ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత అంతరిక్ష వ్యవస్థకు సైబర్‌ కవచం: ‘ఎస్‌ఐఏ-ఇండియా.. సెర్ట్‌-ఇన్‌ సంయుక్త మార్గదర్శకాలు జారీ

నాడు పోస్టు చేయడమైనది: 26 FEB 2026 4:55PM by PIB Hyderabad

భారత అంతరిక్ష రంగంలోని ఉపగ్రహ సమాచార వ్యవస్థలు సహా అంతరిక్ష సైబర్ భద్రత అత్యంత ప్రధానం. ఈ కమ్యూనికేషన్‌ వ్యవస్థలు మారుమూల, వ్యూహాత్మక ప్రాంతాల అనుసంధానంలో కీలక  తోడ్పాటునిస్తాయి. జాతీయ భద్రత కార్యకలాపాలకు మద్దతు, విపత్తు ప్రతిస్పందన విధానాల బలోపేతం సహా నావిగేషన్-ప్రసార సేవల సౌలభ్యం కల్పిస్తాయి. అంతేకాకుండా దేశాభివృద్ది, పునరుత్థాన సామర్థ్యం ఇనుమడించేందుకు తగిన విస్తృత శ్రేణి ఆర్థిక కార్యకలాపాలకు దోహదం చేస్తాయి.

ఈ నేపథ్యంలో అంతరిక్ష కమ్యూనికేషన్ సంపద భద్రత, భారత అంతరిక్ష వ్యవస్థ పునరుత్థానానికి దోహదం చేసే దిశగా అంతరిక్ష సైబర్ భద్రత కోసం ‘ఎస్‌ఐఏ-ఇండియా’ సహకారంతో కేంద్ర ఎలక్ట్రానిక్స్-సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (మెయిటీ) పరిధిలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్‌-ఇన్‌) విభాగం ఒక సమగ్ర చట్రంతోపాటు మార్గదర్శకాలను రూపొందించింది. ఈ నెల 24 నుంచి 26 వరకు న్యూఢిల్లీలో నిర్వహించిన “డెఫ్‌శాట్ కాన్ఫరెన్స్ అండ్‌ ఎక్స్‌ పో-2026”లో ఈ మార్గదర్శక పత్రాన్ని ఆవిష్కరించారు.

అంతరిక్ష రంగంలో సైబర్ భద్రత సంసిద్ధతను పెంచడం లక్ష్యంగా సలహా పత్రం రూపంలో ఈ మార్గదర్శకాలను రూపొందించారు. ప్రభుత్వ సంస్థలు, ఉపగ్రహ సేవా ప్రదాతలు, గ్రౌండ్ స్టేషన్ ఆపరేటర్లు, పరికరాల విక్రేతలు, ప్రైవేట్ అంతరిక్ష సంస్థలు సహా అంతరిక్ష వ్యవస్థలోని విభిన్న భాగస్వాములకు మద్దతిచ్చే విధంగా ఈ సాలోచనాత్మక చట్రానికి రూపమిచ్చారు. నిర్దిష్ట సైబర్ భద్రత సూత్రాలు, నియంత్రణలపై సిఫారసులతోపాటు విస్పష్ట బాధ్యతల నిర్దేశం ద్వారా అంతరిక్ష రంగంలో పునరుత్థాన సామర్థ్యం, జవాబుదారీతనం, చురుకైన ముప్పు నిర్వహణ సంస్కృతిని పెంచేందుకు ఈ మార్గదర్శకాలు తోడ్పడతాయి.

ఈ సందర్భంగా ‘సెర్ట్‌-ఇన్‌’ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సంజయ్ బెహల్‌ మాట్లాడుతూ- “దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో సైబర్ పునరుత్థాన సామర్థ్య బలోపేతం విషయంలో మేం స్థిరంగా కృషి చేస్తున్నాం. దేశ సాంకేతిక సార్వభౌమాధికారం, భవిష్యత్తు వృద్ధి దిశగా ఉపగ్రహ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ సహా అంతరిక్ష వ్యవస్థల వ్యూహాత్మక ప్రాముఖ్యాన్ని మేం గుర్తించాం. తదనుగుణంగా వేగంగా ముంచుకొస్తున్న, నానాటికీ పెరుగుతున్న అత్యాధునిక సైబర్ ముప్పులను నిరోధించడంలో ఈ సమగ్ర మార్గదర్శకాలు తోడ్పడతాయి. ఈ మేరకు ఉపగ్రహ నెట్‌వర్క్‌, గ్రౌండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అంతరిక్ష సంబంధిత సరఫరా వ్యవస్థలు, జాతీయ అంతరిక్ష సంపద రక్షణ కోసం అన్ని రకాల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ ఏకీకృత, భవిష్యత్తు-దార్శనిక చట్రం రూపకల్పనకు దోహదం చేస్తాయి.

