ఔషధాల విభాగం
‘‘ప్రపంచ ఫార్మసీ’’ నుంచి ‘‘అంతర్జాతీయ ఆవిష్కరణల కేంద్రం’’గా మారుతున్న భారత్: కేంద్ర మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా
నాడు పోస్టు చేయడమైనది:
23 FEB 2026 6:11PM by PIB Hyderabad
‘ప్రపంచానికి ఫార్మసీ’గా గుర్తింపు పొందిన భారత్ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘ప్రపంచ ఆవిష్కర్త’గా రూపాంతరం చెందుతోందని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా అన్నారు. ముంబయిలో జరిగిన గ్లోబల్ ఫార్మాసూటికల్ క్వాలిటీ 11వ సదస్సులో వీడియో సందేశం ద్వారా ఆయన ప్రసంగించారు. ఆరోగ్య సేవల భద్రత, తయారీ రంగంలో స్థిరత్వం, శాస్త్రీయ నైపుణ్యాలపై సారించిన బలమైన దృష్టితో ఈ మార్పు కొనసాగుతుందన్నారు.
అంతర్జాతీయ ఫార్మాసూటికల్ రంగంలో పెరుగుతున్న భారత్ నాయకత్వ ప్రాధాన్యం గురించి, నాణ్యత, ఆవిష్కరణ, ఆరోగ్య సేవల భద్రతలో దేశానికున్న నిబద్ధత గురించి మంత్రి వివరించారు. విస్తరణతోనే కాకుండా నాణ్యత, విశ్వసనీయత, ఆవిష్కరణ ద్వారా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలను భారత్ నడిపించాలన్నారు.
ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాల గురించి శ్రీ నడ్డా ప్రస్తావించారు. ఈ మార్పు భారతదేశ విధాన వ్యవస్థకు అనుగుణంగా ఉందని తెలియజేశారు. రూ.10,000 కోట్ల అంచనాతో ప్రారంభించిన బయోఫార్మా శక్తి పథకం.. అంతర్జాతీయ బయోఫార్మాసూటికల్ తయారీ కేంద్రంగా భారత్‌ను నిలబెడుతుందని, దేశీయంగా ఉత్పత్తిని బలోపేతం చేస్తుందని. పరిశోధనా సామర్థ్యాన్ని విస్తరిస్తుందన్నారు. అలాగే పీఆర్ఐపీ (ఫార్మా మెడ్‌టెక్‌లో పరిశోధన, ఆవిష్కరణకు ప్రోత్సాహం) పథకం గురించి కూడా ఆయన వివరించారు. ఈ పథకం కొత్త ఔషధాల ఆవిష్కరణను, సంక్లిష్ట జనరిక్స్, టీకాలు, అధునాతన వైద్య సాంకేతికతలను ప్రోత్సహిస్తుందని వెల్లడించారు.
ప్రిడిక్టివ్ డయాగ్నస్టిక్స్‌ను బలోపేతం చేయడం, ఫార్మాసూటికల్ ట్రేసబిలిటీ, ఫార్మకోవిజిలెన్స్లో సాంకేతికతలను, మొత్తం నాణ్యతా వ్యవస్థలను బలోపేతం చేయడంలో బాధ్యతాయుతమైన కృత్రిమ మేధ వినియోగ పాత్రను శ్రీ నడ్డా వివరించారు. నాణ్యతను నిర్దేశిత ప్రమాణంగా కాకుండా సంస్థాగత విలువగా మార్చుకోవాలని పారిశ్రామిక భాగస్వాములకు పిలుపునిచ్చారు. సుస్థిరమైన ‘నాణ్యతే ప్రధానం’గా ఉన్న వ్యవస్థను నిర్మించడానికి మానవ వనరులు, వ్యవస్థలు, మౌలిక వసతుల్లో పెట్టుబడిని కొనసాగించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు.
నమ్మకంతో స్థాయిని, సహకారంతో ఆవిష్కరణను, బాధ్యతతో వృద్ధిని మిళితం చేసే ఫార్మాసూటికల్ రంగంలో ప్రపంచ అగ్రగామిగా ఎదగాలని, తద్వారా ప్రపంచ ఆరోగ్య సంరక్షణ ఫలితాలకు గణనీయంగా దోహదపడాలనే భారతదేశం దార్శనికతను మంత్రి పునరుద్ఘాటించారు.
***
(రిలీజ్ ఐడి: 2232310)
సందర్శకుల సూచీ సంఖ్య : : 47