భారత ప్రభుత్వ ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్-కుండ్లీ (ఎన్ఐఎఫ్ టీఈఎం-కే).. ఆహార శాస్త్రాల రంగంలో విద్య, పరిశోధన సహకారాన్ని పెంపొందించుకోవడానికి కెనడాలోని సస్కటూన్‌కు చెందిన సస్కట్చేవాన్ విశ్వవిద్యాలయంతో ఒక చారిత్రాత్మక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఈ ఒప్పందంపై ఎన్ఐఎఫ్ టీఈఎం-కే డైరెక్టర్ డాక్టర్ హరీందర్ సింగ్ ఒబెరాయ్, సస్కట్చేవాన్ విశ్వవిద్యాలయం ఉప అధ్యక్షుడు (పరిశోధన) డాక్టర్ బల్జీత్ సింగ్ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమం సస్కట్చెవాన్ ప్రీమియర్ శ్రీ స్కాట్ మో, మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ అవినాష్ జోషి, జాయింట్ సెక్రటరీ శ్రీ డి. ప్రవీణ్ సమక్షంలో జరిగింది. వ్యవసాయ, ఆహార రంగంలో భారత్, కెనడా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంలో ఈ భాగస్వామ్యం ఎంత కీలకమో ఈ ఉన్నత స్థాయి ప్రతినిధుల భాగస్వామ్యం ప్రతిబింబిస్తోంది. నిన్న ఇరు దేశాల ప్రధాన మంత్రుల సమక్షంలో ప్రకటించిన పప్పుధాన్యాల ప్రోటీన్ కేంద్రం ఏర్పాటు నేపథ్యంలో ఈ ఒప్పందానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి భారత్ తరపున ఎన్ఐఎఫ్ టీఈఎం-కే, కెనడా తరపున యూనివర్సిటీ ఆఫ్ సాస్కట్చెవాన్ నాయకత్వం వహించనున్నాయి.
అయిదేళ్ల కాలపరిమితి కలిగిన ఈ ఒప్పందం ప్రకారం ఫుడ్ సైన్స్, సాంకేతికత, ఫుడ్ సిస్టమ్స్ ఎకనామిక్స్, వ్యాపార అభివృద్ధి రంగాలలో ఆన్‌లైన్ బోధన శిక్షణ కార్యక్రమాలను రూపొందించడంలో ఇరు సంస్థలు పరస్పరం సహకరించుకుంటాయి. ఈ భాగస్వామ్యం అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థుల కోసం స్వల్పకాలిక మార్పిడి కార్యక్రమాలను కూడా ప్రోత్సహిస్తుంది. దీనివల్ల ఆహార శుద్ది, ఆవిష్కరణలలో అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులపై అవగాహన పెరగడమే కాకుండా పరస్పర అభ్యాసానికి అవకాశం కలుగుతుంది.
ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టులు, సహకార సేకరణ ప్రతిపాదనలు, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీలో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల రూపకల్పనలో ఈ ఒప్పందం సహకరిస్తుంది. భారతీయ ఆహార శుద్ది రంగానికి ‘‘ఏకైక పరిష్కార వేదిక’’గా ఉన్న ఎన్ఐఎఫ్ టీఈఎం-కే నైపుణ్యాన్ని, వ్యవసాయ, ఆహార రంగంలో అంతర్జాతీయ పరిశోధనా సామర్థ్యం కలిగిన సస్కట్చేవాన్ విశ్వవిద్యాలయం బలాన్ని ఈ భాగస్వామ్యం అనుసంధానిస్తుంది. సంయుక్త సెమినార్లు, వర్క్‌షాప్‌లు, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా స్వల్పకాలిక కోర్సుల రూపకల్పన, ఉమ్మడి ప్రాజెక్టుల ప్రణాళికలు ఇందులో భాగంగా ఉంటాయి. ఇరు సంస్థలు పరస్పర ప్రయోజనం కలిగించే కార్యక్రమాలను గుర్తించి, స్పష్టమైన ఫలితాల కోసం నిర్దిష్ట ప్రాజెక్టుల ద్వారా ఈ ఒప్పందాన్ని పటిష్టంగా అమలు చేస్తాయి.
ఈ సందర్భంగా ఇరు సంస్థల అధికారులు మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్యం స్థిరమైన ఆహార వ్యవస్థల కోసం ఆవిష్కరణలు, సామర్థ్య పెంపుదల సాంకేతికతతో కూడిన పరిష్కారాలను వేగవంతం చేస్తుందని చెప్పారు. అత్యంత చైతన్యవంతమైన వ్యవసాయ, ఆహార వ్యవస్థల్లో ఉన్న ఈ రెండు ప్రముఖ సంస్థల నైపుణ్యాన్ని కలపడం ద్వారా ఆహార భద్రతను మెరుగుపరచడంలో, ఆహార ప్రాసెసింగ్ వ్యవస్థను బలోపేతం చేయడంలో, ఇరు దేశాలలో పరిశోధన ఆధారిత పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడంలో ఈ సహకారం గణనీయంగా దోహదపడుతుందని భావిస్తున్నారు.
ఈ అవగాహన ఒప్పందం అంతర్జాతీయ పరిధిని విస్తరించుకోవడానికి ఎన్ఐఎఫ్ టీఈఎం-కే చేస్తున్న నిరంతర ప్రయత్నాలలో కీలక మైలురాయిగా నిలుస్తుంది. అర్థవంతమైన అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా ఆహార సాంకేతికత, వ్యవస్థాపకత, నిర్వహణ రంగాల్లో భారత్ నాయకత్వాన్ని ఈ ఒప్పందం మరింత బలోపేతం చేస్తుంది.
***