ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఫిబ్రవరి 28న పీఎం గుజరాత్ పర్యటన


సనంద్‌లో మైక్రాన్ టెక్నాలజీకి చెందిన సెమీ కండక్టర్ అసెంబ్లీ, టెస్ట్, ప్యాకేజింగ్ (ఏటీఎంపీ) కేంద్రాన్ని ప్రారంభించనున్న పీఎం

ఈ ప్రారంభ కార్యక్రమం సెమీకండక్టర్ తయారీకి సంబంధించి భారత ప్రయాణంలో కీలక ఘట్టం

భారతదేశంలో తయారైన మొదటి సెమీ కండక్టర్ మెమరీ మాడ్యూల్స్ వాణిజ్య ఉత్పత్తి, రవాణా ప్రారంభం

ప్రపంచంలోనే అతిపెద్ద, ఎక్కువ ఎత్తులో నిర్మించిన అత్యంత పరిశుభ్రమైన గదులతో ప్రత్యేక సౌకర్యం

నాడు పోస్టు చేయడమైనది: 27 FEB 2026 3:38PM by PIB Hyderabad

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫిబ్రవరి 28, 2026న గుజరాత్‌లో పర్యటిస్తారు. ఆ రోజున మధ్యాహ్నం 3:45 గంటలకు సనంద్‌లో మెక్రాన్ సెమీ కండక్టర్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన సెమీ కండక్టర్ అసెంబ్లీ, టెస్ట్, ప్యాకేజింగ్ (ఏటీఎంపీ) కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు.

సనంద్ ఏటీఎంపీ కేంద్రం నుంచి తొలి స్వదేశీ సెమీకండక్టర్ మెమరీ మాడ్యూల్స్ వాణిజ్య ఉత్పత్తి, రవాణా ప్రారంభం కావటం, భారత సెమీకండక్టర్ తయారీ ప్రయాణంలో కీలక ఘట్టాన్ని సూచిస్తుంది. ప్రపంచ సెమీ కండక్టర్ విలువ వ్యవస్థలో భారత్ స్థానాన్ని బలోపేతం చేయటంలో ఇది కీలక ముందడుగు.

ఈ ప్రాజెక్టుకు సెప్టెంబర్ 23న భూమి పూజ చేశారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) ద్వారా ఆమోదం పొందిన మొదటి ప్రతిపాదన ఇది. రూ.22,500 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అనుమతి లభించిన వెంటనే పనిని ప్రారంభించటం, దేశంలోనే వ్యూహాత్మక సెమీకండక్టర్ పెట్టుబడులను వేగవంతం చేయటంలో ప్రభుత్వ నిబద్ధతను సూచిస్తుంది.

సనంద్ ప్లాంట్‌లో సుమారు 5,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పరిశుభ్రమైన గదులు ఉంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద, ఎక్కువ ఎత్తులో నిర్మించిన అత్యంత పరిశుభ్రమైన గదులతో ప్రత్యేక సౌకర్యం గల కేంద్రంగా ఇది నిలుస్తుంది. కృత్రిమ మేధ, గరిష్ఠ సామర్థ్యం గల కంప్యూటింగ్ రంగాల్లో వస్తున్న వేగవంతమైన మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా మెమరీ, స్టోరేజ్ సొల్యూషన్స్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చటమే లక్ష్యంగా ఈ కేంద్రాన్ని రూపొందించారు.

మైక్రాన్ సంస్థ గ్లోబల్ తయారీ నెట్‌వర్క్ నుంచి అత్యాధునిక డైనమిక్ రాండమ్ యాక్సెస్ మెమరీ (డీఆర్ఏఎం), ఎన్ఏఎన్‌డీ సెమీ కండక్టర్ వేఫర్లను పూర్తిస్థాయి మెమరీ, స్టోరేజ్ ఉత్పత్తులుగా సనంద్‌లోని ఏటీఎంపీ కేంద్రం మారుస్తుంది. ఇవి ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల అవసరాలను తీరుస్తాయి.

ఈ కేంద్రం ఏర్పాటు, కార్యాచరణ ద్వారా సెమీకండక్టర్ తయారీ రంగంలో భారతదేశం విశ్వసనీయమైన, పోటీతత్వ దేశంగా ఎదుగుతోందని స్పష్టమవుతుంది. దేశంలో పటిష్టమైన, స్వావలంబన సాంకేతిక వ్యవస్థను నెలకొల్పాలనే ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2233755) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Gujarati , Tamil , Kannada , Malayalam