మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా కర్తవ్యపథ్‌లో ‘శక్తి వాక్ #షీ లీడ్స్ భారత్’ నిర్వహణ


#షీ లీడ్స్ భారత్ అనే ఇతివృత్తం కింద నడకలో పాల్గొన్న వివిధ రంగాలకు చెందిన మహిళలు

ఒక ప్రగతిశీల, సమగ్రమైన భారత్‌ను తీర్చిదిద్దడంలో మహిళలు పోషిస్తున్న కీలక పాత్రను చాటిచెప్పిన నడక

ఇండియా గేట్ నుంచి విజయ్ చౌక్ వరకు పాదయాత్ర చేసిన 200కి పైగా

కేంద్ర మంత్రిత్వ శాఖలు, వివిధ రంగాలకు చెందిన 3,000 మందికి పైగా మహిళలు

మహిళల ఐక్యత, సాధికారతకు చిహ్నంగా నిలిచిన ఈ నడక

నారీ శక్తి స్ఫూర్తి, ప్రగతిశీల భారత్‌ను తీర్చిదిద్దడంలో మహిళలు పోషిస్తున్న కీలక పాత్రను తెలియజేస్తూ

పాదయాత్రను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను 'శక్తి వాక్'తో ప్రారంభించడం

దేశవ్యాప్తంగా ఒక శక్తిమంతమైన సందేశాన్ని పంపుతుంది: శ్రీమతి అన్నపూర్ణా దేవి

నారీ శక్తే భారత్‌కు ‘భాగ్యవిధాత’: ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్త

నాడు పోస్టు చేయడమైనది: 08 MAR 2026 7:28PM by PIB Hyderabad

అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2026ను పురస్కరించుకొని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ రోజు ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ‘శక్తి వాక్ #షీ లీడ్స్ భారత్’ను ఘనంగా నిర్వహించింది. ఈ ‘శక్తి వాక్’ నారీ శక్తి స్ఫూర్తిని చాటిచెప్పడమే కాకుండా ఒక ప్రగతిశీల, సమగ్రమైన భారత్‌ను తీర్చిదిద్దడంలో మహిళలు పోషిస్తున్న కీలక పాత్రను తెలియజేసింది. 

కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి, సహాయ మంత్రి శ్రీమతి సావిత్రి ఠాకూర్ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ పాదయాత్రలో ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్త, కేంద్ర ఆరోగ్య - కుటుంబ సంక్షేమ, రసాయనాలు - ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియా పటేల్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) అధ్యక్షురాలు శ్రీమతి విజయ కిషోర్ రహాత్కర్, మహిళా - శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అనిల్ మాలిక్ కూడా పాల్గొన్నారు. వీరితో పాటు వివిధ రంగాలకు చెందిన మహిళా అధికారులు, సిబ్బంది, క్షేత్రస్థాయి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. జీవితంలోని అన్ని రంగాలలో మహిళలు సాధించిన విజయాలను, వారి నాయకత్వాన్ని గౌరవిస్తుంది. లింగ సమానత్వం, భద్రత, గౌరవం, సాధికారత పట్ల మనందరి సామూహిక నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తుంది.

దేశభక్తి స్ఫూర్తిని నింపుతూ ఈ కార్యక్రమం ఇండియా గేట్ వద్ద ఉన్న కర్తవ్య పథ్‌లో 'వందేమాతరం' జాతీయ గీతాలాపనతో ప్రారంభమైంది. ప్రముఖులు, సందర్శకులు పెద్ద సంఖ్యలో ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి అధికారికంగా ‘శక్తి వాక్’ను ప్రారంభించారు. ఈ నడక మహిళా సాధికారత పట్ల మనకున్న బలం, ఐక్యత, సామూహిక నిబద్ధతను తెలియజేసింది. ఈ కార్యక్రమ ఉద్దేశం, స్ఫూర్తిని చాటిచెబుతూ పాల్గొన్నవారందరూ ఎంతో ఉత్సాహంగా ఈ నడకలో భాగస్వాములయ్యారు.

