నౌకారవాణా మంత్రిత్వ శాఖ
పర్షియన్ గల్ఫ్‌లో నౌకా వాణిజ్య తాజా పరిస్థితిని సమీక్షించిన మంత్రిత్వ శాఖ
భారతీయ నౌకలు, నావికుల భద్రత కోసం మెరుగైన పర్యవేక్షణ
పర్షియన్ గల్ఫ్‌లో నావికులు, నౌకా వాణిజ్య ఆస్తుల భద్రతపై సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్
నౌకా వాణిజ్యంలో పెరుగుతున్న ముప్పు నేపథ్యంలో భారతీయ నావికుల భద్రత కోసం సత్వర ప్రతిస్పందన బృందాల ఏర్పాటు
నాడు పోస్టు చేయడమైనది:
03 MAR 2026 7:32PM by PIB Hyderabad
పర్షియన్ గల్ఫ్‌లో నౌకా వాణిజ్య భద్రత తాజా పరిస్థితిని కేంద్ర నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ ప్రాంతంలో భారత పతాకంతో నడుస్తున్న నౌకలు, భారతీయ నావికులను రక్షించడానికి ముందు జాగ్రత్త చర్యలను బలోపేతం చేసింది.
పర్షియన్ గల్ఫ్‌లో ప్రస్తుత భద్రతా వాతావరణాన్ని అంచనా వేయడానికి, భారత నౌకా వాణిజ్య ఆస్తులు-సిబ్బందిపై దాని ప్రభావాలను చర్చించేందుకు ఈ రోజు నిర్వహించిన సమీక్షా సమావేశానికి కేంద్ర నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా మంత్రి సర్బానంద సోనోవాల్ అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో నౌకాయాన డైరెక్టర్ జనరల్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని ప్రస్తుత పరిస్థితిని, భారతీయ పతాకంతో గల నౌకలు, భారతీయ నావికుల భద్రత విషయంలో తాజా పరిస్థితిని కేంద్ర మంత్రికి వివరించారు.
సమావేశం తర్వాత కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ, "మేం పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం. మన నావికుల భద్రత, సంక్షేమం, నౌకా వాణిజ్య ఆస్తుల భద్రతను నిర్ధారించడానికి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు, పర్యవేక్షణ, సమన్వయ విధానాలను కొనసాగిస్తున్నాం. సంబంధిత జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. ఎటువంటి పరిస్థితి ఎదురైనా సత్వరం స్పందించి దానిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం" అని తెలిపారు.
పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధి, ఒమన్ గల్ఫ్, దాని పరిసర సముద్ర ప్రాంతాల్లో క్షిపణి, డ్రోన్ కార్యకలాపాలు, ఎలక్ట్రానిక్ పరికరాల పనితీరును ప్రభావితం చేసే చర్యలు, ఇతర నౌకా వాణిజ్య భద్రతా సమస్యలు సహా ప్రతి ముప్పు విషయంలో సత్వర ప్రతిస్పందనతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఆధ్వర్యంలో భారతీయ నావికులు, భారత పతాకంతో గల నౌకల భద్రత కోసం కొనసాగిస్తున్న మెరుగైన పర్యవేక్షణ, భద్రతా చర్యలను మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోంది.
డీజీఎస్ ద్వారా భారతీయ పతాకంతో గల నౌకల రియల్-టైమ్ ట్రాకింగ్‌ను మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. రిపోర్టింగ్ ఫ్రీక్వెన్సీని పెంచింది. ఎమ్ఎమ్డీఏసీ డిజికామ్ సెంటర్ ద్వారా నిరంతర పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఓడలు, యజమానులు, నిర్వాహకులకు తప్పనిసరి రిపోర్టింగ్ ఆదేశాలను అమలు చేస్తున్నారు.
భారత నావికాదళం, విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ – ఇండియన్ ఓషన్ రీజియన్, మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్, విదేశాల్లోని భారత మిషన్లతో సన్నిహిత సమన్వయం కొనసాగిస్తున్నారు. నౌకాయాన కంపెనీలు, రిక్రూట్మెంట్-ప్లేస్‌మెంట్ సర్వీస్ లైసెన్సీలు సిబ్బందిని నియమించుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని... నావికులు, వారి కుటుంబాలతో నిరంతర కమ్యూనికేషన్‌ను కొనసాగించాలని సూచించారు.
ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ – ఇండియన్ ఓషన్ రీజియన్ డైరెక్టరేట్, ఇతర ఏజెన్సీలు వారి భద్రత, శ్రేయస్సును నిర్ధారించడానికి పూర్తిస్థాయి సమన్వయంతో పనిచేస్తున్నాయి. బాధిత నావికులు, వారి కుటుంబాలకు అవసరమైన మద్దతును, సహాయాన్ని అందిస్తున్నాయి.
అధికారుల మధ్య సకాలంలో సమన్వయాన్ని ప్రారంభించడానికి, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తక్షణ ప్రతిస్పందనను నిర్ధారించడానికి, భారతీయ నావికులు, వారి కుటుంబాలకు తక్షణ సహాయం అందించడానికి ఒక ప్రత్యేక సత్వర ప్రతిస్పందన బృందాన్ని ఏర్పాటు చేశారు. హెల్ప్‌లైన్ నంబర్లనూ సిద్ధం చేశారు. వాటి గురించిన సమాచారాన్ని ఆర్‌పీఎస్ఎల్‌ల ద్వారా నావికుల కుటుంబాలతో పంచుకున్నారు.
అధిక అప్రమత్తతను కొనసాగించాలని, ప్రయాణ-నిర్దిష్ట ప్రమాద అంచనాలను చేపట్టాలని సంబంధిత వ్యక్తులు, సంస్థలకు సూచించారు. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న నౌకలు నిరంతర సమాచార సంసిద్ధతను నిర్ధారిస్తూ, అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే నివేదించడానికి వీలుగా భద్రతపరంగా మెరుగైన అప్రమత్తతను, నిరంతర నిఘాను నిర్వహించాలని ఆదేశించారు.
కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ... "నావికులు, నౌకా వాణిజ్య సంబంధిత వ్యక్తులు, సంస్థలకు భారత ప్రభుత్వం అండగా ఉంటుంది. భారతీయ నౌకలు, సిబ్బందిని రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడంతో పాటుగా దౌత్యపరమైన, మానవతాపరమైన మద్దతును అందించడానికి మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉంది. భారత నౌకా వాణిజ్య ప్రయోజనాల పరిరక్షణ కోసం దేశీయ, అంతర్జాతీయ వాటాదారులతో చురుకైన సమన్వయాన్ని కొనసాగిస్తుంది" అని తెలిపారు.
***
(రిలీజ్ ఐడి: 2235261)
సందర్శకుల సూచీ సంఖ్య : : 64