ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘చిప్స్ టు స్టార్టప్స్ (C2S)’లో విశేష పురోగతి సాధించిన భారత్... 85,000 మంది సెమీకండక్టర్ ఇంజినీర్లకు శిక్షణ


· అస్సాం నుంచి గుజరాత్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. దేశవ్యాప్తంగా 315 విద్యాసంస్థల్లో సెమీకండక్టర్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, ప్యాకేజింగ్, టెస్టింగ్‌లో ఆచరణాత్మక అనుభవాన్ని పొందుతున్న విద్యార్థులు

· ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కింద పథకాన్ని 500 విద్యా సంస్థలకు విస్తరించే యోచన

నాడు పోస్టు చేయడమైనది: 07 MAR 2026 1:39PM by PIB Hyderabad

ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)లో భాగమైన ‘చిప్స్ టు స్టార్టప్స్ (C2S)’ కార్యక్రమం కింద.. శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, శ్రామిక శక్తి సన్నద్ధతకు భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. సెమీకండక్టర్ డిజైన్ రంగంలో పదేళ్లలో 85,000 మంది ఇంజినీర్లకు శిక్షణ ఇవ్వాలన్న లక్ష్యాన్ని నాలుగేళ్లలోనే చేరుకుని.. భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని కేంద్ర రైల్వే, సమాచార - ప్రసార, ఎలక్ట్రానిక్స్ - ఐటీ శాఖల మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ తెలిపారు.

దేశవ్యాప్తంగా 315 విద్యా సంస్థలలో సైనోప్సిస్, కేడెన్స్, సీమెన్స్, రెనెసాస్, ఆన్సిస్, ఏఎండీ వంటి ప్రముఖ సంస్థల సహకారంతో ప్రపంచ స్థాయి ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ సాధనాలను అందుబాటులోకి తెచ్చినట్లు శ్రీ అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ సాధనాల సహాయంతో విద్యార్థులు సెమీకండక్టర్ చిప్‌ల రూపకల్పనలో ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతున్నారు. ఈ చిప్‌లను మొహాలీలోని సెమీకండక్టర్ లాబొరేటరీలో తయారు చేసి, పరీక్షిస్తున్నారనీ.. దీనివల్ల డిజైన్ నుంచి ఫ్యాబ్రికేషన్, ప్యాకేజింగ్, టెస్టింగ్ వరకు పూర్తి ప్రక్రియలో విద్యార్థులకు ఆచరణాత్మక అనుభవం లభిస్తోందని ఆయన వివరించారు. నేడు ప్రపంచంలో అతిపెద్ద ఓపెన్ యాక్సెస్ ఈడీఏ ప్రోగ్రాంగా ఈ కార్యక్రమం నిలిచిందని తెలిపారు. చిప్ డిజైన్ శిక్షణ కోసం ఇప్పటివరకు 1.85 కోట్ల గంటలకు పైగా ఈ ఈడీఏ సాధనాల వినియోగం నమోదైందని, ఇది ఇంకా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

అస్సాం నుంచి గుజరాత్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా వివిధ విద్యాసంస్థల విద్యార్థులు నేడు సెమీకండక్టర్ డిజైన్ రంగంలో క్రియాశీలంగా భాగస్వాములవుతున్నారని ఆయన తెలిపారు. భారత సాంకేతిక సమర్థతా, స్వావలంబన దిశగా ఇదొక కీలక మైలురాయి అని శ్రీ అశ్వినీ వైష్ణవ్ వ్యాఖ్యానించారు.

ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ పరిశ్రమకు ఉన్న అవసరాలను వివరిస్తూ.. ప్రస్తుతం ఈ పరిశ్రమ విలువ 800–900 బిలియన్ డాలర్లుగా ఉండగా, భవిష్యత్తులో 2 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని శ్రీ అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో దాదాపు 20 లక్షల మంది నిపుణుల అవసరం ఏర్పడుతుందనీ, ఇది భారతీయ యువతకు అపారమైన ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని ఆయన వెల్లడించారు.

ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కింద ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతమున్న 315 విద్యాసంస్థల నుంచి 500 సంస్థలకు విస్తరించనున్నట్లు ఆయన ప్రకటించారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలో సెమీకండక్టర్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, ప్యాకేజింగ్, టెస్టింగ్ రంగాలలో శిక్షణ పొందిన శక్తిమంతులైన నిపుణులను నిరంతరాయంగా తీర్చిదిద్దడానికి ఇది దోహదపడుతుందన్నారు.

సెమీకండక్టర్ రంగంలో బలమైన, స్వావలంబన కలిగిన వ్యవస్థను నిర్మించేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ అశ్వినీ వైష్ణవ్ పునరుద్ఘాటించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కింద ప్రతిభావంతులను సిద్ధం చేయడం, మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమల భాగస్వామ్యం ద్వారా భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు.


(రిలీజ్ ఐడి: 2236632) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , English , Urdu , Marathi , हिन्दी , Gujarati