PIB Headquarters
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

ఆచ‌ర‌ణ‌లో ఏఐ: భారతదేశ దైనందిన సవాళ్లకు అంకురాల‌ ఆచరణాత్మక పరిష్కారాల ప్రదర్శన

నాడు పోస్టు చేయడమైనది: 20 FEB 2026 1:53PM by PIB Hyderabad

పరిచయం
భారత్ మండపంలో 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026' మరో ఉత్సాహభరితమైన రోజుకు స్వాగతం పలికింది. సందర్శకులు పెద్ద సంఖ్యలో హాల్స్‌లోకి వస్తూ, వేదిక అంతటా ఆవిష్కరణలను పరిశీలిస్తూ చర్చలు సాగించారు.



ఎగ్జిబిషన్ బూత్‌ల వద్ద ప్రారంభ సంభాషణల నుండి ఆవిష్కర్తలు, విధాన రూపకర్తల మధ్య జరిగిన ఉత్సాహభరితమైన చర్చల వరకు, ఆ రోజంతా వేగంగా గడిచిపోయింది. లైవ్ డెమోల చుట్టూ చిన్న చిన్న సమూహాలుగా చేరి ఒక కీలక సందేశాన్ని నొక్కి చెప్పారు: ఏఐ ఇకపై కేవలం ప్రోటోటైప్‌లకే పరిమితం కాలేదు. ఇది దైనందిన వ్యవస్థల్లోకి తన దారిని వెతుక్కుంటోంది.

ఉద్భవిస్తున్న సాంకేతికతలను ఆచరణాత్మక ప్రజా వినియోగంలోకి తీసుకురావాలనే ప్రభుత్వ నిరంతర ప్రాధాన్యతను ఏఐ ఎలా ప్రతిబింబిస్తోందనే దానిపైనే దృష్టి సారించారు. వేదిక అంతటా, ఆలోచనలను కేవలం ప్రదర్శించడమే కాకుండా; వాస్తవ ప్రపంచ అనువర్తనాలపై దృష్టి సారించి వాటిని పరీక్షించి చర్చించారు.

 


ఈ స‌మ‌ష్టి స్ఫూర్తి, ఆలోచ‌న‌ల స్వేచ్ఛా మార్పిడితో, ఏఐ స‌ద‌స్సు కేవలం చర్చలకే పరిమితం కాకుండా, ఆలోచనలను స్పష్టమైన, ఆచరణాత్మక అనువర్తనాలుగా మార్చే పరిష్కారాల వేదికగా ఎదిగింది. ఈ స‌ద‌స్సు వివిధ రంగాలలో పనిచేస్తున్న అంకురాలు, పరిశోధకులు, పరిశ్రమ ప్ర‌ముఖులు, ఆవిష్కర్తలను ఒకచోటకు చేర్చింది. రవాణా, విద్య, పాలన, మౌలిక సదుపాయాలు, మరిన్ని రంగాలలో ఉపయోగించగల ఆచరణాత్మక పరిష్కారాలుగా ఏఐ పరిశోధనను మార్చడానికి జరుగుతున్న విస్తృత జాతీయ ప్రయత్నాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.



ఏఐతో కోచింగ్
సందర్శకులు ఎగ్జిబిషన్ హాల్‌లోకి అడుగుపెట్టగానే ఒక స్టడీ డ్యాష్‌బోర్డ్‌ను ప్రదర్శిస్తున్న స్క్రీన్ చుట్టూ విద్యార్థుల బృందం చేరి కనిపించింది.
ఈ ప్లాట్‌ఫారమ్ పేరు 'సాథీస‌(సెల్ఫ్ అసెస్‌మెంట్‌, టెస్ట్ ఆండ్ హెల్ప్ ఫ‌ర్ ఎంట్ర‌న్స్ ఎగ్జామ్స్‌). ఇది విద్యా మంత్రిత్వ శాఖ మరియు ఐఐటీ కాన్పూర్ చేప‌ట్టిన కార్య‌క్ర‌మం. 2023లో ప్రారంభించిన ఈ వేదిక‌ ఎనిమిది ప్రధాన పోటీ పరీక్షలైన జేఈఈ, నీట్‌, క్లాట్‌, ఐకార్‌, సీయూటీఈ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్ కోసం పూర్తిగా ఉచిత వ్యక్తిగత ఏఐ-ఆధారిత శిక్ష‌ణ‌, మార్గ‌ద‌ర్శ‌క‌ మద్దతును అందిస్తుంది.

