బొగ్గు మంత్రిత్వ శాఖ
వెలికితీతకు మించి సాగడం: నైవేలిలో గనుల మూసివేత, పునర్వినియోగంపై దేశంలోనే తొలి జాతీయస్థాయి వర్క్‌షాప్
నాడు పోస్టు చేయడమైనది:
05 MAR 2026 4:12PM by PIB Hyderabad
బొగ్గు మంత్రిత్వ శాఖ, ఎన్ఎల్ సీ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో గనుల మూసివేత, పునర్వినియోగంపై ఫిబ్రవరి 23, 24 తేదీల్లో నిర్వహించిన జాతీయ స్థాయి వర్క్‌షాప్ విజయవంతంగా జరిగింది. తమిళనాడులోని నైవేలిలో రెండు రోజులపాటు సాగిన ఈ వర్క్‌షాప్.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ప్రారంభించారు.
బొగ్గు మంత్రిత్వ శాఖ, ఎన్ఎల్ సీ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23, 24 తేదీల్లో గనుల మూసివేత, పునర్వినియోగంపై జాతీయ స్థాయి కార్యశాలను విజయవంతంగా నిర్వహించారు.తమిళనాడులోని నైవేలిలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ప్రారంభించిన ఈ కార్యశాల రెండు రోజులపాటు కొనసాగింది. క్రమబద్ధమైన గనుల మూసివేత ప్రణాళిక, గనుల తవ్వకం అనంతర భూమి పునర్వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించిన దేశపు తొలి జాతీయ కార్యక్రమంగా నిలిచింది. ఈ సదస్సులో బొగ్గు శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్, అదనపు కార్యదర్శులు శ్రీమతి రూపిందర్ బ్రార్, శ్రీ సనోజ్ కుమార్ ఝా, కోల్ కంట్రోలర్ శ్రీ సజీష్ కుమార్ ఎన్, బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
మూసివేతకు సిద్ధంగా ఉన్న గనుల నుంచి 147 మంది నోడల్ అధికారులు, బొగ్గు రంగంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు గనుల తవ్వకాల సంస్థలు, నియంత్రణ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, విధాన నిర్ణేతలు, ఆర్థిక సంస్థలు, విద్యావేత్తలు, ద్వైపాక్షిక, బహుళ పక్ష సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం మీద 500 మందికి పైగా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. గనుల మూసివేతను కేవలం ఒక నిబంధనగా కాకుండా, దీర్ఘకాలిక ప్రాంతీయ పునరుత్పత్తికి ఉత్ప్రేరకంగా మార్చాలనే ఉమ్మడి నిబద్ధతను ఈ వైవిధ్యభరితమైన భాగస్వామ్యం చాటిచెప్పింది.
ఈ కార్యశాలలో ప్రధాన ఆకర్షణగా తొమ్మిది సమావేశాలు జరిగాయి. ఇందులో ప్రభుత్వం, పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు, అభివృద్ధి సంస్థలు, అంతర్జాతీయ సంస్థలకు చెందిన 29 మంది ప్రముఖ వక్తలు ప్రసంగించారు. గనుల మూసివేత, తవ్వకం అనంతర మార్పులపై తమకున్న అవగాహనను, క్షేత్రస్థాయి అనుభవాలను నిపుణులు నిపుణులు
పంచుకున్నారు. స్థిరమైన, సమాజ ప్రయోజనాలే లక్ష్యంగా గనుల మూసివేత వ్యూహాలను రూపొందించడంలో, అమలు చేయడంలో నోడల్ అధికారులు, ఇతర పాల్గొనేవారికి విలువైన మార్గదర్శకత్వాన్ని అందించారు.
ఈ సదస్సులో గనుల తవ్వకం అనంతర భూములను వినియోగించుకోవడానికి గల వివిధ మార్గాలపై లోతుగా చర్చించారు. వాటిలో పునరుత్పాదక వ్యవసాయం, అటవీ వ్యవసాయం, పశువుల ఆధారిత జీవనోపాధి, గనుల గుంతల్లో చేపల పెంపకం, పునరుత్పాదక ఇంధన వనరుల అనుసంధానం, పర్యాటక రంగం అభివృద్ధి, సాంస్కృతిక సంస్థలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు, విధానపరమైన ఏకీకరణ, అంతర్జాతీయ ఆర్థిక సాయం పొందే మార్గాలు, క్రమబద్ధమైన గనుల మూసివేతలో అంతర్జాతీయంగా పాటిస్తున్న ఉత్తమ పద్ధతులు వంటివి ముఖ్యమైనవి. మైనింగ్ తర్వాత ఆ ప్రాంతాల్లో విభిన్నమైన, స్థిరమైన జీవనోపాధి అవకాశాలను కల్పించడంపై ఈ చర్చలు దృష్టి సారించాయి. గనులు మూసివేసిన ప్రాంతాల్లో సమగ్ర, సుస్థిర అభివృద్ధిని పెంపొందించడంలో స్థానిక ప్రజల భాగస్వామ్యం, ఉపాధి కల్పన కీలక పాత్ర పోషిస్తాయని వక్తలు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. గనుల మూసివేతను మైనింగ్ కార్యకలాపాలకు ముగింపుగా భావించకూడదని, మైనింగ్ ప్రాంతాల్లోని ప్రజల సామాజిక, ఆర్థికాభివృద్ధికి లభించే ఒక కొత్త అవకాశంగా చూడాలని పేర్కొన్నారు. శాస్త్రీయ పద్ధతుల్లో భూమిని పునరుద్ధరించడం,, పర్యావరణ పరిరక్షణ, గనుల మూసివేత నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో స్థిరమైన జీవనోపాధి అవకాశాలను సృష్టించడం వంటి అంశాల ప్రాముఖ్యతను ఆయన వివరించారు.
వర్క్‌షాప్‌లో భాగంగా ఎన్ఎల్ సీ ఇండియా తిరిగి పొందిన, బొగ్గు వెలికితీత పూర్తయిన ప్రాంతాలను ప్రతినిధులు సందర్శించారు. అక్కడ తవ్వకం ముగిసిన భూములను బోటింగ్, జలవనరుల పునరుద్ధరణ, పక్షుల ఆవాస కేంద్రాలతో కూడిన పర్యాటక ప్రాంతాలుగా మార్చారు. శాస్త్రీయ పునరుద్ధరణ, సమగ్ర ప్రణాళిక ద్వారా పాడైపోయిన గనుల ప్రాంతాలను కూడా జీవవైవిధ్యంతో కూడిన, ఆర్థికంగా ఉత్పాదకత గల భూములుగా ఎలా మార్చవచ్చో ఈ క్షేత్ర పర్యటన ప్రత్యక్షంగా నిరూపించింది.
దేశంలో గనుల మూసివేత ప్రక్రియను క్రమబద్ధంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించే దిశగా ఒక కీలక ప్రస్థానంగా ఈ వర్క్‌షాప్ నిలిచింది. ఇప్పటివరకు 25 గనులను శాస్త్రీయ పద్ధతిలో విజయవంతంగా మూసివేసినట్లు వెల్లడించారు.
ఈ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ పలు కీలక చర్యలను అమలు చేస్తోంది. అందులో భాగంగా గనుల మూసివేత కోసం కేటాయించిన ఎస్క్రో నిధులలో 25 శాతాన్ని తప్పనిసరిగా ప్రజల అభివృద్ధి కోసం కేటాయించాలని నిర్ణయించింది. దీనిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడానికి మంత్రిత్వ శాఖ ఇప్పటికే రీక్లెయిమ్ (రీచ్ అవుట్, ఎన్విజన్, కో-క్రియేట్, లోకలైజ్, యాక్ట్, ఇంటిగ్రేట్, మెయింటెయిన్) నిబంధనలను విడుదల చేసింది. ఇది మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఒక సమగ్ర మార్గదర్శిగా పనిచేస్తుంది.
తవ్వకాలు ముగిసిన భూముల స్థిరమైన పునర్వినియోగాన్ని ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ గతంలోనే లైవ్స్ (ఎల్ఐవీఈఎస్) విధానాలను ప్రవేశపెట్టింది. దీనితో పాటు సువికల్ప్ అనే ఇంటరాక్టివ్ ఆన్‌లైన్ పరికరాన్ని కూడా అభివృద్ధి చేసింది. ఇది గనుల నిర్వాహకులు ఆయా భూములకు తగిన పునర్వినియోగ ప్రాజెక్టులను గుర్తించడానికి, అమలు చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది.
ఈ వర్క్‌షాప్ ద్వారా లభించిన ఉత్సాహాన్ని కొనసాగిస్తూ బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని బొగ్గు నియంత్రణ సంస్థ వరుసగా జాతీయ వెబినార్లను నిర్వహించాలని యోచిస్తోంది. జీవనోపాధి వైవిధ్యీకరణ, పునరుత్పాదక ఇంధన వనరుల అనుసంధానం, అంతర్జాతీయ ఆర్థిక సహాయం పొందడం, పర్యాటక ఆధారిత అభివృద్ధి, నైపుణ్య వ్యవస్థలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ పద్ధతుల అవలంబన వంటి నిర్దిష్ట అంశాలపై ఈ వెబినార్లు దృష్టి సారించనున్నాయి. దీనివల్ల భాగస్వామ్య పక్షాల మధ్య నిరంతర అవగాహన, సామర్థ్య పెంపుదల సాధ్యమవుతుంది.
ఈ వర్క్‌షాప్ విజయవంతంగా నిర్వహించడం ద్వారా.. గనుల మూసివేత కేవలం ఒక చట్టబద్ధమైన నిబంధన మాత్రమే కాదని, అది పర్యావరణ పునరుద్ధరణకు, సమగ్ర అభివృద్ధికి, దేశంలోని మైనింగ్ ప్రాంతాల్లో దీర్ఘకాలిక సామాజిక-ఆర్థిక స్థిరత్వం సాధించడానికి ఒక మార్పు తీసుకువచ్చే అవకాశంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టమైంది.
****
(రిలీజ్ ఐడి: 2235695)
సందర్శకుల సూచీ సంఖ్య : : 67