రాష్ట్రపతి సచివాలయం
9వ అంతర్జాతీయ సంతాల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత రాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
07 MAR 2026 2:33PM by PIB Hyderabad
నేడు (మార్చి 7, 2026) పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో జరిగిన 9వ అంతర్జాతీయ సంతాల్ సమావేశాన్ని భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ.. దాదాపు 240 సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు తిల్కా మాఝీ దోపిడీకి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేయడం సంతాల్ సమాజానికి గర్వకారణమని అన్నారు. ఆయన తిరుగుబాటు చేసిన దాదాపు 60 సంవత్సరాల తర్వాత 1855లో సిదో-కన్హు, చాంద్-భైరవ్ అనే వీర సోదరులు, అలాగే పూలో-ఝానో అనే వీర సోదరీలతో కలిసి ‘సంతాల్ హుల్’ అనే గొప్ప తిరుగుబాటుకు నాయకత్వం వహించారని ఆమె గుర్తుచేశారు.

సంతాలీ సమాజ చరిత్రలో 2003వ సంవత్సరం ఎప్పటికీ గుర్తుండి పోతుందని రాష్ట్రపతి అన్నారు. ఆ సంవత్సరంలోనే సంతాలీ భాషను భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చారని తెలిపారు. గత ఏడాది మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా.. ఒల్ చికి లిపిలో సంతాలీ భాషలో రాసిన భారత రాజ్యాంగాన్ని విడుదల చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
1925లో పండిట్ రఘునాథ్ ముర్ము ఒల్ చికి లిపిని కనిపెట్టారని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఇటీవల మనం ఈ ఆవిష్కరణల శతాబ్ది ఉత్సవాలను జరుపుకున్నామని, ఆయన కృషి వల్ల సంతాలీ భాష మాట్లాడేవారు తమ భావాలను వ్యక్తీకరించడానికి ఒక కొత్త మార్గాన్ని అందకున్నారని తెలిపారు. ఆయన ‘బిదు చందన్’, ‘ఖేర్వాల్ వీర్’, ‘దలేగే ధన్’, ‘సిదో కన్హు-సంతాల్ హుల్’ వంటి నాటకాలను కూడా రచించినట్లు చెప్పారు. ఆయన సంతాలీ సమాజంలో సాహిత్యం, సామాజిక చైతన్యమనే వెలుగును నింపారని అన్నారు. సంతాలీ సమాజ సభ్యులు ఇతర భాషలను, లిపిలను నేర్చుకోవాలని, అయితే తమ సొంత భాషతో ఎల్లప్పుడూ అనుసంధానమై ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.

గిరిజన ప్రజలు తమ జానపద సంగీతం, నృత్యాలు, సంప్రదాయాలను శతాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్నాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రకృతి పట్ల వారు చూపే సున్నితత్వాన్ని తరతరాలుగా వారసత్వంగా అందిస్తున్నారని ఆమె అన్నారు. ప్రకృతి పరిరక్షణ పాఠాన్ని తప్పనిసరిగా భావి తరాలకు అందించాలని చెప్పారు. జానపద సంప్రదాయాలను, పర్యావరణాన్ని కాపాడుకుంటూనే, మన గిరిజన సమాజాలు ఆధునిక అభివృద్ధిని అందిపుచ్చుకోవాలని, పురోగతి పథంలో ముందుకు సాగాలని స్పష్టం చేశారు. సంతాల్ సమాజంతో సహా అన్ని గిరిజన తెగల సభ్యులు, అభివృద్ధి, ప్రకృతి మధ్య సమతుల్యతను కాపాడటంలో ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుత తరుణంలో విద్య, ఆరోగ్యం, ఆర్థిక సాధికారతపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి అన్నారు. గిరిజన యువత విద్య, నైపుణ్యాభివృద్ధి ద్వారా పురోగతి సాధించాలని కోరారు. అయితే ఈ ప్రయత్నాలన్నింటిలోనూ వారు తమ మూలాలను మర్చిపోకూడదని హితవు పలికారు. మన భాష, సంస్కృతిని కాపాడుకోవాలని, విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని కొనసాగించేలా సంకల్పించాలని పిలుపునిచ్చారు. ఇది శక్తిమంతమైన సమాజాన్ని, బలమైన భారత్ నిర్మించడంలో మనకు సహాయపడుతుందని ఆమె పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2236619)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16