 



సాథీ ఏఐ-ఆధారిత సందేహ నివృత్తి, విద్యా ప్ర‌ణాళిక రూప‌క‌ల్ప‌న‌, గంద‌ర‌గోళాన్ని గుర్తించే సాద‌నాలు, ఆటోమేటిక్ ట్రాన్స్‌క్రిప్ట్ సమ్మరైజేషన్‌ను అందిస్తుంది. విద్యార్థులు ఎల్లప్పుడూ నిర్ణీత గంటలలో చదువుకోలేరని గుర్తించి, సౌక‌ర్య‌వంత‌మైన అభ్యాసానికి మద్దతు ఇచ్చేలా ఏఐ ఫీచర్లను బృందం ఇందులో చేర్చింది. "విద్యార్థులు ఎప్పుడూ ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు చదువుకోరని మేము గ్రహించాము. అందుకే, ఏఐ కన్వెన్షనల్ టూర్, మెమోనిక్స్, జ్ఞాపకశక్తికి సహాయపడే సాధనాలు వంటివి ముఖ్యంగా జెన్ జీ విద్యార్థులకు సహాయపడతాయి. ఏఐ విజువల్ ప్రాబ్లమ్ సాల్వర్ వంటి ఫీచర్లను జోడించాము. తద్వారా వారు ఇంట్లో ఎప్పుడైనా చదువుకోవచ్చు," అని ఐఐటి కాన్పూర్‌లోని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీ ధ్రువ్ గార్గ్ వివరించారు.

విద్యార్థులు ఎంచుకున్న సబ్జెక్టులలో అందుబాటులో ఉన్న అధ్యయన గంటల ఆధారంగా వ్యక్తిగతీకరించిన స్టడీ ప్లాన్‌లను రూపొందించుకోవచ్చు. ఈ వ్యవస్థ లెక్చర్ ట్రాన్స్‌క్రిప్ట్‌ల నుండి కీలక సూత్రాలు, సారాంశాలను సేకరిస్తుంది. పదేపదే వచ్చే సందేహాలను హైలైట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ కంటెంట్ 13 భారతీయ భాషలలో అందుబాటులో ఉంది. మరింత విస్తరణ జరుగుతోంది.



ఎంచుకున్న ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభ అమలు ద్వారా జేఈఈ క్వాలిఫైయర్లలో 50% వరకు, నీట్ క్వాలిఫైయర్లలో 80% వరకు పెరుగుదల కనిపించిందని శ్రీ గార్గ్ ప్ర‌ధానంగా పేర్కొన్నారు. ప్రైవేట్ కోచింగ్‌కు స్తోమత లేని విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఈ సౌకర్యాన్ని విస్తరించడంపై ప్రధాన దృష్టి సారించారు.

కెమెరాలను ఏఐ ఆధారిత నిఘా వ్య‌వ‌స్థ‌లుగా మార్చడం
అక్కడికి కొద్ది దూరంలోనే చర్చ విద్య నుంచి నిఘా వ్యవస్థల వైపు మళ్లింది.
గురుగ్రామ్‌కు చెందిన పదేళ్ల నాటి 'ఐరిస్: వాల్యూ క్యాట‌లిస్ట్స్‌' స్టాల్ వద్ద సెక్యూరిటీ డిజైన్ మేనేజర్ శ్రీ జియా అహ్మద్ సాంప్రదాయ భద్రతా పరిష్కారాలలో ఏఐని ఎలా ఏకీకృతం చేస్తున్నారో వివరించారు. "మీకు ఒక గిడ్డంగి లేదా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఉందనుకుందాం. మేము దాని సమగ్ర భద్రతా ముస్సు మ‌దింపుతో ప్రారంభించి, అవసరాలకు అనుగుణంగా ఏఐ ఆధారిత భద్రతా పరిష్కారాలను రూపొందిస్తాము," అని ఆయన చెప్పారు.

