17శాతం) గ్రామీణ కుటుంబాలకు కొళాయి నీటి సరఫరా సౌకర్యం ఉండగా, ప్రస్తుతం అదనంగా 12.56 కోట్లకు పైగా కుటుంబాలకు ‘జేజేఎం’ కింద కొళాయి కనెక్షన్లు ఇచ్చారు. మొత్తం మీద రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు గుర్తించిన 19.36 కోట్ల గ్రామీణ కుటుంబాలలో దాదాపు 15.80 కోట్ల (81.61 శాతం) గృహాలకు కొళాయి కనెక్షన్లు ఉన్నాయి.
‘జేజేఎం’ అమలు ప్రభావంతో ఒనగూడిన ప్రయోజనాలు అది సాధించిన భౌతిక విజయాలను అధిగమించినట్లు ప్రసిద్ధ జాతీయ-అంతర్జాతీయ సంస్థలు/వ్యక్తుల అంచనాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు దేశంలోని 9 కోట్ల మంది మహిళలకు సుదూరం నుంచి నీరు మోసుకొచ్చే భారం తప్పిందని పేర్కొన్నాయి. తద్వారా సమయం ఆదా కావడంతో వారు ఇతరత్రా ఆర్థిక కార్యకలాపాలలో ఎక్కువగా పాల్గొనే వీలు కలిగినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన అధ్యయన నివేదిక వెల్లడించింది. అలాగే రోజుకు 5.5 కోట్ల గంటల సమయం ఆదా సహా 4,00,000 దాకా డయేరియా మరణాల నివారణ సాధ్యమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తెలిపింది. మరోవైపు 14 మిలియన్ల వైకల్య సర్దుబాటు జీవిత కాలం ఆదాతో మహిళలకు శ్రమ తగ్గిందని పేర్కొంది. ఇక నోబెల్ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ మైఖేల్ క్రెమెర్ అంచనాల ప్రకారం- ఐదేళ్లలోపు బాలల మరణాలు 30 శాతం తగ్గాయి. ఆ మేరకు ఏటా 1,36,000 మంది ప్రాణాలకు రక్షణ లభించింది. ఐఐఎం-బెంగళూరుతోపాటు అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనాల మేరకు- 59.9 లక్షల ప్రత్యక్ష, 2.2 కోట్ల పరోక్ష వ్యక్తి-వార్షిక సంభావ్య ఉపాధి లభించింది. అంటే- ‘జేజేఎం’ ద్వారా గ్రామీణ జీవనోపాధి బలోపేతమైనట్లు అంచనాలు పేర్కొంటున్నాయి. ఈ పథకం కింద మహిళలు, బాలికలు ప్రధాన లబ్ధిదారులు కాగా, వారికి శ్రమ తగ్గడమే కాకుండా ఆరోగ్యం, పరిశుభ్రత మెరుగుపడటం సహా విద్యా సదుపాయం, ఆత్మగౌరవం ఇనుమడించాయి. ముఖ్యంగా జీవనోపాధి కార్యకలాపాలకు మరిన్ని అవకాశాలు అందివచ్చాయి.
దేశవ్యాప్తంగా 2028 డిసెంబరు నాటికి 19.36 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కొళాయి కనెక్షన్లు ఇవ్వడం ద్వారా అన్ని పంచాయతీలనూ ‘హర్ ఘర్ జల్’గా ధ్రువీకరించడంలో ‘జేజేఎం 2.0’ దోహదం చేస్తుంది. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో ప్రత్యేక అవగాహన ఒప్పందాల ద్వారా సమయపాలన, పథక స్థిరత్వం, పౌర-కేంద్రక నీటి సరఫరా సేవల ప్రదానం తదితరాలకు భరోసా లభిస్తుంది. నిర్మాణాత్మక సంస్కరణలతో మౌలిక సదుపాయాల కేంద్రక విధానం నుంచి పౌరహిత ప్రయోజనాధారిత సేవా ప్రదాన విధానంగా ‘జేజేఎం 2.0’ రూపొందుతుంది. అంటే- 24 గంటల గ్రామీణ తాగునీటి సరఫరా హామీతో వికసిత భారత్ @2047 దార్శనికతకు ఈ పథకం తోడ్పడుతుంది.
జల్ జీవన్ మిషన్ 2.0 కింద గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థల దీర్ఘకాలిక విజయం దిశగా “ఏకోన్ముఖ ప్రభుత్వం” విధానాన్ని కేంద్రం అనుసరిస్తోంది. ఈ మేరకు నీటి సరఫరా మౌలిక సదుపాయాల కార్యకలాపాలు-నిర్వహణను క్రమబద్ధీకరించేందుకు వివిధ కేంద్ర శాఖల మధ్య వ్యూహాత్మక సమన్వయంపై దృష్టి సారించింది. ఈ సంయుక్త కృషి ద్వారా జల వనరుల సుస్థిరత, గ్రామీణ ప్రజానీకానికి విశ్వసనీయ నీటి సరఫరాపై లక్ష్య నిర్దేశం చేసుకుంది.
***
(రిలీజ్ ఐడి: 2237948)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam