కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
స్పెయిన్‌లోని బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్-2026.. భారత్ పెవిలియన్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతతో పాటు వసుధైవ కుటుంబకమ్ భావన నుంచి ప్రేరణను పొంది,
ఎండబ్ల్యూసీ-2026లో విశ్వసనీయ డిజిటల్ నాయకత్వాన్ని చాటుతున్న భారత్
బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్-2026లో భారత కార్యక్రమాలకు నేతృత్వం వహించిన కేంద్ర మంత్రి శ్రీ సింధియా
నాడు పోస్టు చేయడమైనది:
03 MAR 2026 10:20PM by PIB Hyderabad
స్పెయిన్‌లోని బార్సిలోనాలో నిర్వహిస్తున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ)-2026లో భారత్ పెవిలియనును కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా ఈ రోజు ప్రారంభించారు. ప్రపంచంలోని అగ్రగామి సాంకేతిక, టెలికమ్యూనికేషన్స్ వేదికల్లో ఎండబ్ల్యూసీ-2026 ఒకటి.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రసార మాధ్యమాల వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రపంచ దేశాలు ‘‘ఐక్యూ యుగం’’లో సంధాన రంగ భవిష్యత్తుపై చర్చిస్తున్న క్రమంలో, భారత్ ఇంటెలిజెన్స్, మౌలిక సదుపాయాల పరంగా ఒక నిర్దిష్ట మలుపు వద్ద నిలిచిందన్నారు. ఆ మలుపులో సంధానం.. సామర్థ్యంతో జతపడటమే కాక, నవకల్పన కూడా సమ్మిళితత్వంతో చేతులు కలుపుతోందని ఆయన వివరించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో భారత టెలికం రంగంలో మార్పు స్వదేశీ పరిశోధన, అభివృద్ది (ఆర్ అండ్ డీ), విశ్వసనీయ టెలికం అనుబంధ విస్తారిత వ్యవస్థలు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు, ప్రపంచ వేల్యూ చైన్లతో గాఢమైన ఏకీకరణలను ఆలంబనగా చేసుకుందని మంత్రి స్పష్టం చేశారు.
‘‘ఇవాళ, మనం బార్సిలోనాలో ఉన్న వేళ అందిస్తున్న సందేశం సుస్పష్టం.. భారత్ తన 140 కోట్ల మంది పౌరులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే నెట్‌వర్కును నిర్మించడం లేదు.. పూర్తి ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని విశ్వసనీయ డిజిటల్ వారధిని నిర్మిస్తోంది’’ అని కేంద్ర మంత్రి వివరించారు. ‘‘వసుధైవ కుటుంబకమ్ భావనతో ప్రేరణను పొందిన మేం.. సంధానం మానవ జాతికి సాధికారితను కల్పించాలనీ, భాగస్వామ్యాలను బలపరచాలని, ఉమ్మడి సమృద్ధిని సమకూర్చాలని నమ్ముతున్నాం’’ అని ఆయన అన్నారు.
ఈ సంవత్సరం ఏర్పాటైన భారత్ పెవిలియన్ వేల్యూ చైన్ లోని వివిధ దశలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 40కి పైగా భారతీయ టెలికం రంగ నూతన ఆవిష్కర్త సంస్థల్ని ఒక చోటుకు తీసుకువచ్చింది. ఈ నూతన ఆవిష్కర్త సంస్థలు 4జీ, 5జీలతో పాటు సరికొత్తగా తెర మీదకు వచ్చిన 6జీ సాంకేతికత, ఓపెన్ ఆర్ఏఎన్, ఆప్టికల్ శాటిలైట్ కమ్యూనికేషన్లు, సెమీకండక్టర్ డిజైన్, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత నెట్‌వర్క్ ఇంటెలిజెన్స్, సైబర్ భద్రత, కమ్యూనికేషన్ సాఫ్ట్‌వేర్, డిజిటల్ ప్లాట్‌ఫారాల వంటి రంగాల్లో పనిచేస్తున్నాయి. భారత టెలికం సామర్థ్యాలతో పాటు శరవేగంగా వృద్ధి చెందుతున్న నవకల్పన అనుబంధ విస్తారిత వ్యవస్థల పట్ల ప్రపంచంలో విశ్వాసం నిరంతరంగా బలపడుతుండడాన్ని ఈ విస్తారిత భాగస్వామ్యం ప్రతిబింబిస్తోంది.
పెవిలియనును సందర్శించిన కేంద్ర మంత్రి వేర్వేరు కంపెనీల స్టాళ్లను పరిశీలించారు. అనంత్ సిస్టమ్స్, ఎక్స్‌ఎస్ ఇన్ఫోసోల్, సిగ్నల్‌చిప్, ఆర్‌వీ సొల్యూషన్స్, నియోసాఫ్ట్ టెక్నాలజీస్, సెల్‌కామ్, సీ-డాట్, జీఎక్స్ ఇండియా సహా ఇతర సంస్థల ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. టెలికం హార్డ్‌వేర్, సెమీకండక్టర్ డిజైన్, ఏఐ-ఆధారిత వేదికలతో పాటు తదుపరి తరానికి చెందిన నెట్‌వర్క్ సంబంధిత మౌలిక సదుపాయాల రంగంలో వాటి దేశవాళీ సాంకేతికతలను, నవకల్పన సంబంధిత పరిష్కారాన్ని గమనించారు. భారత్‌లోని స్వయంసమృద్ధి సహిత, ప్రపంచ స్థాయిలో పోటీపడగలిగే టెలికం అనుబంధ విస్తారిత వ్యవస్థను పటిష్ఠపరచడంలో ఆయా నూతన ఆవిష్కర్త సంస్థలు అందిస్తున్న తోడ్పాటును మంత్రి ప్రశంసించారు.
భారత్ సురక్షిత నెట్‌వర్కులను తీర్చిదిద్దడం, ఏఐ-ఆధారిత టెలికం మౌలిక సదుపాయాలను ముందుకు తీసుకుపోవడం, విశ్వసనీయ అనుబంధ విస్తారిత వ్యవస్థలను ప్రోత్సహించడంతో పాటు ప్రపంచ స్థాయిలో టెలికం ఎగుమతులను పెంపొందించడం పట్ల పెవిలియన్లో భారతీయ నూతన ఆవిష్కర్త సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లు తమ నిబద్ధతను చాటిచెబుతున్నాయని మంత్రి అన్నారు.
టెలికం ఎక్విప్‌మెంట్ అండ్ సర్వీసెస్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (టీఈపీసీ) ఆధ్వర్యంలో భారత టెలికం నూతన ఆవిష్కర్త సంస్థలు ఎండబ్ల్యూసీ-2026లో పాల్గొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ కమ్యూనికేషన్ల శాఖకు చెందిన టెలికమ్యూనికేషన్ల విభాగం (డీఓటీ) కూడా ఈ సంస్థలకు మద్దతును అందిస్తోంది.
(రిలీజ్ ఐడి: 2235298)
సందర్శకుల సూచీ సంఖ్య : : 78