లోక్‌సభ సచివాలయం
azadi ka amrit mahotsav

ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో భారతీయ యువత ముందంజలో ఉన్నారు: లోక్ సభ స్పీకర్


దేశ నిర్మాణానికి కట్టుబడి ఉండాలని, నూతన విశ్వాసంతో వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయాలని యువతకు పిలుపునిచ్చిన లోక్ సభ స్పీకర్

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శ్రీ వైష్ణవ్ విద్యాపీఠ్ విశ్వవిద్యాలయ ప్రారంభోత్సవ వేడుకలో ప్రసంగించిన లోక్ సభ స్పీకర్

నాడు పోస్టు చేయడమైనది: 27 FEB 2026 6:12PM by PIB Hyderabad

పరస్పర అనుసంధానంతో వేగంగా మారుతున్న ప్రపంచంలో సవాళ్లను పరిష్కరించడంలో భారతీయ యువత ముందంజలో ఉందని లోక్సభ స్పీకర్‌ శ్రీ ఓం బిర్లా నేడు పేర్కొన్నారు. ప్రస్తుత కాలం అభివృద్ధి చెందుతున్న భారత్కు భవిష్యత్తులో మార్పును తీసుకొచ్చే కీలక దశను సూచిస్తుందని అన్నారు. ఆలోచనాత్మక దృక్పథం, వినూత్న ఆలోచనలు, పరిశోధన సామర్థ్యాలు కలిగిన నేటి విద్యార్థులు దేశాన్ని కొత్త దిశల వైపు నడిపించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న శ్రీ వైష్ణవ్ విద్యాపీఠ్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ శ్రీ బిర్లా ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ గొప్ప బలం యువతలో ఉందని, వారి విశ్వాసం, సరికొత్త దృక్పథాలు, ఆవిష్కరణల స్ఫూర్తి దేశ పురోగతిని నడిపించే శక్తిమంతమైన శక్తులని అన్నారు. జ్ఞానాన్ని సముపార్జించడం, ఆచరణాత్మక శిక్షణ పొందడం, ఆవిష్కరణలను అలవర్చుకోవడం, సాంకేతికతపై పట్టు సాధించడం అనేవి విద్యార్థుల ప్రయాణంలో ముఖ్యమైన అంశాలని సూచించారు.

సాంకేతికతఆవిష్కరణల ద్వారా అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించే నాయకత్వాన్ని ఈ విశ్వవిద్యాలయం పెంపొందించడం గర్వకారణమని లోక్సభ స్పీకర్ అభినందించారు. భారతీయ విద్యార్థులకు, యువతకు ప్రపంచవ్యాప్తంగా ఉద్భవిస్తున్న సమస్యలకు పరిష్కారాలను కనుగొనే సామర్థ్యం ఉందని, అయితే అందుకు కఠోర శ్రమ, నిరంతర అభ్యాసం అవసరమని స్పష్టం చేశారుపట్టభద్రులైన విద్యార్థులు దేశ నిర్మాణానికి అంకితం కావాలని.. నూతన విశ్వాసం, దృఢ సంకల్పం, ఉన్నతమైన కలలతో వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడానికి కృషి చేయాలని శ్రీ బిర్లా పిలుపునిచ్చారు.

శ్రీ ఓం బిర్లా తన విదేశీ పర్యటనలను గుర్తుచేసుకుంటూ.. అనేక దేశాలు భారత్ వైపు ముఖ్యంగా ఇక్కడి యువత వైపు గొప్ప అంచనాలతో చూస్తున్నాయని పేర్కొన్నారు. అనేక దేశాల్లో యువత జనాభా తగ్గుముఖం పడుతుంటే భారత్లో యువతపెరుగుతున్న వారి సామర్థ్యాలు అపారమైన అవకాశాలను అందిస్తున్నాయని తెలిపారుభారతీయ యువత ఇప్పటికే అంకుర సంస్థలు, ఆవిష్కరణలుపరిశోధనల ద్వారా జాతీయ, అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడం ప్రారంభించారని ఆయన ప్రశంసించారు. వారి కృషి దేశ సామర్థ్యం, భవిష్యత్తు నాయకత్వంపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు. విద్యార్థులు తమ విద్యా ప్రయాణంలో పొందిన జ్ఞానం, అనుభవంతో అంతిమంగా దేశానికి సేవ చేయాలని ఆయన ఆకాంక్షించారు. విలువలు, సంస్కృతి, సామాజిక నిబద్ధతతో ప్రతి విద్యార్థి నవ భారత నిర్మాణానికి, అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు పూర్తిస్థాయిలో సహకరించాలని సూచించారు.

శ్రీ వైష్ణవ్ విద్యాపీఠ్ విశ్వవిద్యాలయం శతాబ్ద కాలంగా భారతీయ సంస్కృతిని, విలువలను కాపాడటంలో చేస్తున్న కృషిని శ్రీ బిర్లా కొనియాడారు. సాంస్కృతిక వారసత్వం, నైతిక సూత్రాలు, తాత్విక చింతనను కాపాడుతూనే, రాబోయే తరాలను భవిష్యత్తు అభివృద్ధికి సిద్ధం చేయడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. చరిత్రలో ఇండోర్, మధ్యప్రదేశ్ ప్రజలు దేశం, సమాజ శ్రేయస్సు కోసం తమవంతు చిన్న చిన్న సహకారాలను అందిస్తూ వచ్చారని, ఈ సామూహిక స్ఫూర్తి దేశ సాంస్కృతిక బలాన్ని చాటుతోందని ఆయన పేర్కొన్నారు. శతాబ్దాల విదేశీ పాలనలో మొఘలులు, బ్రిటిష్ వారి హయాంలో భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలను, విలువలను బలహీనపరిచే ప్రయత్నాలు జరిగినప్పటికీ, ఇండోర్‌లో భారతీయ సంస్కృతి సారాంశం సజీవంగా నిలిచిందని ఆయన ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో ఇండోర్ పార్లమెంటు సభ్యులు శ్రీ శంకర్ లాల్వానీ, మధ్యప్రదేశ్ మంత్రి శ్రీ తులసీరామ్ సిలావత్ పాల్గొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2233748) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Tamil , Kannada