అనంతరం ‘ఎస్‌ఐఏ-ఇండియా’ ప్రెసిడెంట్‌ డాక్టర్ సుబ్బారావు పావులూరి ప్రసంగిస్తూ- “ఏ రంగంలోనైనా సైబర్ పునరుత్థాన సామర్థ్య బలోపేతానికి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం సహా పరిగణనీయ పారిశ్రామిక సంస్థల అభిప్రాయాలు కీలకం. ఈ మేరకు ‘సెర్ట్‌-ఇన్‌’, ‘ఎస్‌ఐఏ-ఇండియా’ జారీ చేసిన ఈ సంయుక్త మార్గదర్శక పత్రం సమగ్ర, సహకార విధానాన్ని ప్రతిబింబిస్తోంది. పారిశ్రామిక రంగ దృక్కోణాన్ని నిశిత సైబర్ భద్రత నైపుణ్యంతో ‘సెర్ట్‌-ఇన్‌’ అనుసంధానిస్తుంది. తద్వారా భారత అంతరిక్ష రంగ సైబర్ భద్రత స్థితిగతులను కొనసాగించడంలోనే కాకుండా ముంచుకొస్తున్న డిజిటల్ ముప్పులను ఎదుర్కొనేలా సంసిద్ధతకు ఉత్తేజమివ్వడంలో ఈ మార్గదర్శకాలను ఓ కీలక మలుపుగా పరిగణించవచ్చు” అని పేర్కొన్నారు.

‘ఎస్‌ఐఏ-ఇండియా’ డైరెక్టర్ జనరల్ శ్రీ అనిల్ ప్రకాష్ మాట్లాడుతూ- “జాతీయ అంతరిక్ష వ్యవస్థ విస్తరిస్తున్న నేపథ్యంలో సైబర్ భద్రత మరింత పరిణామశీలం కావాల్సిన అవసరం ఎంతయినా ఉంది. ఈ మేరకు తదుపరి సాంకేతికతపై సాలోచన స్థాయి నుంచి భద్రతకు పరిపూర్ణ హామీ దిశగా కీలక స్తంభాల్లో ఒకటిగా సైబర్‌ భద్రత రంగం ముందడుగు వేయాలి. ఈ నేపథ్యంలో ఉపగ్రహాలు, క్షేత్రస్థాయి మౌలిక సదుపాయాలు, సరఫరా వ్యవస్థలలో పునరుత్థానాన్ని ‘సెర్ట్‌-ఇన్‌’తో మేం సంయుక్తంగా రూపొందించిన ఉమ్మడి చట్రం సంస్థాగతీకరిస్తుంది. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ వేళ 1.5 మిలియన్లకు పైగా సైబర్ దాడి ప్రయత్నాలు నమోదయ్యాయి. అలాగే, ప్రభుత్వ నెట్‌వర్క్‌లపై దాడులు దాదాపు 7 రెట్లు పెరిగాయి. ఇటువంటి ప్రమాదకర పరిస్థితుల నడుమ కీలక మౌలిక సదుపాయాలతోపాటు పారిశ్రామిక రంగం కూడా దుర్బల స్థితిలో ఉంటుంది. అందువల్ల సానుకూల నమూనాలపై ఆధారపడటమే కాకుండా ముంచుకొస్తున్న ముప్పులు, సాంకేతిక ప్రగతికి ప్రతిస్పందనగా పారిశ్రామి రంగంతో సంప్రదింపుల ద్వారా ఈ మార్గదర్శకాలు కాలానుగుణంగా మెరుగవుతాయి. మరోవైపు సురక్షిత డిజైన్ల రూపకల్పన విధానాలతోపాటు జాతీయ భద్రతకు తగినట్లుగా ఆవిష్కరణల రూపకల్పనపై పరిశ్రమ దృష్టి సారించాల్సి ఉంది” అని స్పష్టం చేశారు.

సెర్ట్-ఇన్:

సైబర్‌ ముప్పు సంఘటనలపై సకాలంలో ప్రతిస్పందించే జాతీయ సంస్థగా ‘ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం’ (సెర్ట్‌-ఇన్‌)ను ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2000లోని సెక్షన్ 70బి కింద కేంద్ర ఎలక్ట్రానిక్స్-సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సైబర్ భద్రత ముప్పు సంఘటనలపై సకాలంలో ప్రతిస్పందించేందుకు వీలుగా ‘సెర్ట్‌-ఇన్‌’ 24 గంటలూ పనిచేసే ‘హెల్ప్ డెస్క్‌’ను నిర్వహిస్తుంది. ముప్పుల నివారణ-ప్రతిస్పందన సేవలు సహా భద్రత నాణ్యత నిర్వహణ సేవలను కూడా ఈ విభాగం అందిస్తుంది.

‘ఎస్ఐఏ-ఇండియా’

దేశంలో అంతరిక్ష పరిశ్రమ ప్రయోజనాలకు ఉద్దేశించిన లాభాపేక్ష రహిత సంస్థ ‘ఎస్ఐఏ-ఇండియా’. ఈ సంస్థలో ఉపగ్రహ నిర్వహకులు, తయారీదారులు, సరఫరాదారులు, అంకుర సంస్థలు, విద్యా సంస్థలు, న్యాయ సంస్థలు కూడా సభ్యులుగా ఉన్నాయి. ఈ పరిశ్రమ గళంగా పని చేయడమే కాకుండా విధాన రూపకల్పన, నియంత్రణ సంస్థలకు పరిశ్రమ ప్రయోజనాలపై సూచనలు ఇస్తూంటుంది. అలాగే, అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఏర్పరచుకోగల వేదికగా ప్రభుత్వంతో సంధానానికి దోహదం చేస్తుంది.

సంయుక్త మార్గదర్శకాలను దిగువ చిరునామాలో చూడవచ్చు:

 

***


(రిలీజ్ ఐడి: 2233274) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Tamil