సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అధ్యక్షతన ఐఐఎంసీ 57వ స్నాతకోత్సవం; విద్యా విభాగం నూతన భవనానికి శంకుస్థాపన
నిజాయితీతో కూడిన జర్నలిజం అవసరమని ఉపరాష్ట్రపతి పిలుపు
జర్నలిస్ట్ ఫెలోషిప్‌ను ప్రకటించిన అశ్వినీ వైష్ణవ్; అభివృద్ధి చెందిన భారత్ కోసం కృషి చేయాలని పట్టభద్రులకు పిలుపు
నాడు పోస్టు చేయడమైనది:
27 FEB 2026 8:50PM by PIB Hyderabad
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ) డీమ్డ్ విశ్వవిద్యాలయం 57వ స్నాతకోత్సవం నేడు న్యూఢిల్లీ ప్రాంగణంలో జరిగింది. జనవరి 2024లో ఐఐఎంసీకి డీమ్డ్ విశ్వవిద్యాలయ హోదా వచ్చిన తర్వాత మొదటి బ్యాచ్ పట్టభద్రుల స్నాతకోత్సవం ఇదే.
గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యా విభాగం నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. ఇది ఈ సంస్థలో మౌలిక సదుపాయాల విస్తరణలో ఒక ముఖ్యమైన అడుగు.

స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ ప్రసంగిస్తూ, జర్నలిజం సవాళ్లను విస్మరించకూడదని, అదే సమయంలో దేశాభివృద్ధిని, పురోగతిని కూడా సమానంగా చాటిచెప్పాలని అన్నారు. జర్నలిజం, అడ్వర్టైజింగ్, పబ్లిక్ రిలేషన్స్ విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, సమాచార రంగ నిపుణులు ప్రజల ఆకాంక్షలను తీర్చిదిద్దుతారని, దేశ ప్రాధాన్యతలను చాటిచెబుతారని పురోగతికి స్ఫూర్తినిచ్చే కథనాలను సృష్టిస్తారని పేర్కొన్నారు. సృజనాత్మకత అనేది కేవలం వ్యాపార సాధనం మాత్రమే కాదని, అది సామాజిక మార్పుకు ఒక చోదక శక్తి అని ఆయన స్పష్టం చేశారు. సాంకేతికత, వేదికలు, మాధ్యమాలు మారుతూనే ఉంటాయని, కానీ జర్నలిజం, సమాచార రంగాలలోని ప్రాథమిక విలువలైన కచ్చితత్వం, నిష్పక్షపాతం, చిత్తశుద్ధి, బాధ్యతాయుతమైన పనితీరు విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని ఉపరాష్ట్రపతి చెప్పారు. సామాజిక ప్రయోజనం కలిగిన సమాచార వ్యవస్థను కొనసాగించాలని, ఆత్మవిశ్వాసం గల సమ్మిళిత భారత్ నిర్మాణానికి కృషి చేయాలని ఆయన పట్టభద్రులను కోరారు.

కేంద్ర సమాచార, ప్రసార, రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, భారత దేశంలోని అత్యున్నత విద్యా సంస్థలలో ఐఐఎంసీ ఒకటని పేర్కొన్నారు. ఇక్కడ చదివిన వారికి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని, మీడియా రంగంలో ఇక్కడి పట్టభద్రులకు మంచి గుర్తింపు ఉందని ఆయన అన్నారు.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐఐఎంసీ జర్నలిస్టుల కోసం ఒక ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తుందని ఆయన ప్రకటించారు. సాంకేతికత, ఆర్థిక వ్యవస్థ, వ్యూహాత్మక రంగాలలో నైపుణ్యం సాధించడానికి, పరిశోధనలను పెంచడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. ఐఐఎంసీలో ఇంక్యుబేటర్ ఏర్పాటును మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. భారతీయ జానపద కథలను సాంకేతికతతో కూడిన కథా రూపాలుగా మారుస్తున్న స్టార్టప్ సహా వినూత్న స్టార్టప్ లను ఆయన అభినందించారు. భారత భవిష్యత్తు గమనాన్ని నిర్దేశించడంలో 'జెన్ భారత్' ప్రాముఖ్యతను ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆరు ప్రాంగణాలకు చెందిన తొమ్మిది పీజీ డిప్లొమా కోర్సుల నుంచి 509 మంది విద్యార్థులకు డిప్లొమాలు ప్రదానం చేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 35మందికి పతకాలు అందించారు. వీటిలో 23 పతకాలతో పాటు నగదు బహుమతులు కూడా ఉన్నాయి. గ్రేడ్, క్రెడిట్ విధానంతో కూడిన మార్కుల పత్రాలను డిజీలాకర్ ద్వారా అందుబాటులో ఉంచారు.

ఐఐఎంసీ ప్రస్తుతం ఎనిమిది పీజీ డిప్లొమా కోర్సులను, అనేక ఎంఏ కోర్సులను నిర్వహిస్తోంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి మూడు కొత్త ఎంఏ కోర్సులను కూడా ప్రారంభించనున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2233789)
సందర్శకుల సూచీ సంఖ్య : : 61