రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
నగరాలు, కుటుంబాలు, కలలను చేరువ చేస్తున్న అహ్మదాబాద్-ధోలేరా ఎక్స్‌ప్రెస్‌వే
నాడు పోస్టు చేయడమైనది:
27 FEB 2026 3:53PM by PIB Hyderabad
109.019 కిలోమీటర్ల పొడవైన అహ్మదాబాద్-ధోలేరా గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (ఎన్ఈ-8) ఇకమీదట భారత్‌మాల పరియోజన కింద నిర్మించిన ఒక రహదారి మాత్రమే కాదు... ఇది ప్రజల జీవనాడిగా మారింది. గ్రామాలను నగరాలతో, కుటుంబాలను తగ్గిన ప్రయాణ సమయంతో, ఆకాంక్షలను అవకాశాలతో ఇది అనుసంధానిస్తుంది.
అహ్మదాబాద్, భావ్‌నగర్ జిల్లాల గుండా వెళ్ళే ఈ ఎక్స్‌ప్రెస్‌వే... ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (డీఎస్ఐఆర్), ప్రస్తుత తీరప్రాంత రహదారిని సజావుగా అనుసంధానిస్తుంది. ఈ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని, ప్రయాణాన్ని, కలలను ఇది పునర్నిర్వచిస్తుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.5,800 కోట్లతో నిర్మించిన ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఈ ప్రాంతంలో అత్యంత ముఖ్యమైన మౌలిక సదుపాయాల పెట్టుబడుల్లో ఒకటిగా ఉంది.
తుది కార్యాచరణ సంసిద్ధతను అంచనా వేసేందుకు వీలుగా ప్రయాణికులు వేగంగా, సాఫీగా ప్రయాణించడానికి ఈ ఎక్స్‌ప్రెస్‌వేను పరీక్షించేందుకు ప్రజలకు అందుబాటులో ఉంచారు.
గాంధీనగర్, భావ్‌నగర్ మధ్య తరచూ ప్రయాణించే నరేంద్ర సింగ్ చుడాస్మా వంటి ప్రయాణికులకు ఈ ఎక్స్‌ప్రెస్‌వే వారి ప్రయాణ సమయంలో అమూల్యమైన మార్పును తీసుకువచ్చింది.
"గతంలో ఈ ప్రయాణం కోసం మూడున్నర నుంచి 4 గంటలు పట్టేది. ఇప్పుడు నేను రెండున్నర నుంచి రెండు గంటల నలబై ఐదు నిమిషాల్లోనే గమ్యానికి చేరుకుంటున్నాను. గతంలో రహదారిపై ప్రయాణంలోనే ఎక్కువ సమయం వెచ్చించడంతో నా కుటుంబానికి తగినంత సమయం ఇవ్వలేకపోయాను. ఇప్పుడు, నేను ఆదా చేసే 2 నుంచి రెండున్నర గంటల సమయం వారితో గడుపుతున్నాను." అని నరేంద్ర సింగ్ తన అనుభవాన్ని పంచుకున్నారు.
ఈ ఎక్స్‌ప్రెస్‌వే ధోలేరా ఆర్థిక సామర్థ్యాన్ని పెంపొందించే అవకాశాలను అందిస్తుంది. ఈ కనెక్టివిటీ పెట్టుబడిదారుల్లో నెలకొన్న సంకోచాలను పూర్తిగా తొలగించిందని యదురాజ్ సింగ్ చుడాస్మా అభిప్రాయపడ్డారు.
"ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభంతో పెట్టుబడిదారులు సులభంగా ప్రయాణించవచ్చు, సమయం ఆదా చేసుకోవచ్చు. అహ్మదాబాద్ నుంచి ధోలేరా చేరుకోవడానికి ఇప్పుడు కేవలం 45 నిమిషాలే పడుతోంది. ఇది చాలా కీలకం. పెట్టుబడిదారులు సంతోషంగా ఉన్నారు. వారు ధోలేరాలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ రహదారితో కనెక్టివిటీ అంతరం తొలగిపోయింది" అని ఆయన పేర్కొన్నారు.
