యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచ మొట్టమొదటి ఫ్రాంచైజీ ఆధారిత "సైక్లింగ్ లీగ్ ఆఫ్ ఇండియా" లోగోను ఆవిష్కరించిన కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా


భారత యువతను సైక్లింగ్‌ను ఒక క్రీడగా స్వీకరించేలా ఈ సైక్లింగ్ లీగ్ ప్రోత్సహిస్తుంది: కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా

ప్రపంచ మొట్టమొదటి ప్రొఫెషనల్ ఫ్రాంచైజీ ఆధారిత రోడ్ సైక్లింగ్ లీగ్‌ను నిర్వహించనున్న భారత్ అనేక క్రీడల్లో ప్రొఫెషనల్ లీగ్ సంస్కృతి వేగవంతమైన విస్తరణను భారత్ చూస్తోంది: డాక్టర్ మన్సుఖ్ మాండవియా

నాడు పోస్టు చేయడమైనది: 05 MAR 2026 5:13PM by PIB Hyderabad

ప్రపంచంలోనే మొదటి ఫ్రాంచైజీ ఆధారిత రోడ్ సైక్లింగ్ లీగ్‌గా నిలవనున్న భారత వినూత్న క్రీడా ఈవెంట్ "సైక్లింగ్ లీగ్ ఆఫ్ ఇండియా" లోగోను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈరోజు ఆవిష్కరించారు.

సైక్లింగ్ లీగ్ ఆఫ్ ఇండియా  దేశంలో సైక్లింగ్ రంగానికి  ఒక కొత్త మార్పు దశగా అభివర్ణిస్తూ, ఈ ప్రారంభం దేశీయ సైక్లింగ్‌లో ఒక నిర్ణయాత్మక ఘట్టమని డాక్టర్ మన్సుఖ్ మాండవియా పేర్కొన్నారు.

“ఈ ప్రారంభం భారతీయ క్రీడల్లో ఒక కీలక మలుపు. ప్రపంచ మొట్టమొదటి ఫ్రాంచైజీ ఆధారిత రోడ్ సైక్లింగ్ లీగ్‌ను ప్రవేశపెట్టడం ద్వారా, మనం కేవలం పోటీలను నిర్వహించడమే కాకుండా ప్రతిభను ప్రోత్సహించే, ప్రపంచ దృష్టిని ఆకర్షించే, దృఢమైన, ఉత్తేజభరితమైన భారతదేశ దార్శనికతకు అనుగుణంగా ఉండే ఒక క్రీడా నైపుణ్య వ్యవస్థను సృష్టిస్తున్నాం” అని ఆయన అన్నారు.

దేశంలో ఇటీవల జరిగిన ప్రొఫెషనల్ సైక్లింగ్ పోటీలు అందించిన ఉత్తేజంతో ఈ కార్యక్రమం ముందుకు సాగుతుందని, ఇది దేశంలోని యువతను సైక్లింగ్‌ను ఒక క్రీడగా స్వీకరించేలా ప్రోత్సహిస్తుందని మంత్రి పేర్కొన్నారు.

"పుణె గ్రాండ్ టూర్, అహ్మదాబాద్‌లో జరిగే ఈ లీగ్ లేదా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతి ఆదివారం  జరిగే సండే ఆన్ సైకిల్ వంటివన్నీ రాబోయే రోజుల్లో భారతదేశంలో సైక్లింగ్‌ను ఒక క్రీడగా నిలబెడతాయి" అని ఆయన పేర్కొన్నారు.

రాబోయే లీగ్‌లో ఎనిమిది నగరాలు లేదా ప్రాంతాల ఆధారిత ఫ్రాంచైజీలు ఉంటాయి. ఒక్కో జట్టులో పదిమంది సైక్లిస్టులు ఉంటారు.

జట్టు కూర్పులో ఇద్దరు అంతర్జాతీయ రైడర్లు ఉంటారు. వీరు ప్రపంచస్థాయి నైపుణ్యాన్ని, పోటీతత్వాన్ని తెస్తారు. అలాగే అభివృద్ధి చెందుతున్న భారతీయ ప్రతిభను ప్రోత్సహించడానికి, క్రీడ దీర్ఘకాలిక మనుగడ కోసం ఇద్దరు జూనియర్ సైక్లిస్టులు కూడా ఉంటారు. 

గ్రాండ్ ఫినాలేకు ముందు మూడు క్రమబద్ధమైన దశల్లో ఈ పోటీలు జరుగుతాయి. ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగించేలా క్రైటీరియం రేసులు, టీమ్ టైమ్ ట్రయల్స్, మాస్ స్టార్ట్ ఈవెంట్‌ల వంటి విభిన్న ఫార్మాట్లతో పోటీ వ్యూహాత్మకంగా ఉండేలా రూపొందించారు.