హార్డ్‌వేర్‌ను భర్తీ చేయడానికి బదులుగా, "ఐరిస్‌" సాంప్రదాయ కెమెరా వ్యవస్థలను ఏఐ-ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో మెరుగుపరుస్తుంది. "గతంలో నిఘా వ్యవస్థలు పూర్తిగా మాన్యువల్ మానిటరింగ్‌పై ఆధారపడి ఉండేవి. ఏదైనా సంఘటన జరిగితే రికార్డింగ్ మొత్తాన్ని సమీక్షించాల్సి వచ్చేది. ఇది సమయం మరియు వనరులను విపరీతంగా ఖర్చు చేసే ప్రక్రియ," అని ఆయన పేర్కొన్నారు.



శ్రీ అహ్మద్ వివరిస్తూ: ఇప్పుడు, ఏఐ-ప్రారంభిత సాధనాలతో ఒకే కమాండ్‌తో సంబంధిత సమాచారాన్ని ఒకేసారి పొందవచ్చు. ఇంటెలిజెంట్ ఫిల్టరింగ్ ద్వారా బట్టల రంగు లేదా సమయం వంటి లక్షణాల ఆధారంగా ఫుటేజీని తక్షణమే తగ్గించవచ్చు. అలాగే కెమెరాలు, మోషన్ సెన్సార్లు, ఇతర పరికరాలను అనుసంధానించే వ్యవస్థలు త‌క్ష‌ణ‌ హెచ్చరికలను పంపిస్తాయి. ఇది స్పందన వేగాన్ని మరియు సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది.

ఈ సంస్థ ప్రస్తుతం మధురలోని ప్రపంచంలోనే ఎత్తైన దేవాలయం అయిన 'బృందావన్ చంద్రోదయ మందిరం'తో సహా ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం భద్రతా ముప్పు మ‌దింపులను నిర్వహిస్తోంది. ఏఐని ఉపయోగిస్తూ అనుభవజ్ఞులైన నిపుణుల మద్దతుతో క్రమబద్ధంగా ముప్పు తగ్గింపుపైనే తమ దృష్టి ఉంటుందని శ్రీ అహ్మద్ పేర్కొన్నారు.

పట్టాలు త‌ప్ప‌క‌ముందే పర్యవేక్షణ
'రైల్‌ల్యాబ్స్: రైల్వే డిజిటల్ సేఫ్టీ' సహ వ్యవస్థాపకుడు శ్రీ సుమిత్ ఆనంద్.. 'అరిస్టా' అనే స్వయంప్రతిపత్త ట్రాక్ తనిఖీ రోబోట్‌ను గర్వంగా చూపించారు. రైల్‌ల్యాబ్స్ అరిస్టా స్వయంప్రతిపత్తమైన, ఏఐ-ఆధారిత తనిఖీ సామర్థ్యాలను అందించడం ద్వారా ట్రాక్ నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది.

ఆయన మాట్లాడుతూ, "ఇది దాని పరిసరాల ఆధారంగా శిక్షణ పొందింది. మేము ప్రధానంగా రైల్వే ట్రాక్‌లో ఉపరితల, అంతర్గత పగుళ్లను గుర్తించడానికి అల్ట్రాసోనిక్ ఫ్లా డిటెక్షన్‌ను ఉపయోగిస్తాము." ఈ రోబో ట్రాక్ ప్రొఫైలింగ్ కోసం లేజర్‌లను, పగుళ్లను గుర్తించడానికి ఏఐ-ఆధారిత విజన్ కెమెరాలను ఉపయోగిస్తుంది. శ్రీ ఆనంద్ ఇంకా వివరిస్తూ.. "ఒకవేళ ఫిష్ ప్లేట్లు లేకపోయినా, బోల్ట్‌లు ఊడిపోయినా లేదా ఇతర నిర్మాణ లోపాలు ఉన్నా, ఈ వ్యవస్థ వాటన్నింటినీ గుర్తిస్తుంది." అని అన్నారు.

ఇది మాన్యువల్ పద్ధతులతో పోలిస్తే తనిఖీ సామర్థ్యాన్ని 200% వరకు పెంచుతుందని ఆయన తెలిపారు.

దగ్గరలోనే ఉన్న రైల్‌ల్యాబ్స్ ఆపరేషనల్ మేనేజర్ శ్రీ నిశ్చల్ రంజన్.. ఇప్పటికే మార్కెట్లో ఉన్న 'చక్రవ్యూ' అనే మరో ఉత్పత్తి గురించి వివరించారు. ఆయన చెప్పిన‌దాని ప్రకారం.. ఇది రైలు లేదా కోచ్ చక్రం చిరిగిపోతుందో లేదా దెబ్బతింటుందో ముందే అంచనా వేసే 'వీల్ షెల్లింగ్ ప్రిడిక్షన్ సిస్టమ్‌'. తద్వారా రైలు పట్టాలు తప్పకుండా నివారిస్తుంది. ఈ ఉత్పత్తి ఇప్పటికే ముంబై, అగర్తల, రాంచీ వంటి నగరాల్లో 20 ఎల్‌హెచ్‌బీ, తేజస్ కోచ్‌లలో పని చేస్తోంది.

"వైఫల్యానికి ముందే చక్రాల లోపాలను గుర్తించడం ద్వారా ఈ వ్యవస్థ రైల్వే భద్రతను బలోపేతం చేస్తుంది" అని ఆయన చెప్పారు. వారి బృందానికి డిజిటల్ భద్రత అంటే మానవ పర్యవేక్షణను తొలగించడం కాదు, దానిని క‌చ్చితత్వంతో బలోపేతం చేయడం ముఖ్య‌మ‌న్నారు.

"రెండు మిల్లీమీటర్ల కంటే ఎక్కువ ఉన్న పగులు కూడా ప్రమాదకరంగా మారుతుంది," అని ఆయన వివరిస్తూ.. ముందస్తు గుర్తింపు అనేది కేవలం సాంకేతిక విలాసం కాదు, భద్రతా అవసరమని చెప్పారు.

ఈ ఉత్పత్తులన్నీ కలిసి ముందస్తు గుర్తింపు, పట్టాలు తప్పడాన్ని నివారించడం ద్వారా రైల్వేలలో భద్రతా వ్యవస్థను గణనీయంగా మెరుగుపరుస్తాయని హామీ ఇస్తున్నాయి. ఇటువంటి ఆచరణాత్మక పరిస్థితుల్లో ఏఐని ఉపయోగించడం వల్ల వాస్తవ జీవితంలో అధిక నాణ్యత గల ఫలితాలను సాధించవచ్చు.

ఈ కథనాల మధ్య ఏఐ సమ్మిట్ క్రమంగా ఊపందుకుంది. హాల్ అంతటా స్క్రీన్‌లు వెలుగుతున్నాయి. డెమో యూనిట్లు నెమ్మదిగా శబ్దం చేస్తున్నాయి. విధాన నిర్ణేతలు, విద్యార్థులు, సాంకేతిక నిపుణులు మరియు పరిశ్రమ ప్రతినిధులు స్టాల్స్ మధ్య తిరుగుతూ, ప్రశ్నలు అడుగుతూ, లైవ్ డెమోలను గమనిస్తూ సాగారు.

ముగింపు
సాయంత్రం అవుతున్న కొద్దీ, హాల్ లైట్లు తగ్గుతున్నా, సందర్శకులు ఇంకా అక్కడే ఉండి, ఇంటర్‌ఫేస్‌లను పరిశీలిస్తూ ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ స‌ద‌స్సు తక్షణ మార్పును వాగ్దానం చేయడం లేదు. బదులుగా, దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసే రంగాలలో నిఘా వ్య‌వ‌స్థ‌ల‌ స్థిరమైన ఏకీకరణను ఇది ప్రతిబింబిస్తుంది. రవాణా మార్గాల్లో, దేవాలయ సముదాయాల్లో, తరగతి గదుల్లో, మరెన్నో చోట్ల, సామర్థ్యాన్ని, ప్రాప్యతను, భద్రతను పెంచడానికి ఉన్నతమైన ఏఐ స్థాయిల‌ను ఇప్పటికే ఉన్న చ‌ట్రాలలో చేరుస్తున్నారు.

ఆ క్రమబద్ధమైన ఏకీకరణలోనే భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ఏఐ శాశ్వతమైన వాగ్దానం దాగి ఉంది.

 

***


(రిలీజ్ ఐడి: 2235048) సందర్శకుల సూచీ సంఖ్య : : 31
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Odia , Tamil , Malayalam