పాదయాత్ర కర్తవ్య పథ్ వెంట ఇండియా గేట్ నుంచి విజయ్ చౌక్ వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర సాగింది. ఈ మార్గమంతటా మహిళల కోసం ప్రభుత్వం చేపట్టిన కీలక పథకాలు, కార్యక్రమాలతో పాటు వివిధ రంగాల్లో మహిళలు సాధించిన అద్భుత విజయాలను ప్రదర్శించే స్టాళ్లను ఏర్పాటు చేశారు. భారత్‌లోని మహిళల గొప్ప సాంస్కృతిక వైవిధ్యం, శక్తిని చాటిచెప్పే ఉత్సాహభరితమైన ప్రదర్శనలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కర్ణాటకకు చెందిన డొల్లు కునిత.. కేరళకు చెందిన కలరిపయట్టు, శృంగారిమేళం.. అస్సాంకు చెందిన రణచండి, రాజస్థాన్‌కు చెందిన ఘూమర్ వంటి కళారూపాలు ఆయా రాష్ట్రాల విశిష్ట సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించాయి. 

సుమారు 200 మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలకు చెందిన 3,000 మందికి పైగా మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొన్న వారిలో సాయుధ దళాలు, పోలీస్, ఆరోగ్య రంగం, మీడియా, క్రీడలు, విద్య, పారిశుద్ధ్యం, విమానయానం, పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు ఉన్నారు. వీరితో పాటు ఏఎన్ఎం సర్వీస్ ప్రొవైడర్లు, భారత్ టాక్సీ సారథి మహిళా డ్రైవర్లు, ఉపాధ్యాయులు, రైలు పైలట్లు, 'మై భారత్' వాలంటీర్లు, క్షేత్రస్థాయి కార్యకర్తలు, మహిళా పారిశ్రామికవేత్తలు ఈ నడకలో భాగస్వాములయ్యారు.

ఈ భాగస్వామ్యం కర్తవ్య పథ్‌ను ‘నారీ శక్తి’కి సంబంధించిన ఉత్సాహభరితమైన వేడుకగా మార్చింది. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ నిర్మించాలనే దార్శనికత వైపు మహిళలందరూ కలిసి సాగిస్తున్న సామూహిక ప్రయాణాన్ని ఈ నడక తెలియజేసింది. 

సమావేశాన్ని ఉద్దేశించి కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి మాట్లాడుతూ.. “అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఈ శక్తి వాక్‌తో ప్రారంభించడం ద్వారా దేశవ్యాప్తంగా ఒక శక్తిమంతమైన సందేశం వెళ్తుంది" అని అన్నారు. 

నేడు మహిళలు ప్రతి రంగంలోనూ తమ సత్తా చాటుతున్నారని ఆమె అన్నారు. భారత్‌లోని మహిళలు, కుమార్తెలు, సోదరీమణుల శక్తిని గుర్తించి భారత అభివృద్ధి ప్రయాణాన్ని వారు ముందుండి నడిపించేలా సాధికారత వైపు నడిపించడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిరంతరం చేస్తున్న కృషినీ ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. 

ప్రధానమంత్రి దార్శనికతను ఉటంకిస్తూ ఆమె ఇలా వ్యాఖ్యానించారు:

“ఇదే సమయం, ఇదే సరైన సమయం.. ఇది భారతదేశపు అమూల్యమైన సమయం.”

పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నవారిని ఉద్దేశించి ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్త మాట్లాడుతూ.. “నారీ శక్తే భారతదేశానికి భాగ్యవిధాత” అని అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత మహిళలు దేశాభివృద్ధికి నిరంతరం తమ వంతు సహకారాన్ని అందిస్తారని, దేశ ప్రగతికి కొత్త దిశానిర్దేశం చేస్తారని ఆమె పేర్కొన్నారు.

కర్తవ్య పథ్‌లో జరిగిన ఈ 'శక్తి వాక్'.. మహిళలు కేవలం తమ వ్యక్తిగత ఎదుగుదల కోసమే కాకుండా సమాజం, దేశాభిభివృద్ధిలో కూడా భాగస్వాములవ్వాలనే వారి సామూహిక సంకల్పానికి ప్రతీక అని ఆమె పేర్కొన్నారు.

విజయ్ చౌక్ వద్ద ప్రముఖులు, మహిళలు ‘శక్తి వాక్ #SheLeadsBharat’ అనే సందేశంతో మూడు వర్ణాల బుడగలను గాలిలోకి వదలడంతో ఈ కార్యక్రమం ముగిసింది. ఇది భారతీయ మహిళల పెరుగుతున్న ఆకాంక్షలు, వారి అపరిమితమైన సామర్థ్యానికి ప్రతీకగా నిలిచింది.

 

***


(రిలీజ్ ఐడి: 2236883) సందర్శకుల సూచీ సంఖ్య : : 84
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Malayalam , Urdu , हिन्दी , Gujarati , Odia