పిప్లి గ్రామ నివాసి హర్ష్‌దీప్ సింగ్ చుడాస్మా విషయంలో ఈ ఎక్స్‌ప్రెస్‌వే అతని కుటుంబం నగరంతో కలిగి ఉన్న సంబంధాన్ని పూర్తిగా మార్చివేసింది.
"రెండు సంవత్సరాల కిందట అహ్మదాబాద్ నగరం మాకు దాదాపు 120 నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున మేం అహ్మదాబాద్ నుంచి చాలా దూరంలో నివసిస్తున్నట్లు మాకు అనిపించింది. కానీ ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించినప్పటి నుంచి, మేం అహ్మదాబాద్‌లోనే నివసిస్తున్నట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం అహ్మదాబాద్ చేరుకోవడానికి కేవలం 45 నిమిషాలే పడుతోంది. గతంలో దీనికి రెండున్నర గంటలు పట్టేది" అని హర్ష్‌దీప్ సింగ్ సంతోషంగా అన్నారు.
మౌలిక సదుపాయాల నిర్మాణం, పర్యావరణ పరిరక్షణ
అహ్మదాబాద్-ధోలేరా ఎక్స్‌ప్రెస్‌వే దాని పర్యావరణ-హితమైన నిర్మాణ విధానంతో అతిపెద్ద మౌలిక సదుపాయాలు బాధ్యతాయుతంగా అభివృద్ధి చెందగలవని రుజువు చేస్తుంది.
• అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను కట్ట నిర్మాణంలో తిరిగి ఉపయోగించారు.
• 22 లక్షల మెట్రిక్ టన్నుల ఫ్లై యాష్‌ను ఉపయోగించడం ద్వారా పారిశ్రామిక వ్యర్థాలను, కర్బన ప్రభావాన్నీ తగ్గించారు
• మధ్యలో నాటిన 2,70,675 మొక్కలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 1,56,097 అవెన్యూ తోటలతో ఇది భారీ హరిత కార్యక్రమంగా నిలిచింది.
ఎక్స్‌ప్రెస్‌వే ముఖ్య లక్షణాలు
• భవిష్యత్తులో 8 వరుసలుగా విస్తరించడం కోసం రూపొందించిన 30-మీటర్ల వెడల్పు గల మీడియన్
• సీహెచ్. 67 వద్ద ఇంటర్‌చేంజ్ ద్వారా ధోలేరా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యక్ష కనెక్టివిటీ
• ఈ పనులతో పాటు సమాంతరంగా కొనసాగుతున్న ప్రణాళికాబద్ధమైన సెమీ హై-స్పీడ్ రైలు కారిడార్ (30 మీటర్ల ఆర్ఓడబ్ల్యూ ఇప్పటికే సేకరించారు)
• సజావుగా ప్రయాణించడానికి క్లోజ్డ్ టోలింగ్ వ్యవస్థ
• 2 ఆధునిక వే-సైడ్ సౌకర్యాలు
• 3 ఆర్ఓబీలు, 11 ఇంటర్‌చేంజ్‌లు, 14 ఫ్లైఓవర్‌లు, 86 అండర్‌పాస్‌లు, 224 కల్వర్టులు, మరిన్నింటితో విస్తృత నిర్మాణాలు
ప్రయాణం, ఆర్థిక వ్యవస్థ, దైనందిన జీవితంలో పరివర్తన
ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రయాణ దూరాలను, సమయాలను బాగా తగ్గించింది:
• అహ్మదాబాద్ నుంచి ధోలేరా: 100 కిలోమీటర్లు - 2 గం 15 నిమిషాలు నుంచి 83 కిలోమీటర్లు - 45 నిమిషాలు
• అహ్మదాబాద్ నుంచి భావ్‌నగర్: 169 కిలోమీటర్లు - 3 గం 15 నిమిషాలు → 141 కిలోమీటర్లు - 1 గం 45 నిమిషాలు
ఇది కుటుంబాలను చేరువ చేస్తుంది... సమయాన్ని ఆదా చేస్తుంది... అవకాశాలను అందిస్తుంది... ఒకే సమయంలో ఈ నిర్మాణం స్థిరమైన, సమష్టి చర్యలతో హరిత భవిష్యత్తును నిర్మిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2233763)
సందర్శకుల సూచీ సంఖ్య : : 50