ఇటీవలి కాలంలో భారతదేశంలో ప్రొఫెషనల్ సైక్లింగ్ సాధించిన అద్భుతమైన పునరుజ్జీవనం మీద ఆధారపడి ఈ ఈవెంట్ కు రూపకల్పన చేశారు. 

అత్యంత ప్రముఖమైన విజయాలలో పూణె గ్రాండ్ టూర్ ఒకటి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద యూసీఐ  2.2 స్టేజ్ రేస్‌గా అవతరించింది. ఇది 25 లక్షల మంది ప్రేక్షకులను ఆకర్షించింది. రూ. 14.4 కోట్ల ప్రజా సంబంధ విలువను సృష్టించింది. యూనియన్ సైక్లిస్ట్ ఇంటర్నేషనల్ ప్రశంసలను కూడా పొందింది.

నైపుణ్య స్థాయిలో ఎదుగుదలతో పాటు, సైక్లింగ్‌ను ఒక ప్రజా ఉద్యమంగా ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా కృషి జరుగుతోంది.

డాక్టర్ మాండవియా డిసెంబర్ 2024లో ప్రారంభించిన 'ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్' ఒక శక్తిమంతమైన ప్రజా ఉద్యమంగా మారింది. ఇప్పటివరకు జరిగిన 63కు పైగా ఎడిషన్లలో దేశవ్యాప్తంగా 2.5 లక్షలకు పైగా ప్రాంతాలలో 25 లక్షలమందికి పైగా పౌరులు పాల్గొన్నారు.

కేవలం ఐదు ప్రాంతాలు, 500 మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమం, ఇప్పుడు ప్రతి ఆదివారం 10,000 కంటే ఎక్కువ ప్రాంతాలకు విస్తరించింది. 10 లక్షల మందికి పైగా పౌరులు క్రమం తప్పకుండా పాల్గొంటూ, సైక్లింగ్‌ను ఒక సంస్కృతిగా, కాలుష్యానికి ప్రజల నేతృత్వంలోని పరిష్కారంగా మార్చారు. ఈ ఉద్యమానికి  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రోత్సాహం కూడా లభించింది. ఇది ఫిట్‌నెస్‌ను పెంపొందించే, ఊబకాయంపై పోరాడే దేశవ్యాప్త ప్రయత్నంగా మారడానికి తోడ్పడింది.

గుజరాత్‌లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ సైక్లోథాన్, హెచ్‌సిఎల్ సైక్లోథాన్‌, దేశవ్యాప్తంగా నిర్వహించిన అనేక ఇతర సైక్లోథాన్‌లు సైక్లింగ్ క్రీడ పట్ల ప్రజాదరణను, భాగస్వామ్యాన్ని పెంచడంలో గణనీయంగా దోహదపడ్డాయి.  

న్యూ హొరైజాన్ అలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ రవ్‌నీత్ గిల్ ఈ చొరవ వెనుక ఉన్న దీర్ఘకాల దృక్పథాన్ని వివరించారు. 

 

“ప్రపంచంలోనే తొలి ఫ్రాంచైజీ ఆధారిత రోడ్ సైక్లింగ్ లీగ్ మా విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రొఫెషనల్‌గా,  వాణిజ్యపరంగా నిలకడగా ఉండే క్రీడా వ్యవస్థను నిర్మించాలనే మా లక్ష్యాన్ని ఇది చూపిస్తుంది. అంతర్జాతీయ ప్రతిభకు  వర్ధమాన  ప్రతిభ మేళవింపుతో ఎనిమిది చురుకైన ఫ్రాంచైజీలతో పాటు ఉత్కంఠతో కూడిన,  నిష్పక్షపాతమైన రేస్ ఫార్మాట్లతో ఈ లీగ్ భారతదేశంలో సైక్లింగ్‌కు చిరస్మరణీయమైన వారసత్వాన్ని సృష్టిస్తుంది” అని ఆయన తెలిపారు. 

కొత్త లీగ్ భారతదేశ సైక్లింగ్ వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేస్తుందని, అథ్లెట్లకు అవకాశాలను విస్తరిస్తుందని ప్రపంచ క్రీడా రంగంలో దేశం ఉనికిని మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. అలాగే ఇది కొత్త తరం ఈ క్రీడను స్వీకరించేలా ప్రోత్సహిస్తుంది.

భారతదేశం ప్రస్తుతం అనేక క్రీడల్లో ప్రొఫెషనల్ లీగ్ సంస్కృతి వేగంగా విస్తరించడాన్ని చూస్తోంది. 

త్వరలో ప్రారంభం కానున్న పలు కొత్త లీగ్‌లతో, 2026లో భారతదేశంలో ప్రొఫెషనల్ లీగ్‌లు మరింత విస్తరిస్తాయని భావిస్తున్నారు. ఇది దేశంలోని క్రీడా మౌలిక సదుపాయాలను, పోటీ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2235787) సందర్శకుల సూచీ సంఖ్య : : 90
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil