కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సవరించిన భారత్‌నెట్ కార్యక్రమాన్ని త్వరితగతిన ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డిజిటల్ భారత్ నిధి మధ్య కుదిరిన సహకార ఒప్పందం
కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎమ్. సింధియా, కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్ర శేఖర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడుల సమక్షంలో మెమొరాండంపై సంతకాలు
ఆంధ్రప్రదేశ్‌లో అమలుకు రూ.2,432 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ టెలికాం మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతో పాటు వాటి స్థాయిని పెంచనున్న భాగస్వామ్యం
నాడు పోస్టు చేయడమైనది:
23 FEB 2026 11:51AM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాలను పటిష్ఠపరిచే దిశగా ఒక ముఖ్య పరిణామం చోటుచేసుకొంది. సవరించిన భారత్‌నెట్ ప్రోగ్రామ్ (ఏబీపీ)ని రాష్ట్రంలో త్వరితగతిన అమలు చేయడానికి ఉద్దేశించిన సహకార మెమొరాండం (ఎంఓసీ)పై కేంద్ర ప్రభుత్వ కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని టెలికమ్యూనికేషన్ల విభాగానికి చెందిన డిజిటల్ భారత్ నిధి (డీబీఎన్)కీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్య సంతకాలయ్యాయి.
మెమొరాండంపై గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో ఈ రోజు (2026 ఫిబ్రవరి 22)న సంతకాలయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు, కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ, ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎమ్. సింధియా, కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్ర శేఖర్‌ల సమక్షంలో నిర్వహించారు.
సహకార ప్రధాన మెమొరాండంపై డిజిటల్ భారత్ నిధి అడ్మినిస్ట్రేటర్, శ్రీ శ్యామల్ మిశ్రా, ఐఏఎస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలు, పెట్టుబడి విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ మొవ్వా తిరుమల కృష్ణబాబు, ఐఏఎస్‌లు సంతకాలు చేశారు.
భారత్‌నెట్ (BharatNet) కార్యక్రమ ప్రాముఖ్యం, విస్తృతిల గురించి మంత్రి శ్రీ సింధియా చెబుతూ, ‘‘సవరించిన భారత్‌నెట్ 16.9 బిలియన్ డాల ర్లు... అంటే రూ.1,39,000 కోట్ల ఖర్చుతో కేంద్ర ప్రభుత్వం నిధులను అందిస్తున్న కార్యక్రమం. దీనిలో భాగంగా ఓఎఫ్‌సీ ఫైబరుతో పాటు బ్రాడ్‌బ్యాండును దేశంలో ప్రతి ఒక్క గ్రామానికీ చేర్చుతారు’’ అని తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు చేసిన పనులకు నడుంకట్టే ధైర్య సాహసాలు ప్రపంచంలో మరే దేశానికీ లేవు అని మంత్రి అన్నారు.
‘‘మేం చేస్తున్న పనుల సారాంశం సాంకేతిక విజ్ఞానాన్ని అందరి చెంతకూ తీసుకుపోవడమే. మన తరంలో వ్యక్తిగత సత్తా, ప్రతిభ, మహత్త్వాకాంక్ష, ఆకాంక్ష.. వీటన్నింటికీ ప్రపంచ రంగస్థలం మీదకు చేరుకొనే సామర్థ్యాన్ని అందిస్తోంది నిజానికి సాంకేతిక విజ్ఞానమే’’ అని కూడా మంత్రి శ్రీ సింధియా అన్నారు.
డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్రం నాయకత్వం వహించే నమూనాలో భాగంగా శీఘ్ర కార్యాచరణ కోసం నిర్మాణాత్మకమైన, మన్నిక కలిగిన విధానం ఈ మెమొరాండం అందిస్తుందనీ, దీనిలో ఆర్థిక సహాయం, జవాబుదారుతనం రెండూ కలిసుంటాయన్నారు. ఈ భాగస్వామ్యం చివరి బిందువు వరకూ కనెక్టివిటీనీ బలోపేతం చేయడంతో పాటు 4జీ కవరేజీని విస్తరింపచేస్తుందనీ, గ్రామీణ పౌరులకు చౌకగా విశ్వసనీయ డిజిటల్ సేవల్ని అందిస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఈ మెమొరాండంపై సంతకాలు పూర్తి కావడం రాష్ట్రంలో డిజిటల్ పరివర్తనలో ఓ కీలక మలుపు అన్నారు. ఇది సాంకేతిక విజ్ఞానాధారిత పాలన, సమ్మిళిత అభివృద్ధి.. ఈ రెండింటి విషయంలో నిబద్ధతను పటిష్ఠపరుస్తుందని ఆయన తెలిపారు. బ్రాడ్‌బ్యాండ్ నిరంతరాయంగా అందుబాటులోకి రావడం వల్ల గ్రామీణ ప్రజలకు సాధికారిత దక్కుతుందనీ, విద్యతో పాటు ఆరోగ్య సంరక్షణ సేవలు మెరుగుపడతాయనీ, అత్యాధునిక డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన రంగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి స్థానంలోకి వెళ్తుందనీ ఆయన వివరించారు.
సవరించిన భారత్‌నెట్ కార్యక్రమాన్ని శరవేగంగా అమలుపరచడానికి ఈ మెమొరాండం డీబీఎన్ (డిజిటల్ భారత్ నిధి)కీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్య సహకార పూర్వక విస్తృత ప్రణాళికను ఏర్పరుస్తుంది. మెమొరాండంలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం సత్వర అమలుకు అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తుంది. దీనిలో రైట్ ఆఫ్ వే (ఆర్ఓడబ్ల్యూ), మౌలిక సదుపాయాల లభ్యతలతో పాటు అవసరమైన సమన్వయపూర్వక సహకారం కలిసి ఉంటాయి. ప్రాజెక్టుకు కావలసిన ఆర్థిక సహాయాన్ని, విశేషించి డిజిటల్ భారత్ నిధి తో అందించనున్నారు. దీంతో పాటు, పరస్పర అంగీకారానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తన వంతు తోడ్పాటును అందిస్తుంది. కార్యక్రమంలో భాగంగా నిర్మించే నెట్‌వర్కును.. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సామాజిక, ఆర్థిక ప్రభావాన్ని వీలయినంత ఎక్కువ మేరకు ప్రసరింప చేసేందుకు తగిన విధంగా ఉపయోగించుకుంటారు.
సవరించిన భారత్‌నెట్ కార్యక్రమానికి 2023 ఆగస్టు 4న కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే పనిచేస్తున్న భారత్‌నెట్ నెట్‌వర్కు స్థాయిని పెంచి, సుసంఘటితం చేయడంతో పాటు ఈసరికే సేవలను అందిస్తున్న భారత్‌నెట్ నెట్‌వర్కును విస్తరించడం కూడా ఈ కార్యక్రమం లక్ష్యం. అవసరాలను బట్టి అన్ని గ్రామ పంచాయతీలకూ, గ్రామాలకూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పక్కా బ్రాడ్‌బ్యాండ్ సంధానాన్ని అందించాలనేదే దీని ధ్యేయం.
భారత్‌నెట్ ఒకటో దశను సీపీఎస్‌యూ నమూనాలో మెస్సర్స్ పీజీసీఐఎల్ అమలు చేసింది. ఈ కార్యక్రమంలో 1,692 గ్రామ పంచాయతీలు భాగం అయ్యాయి. వాటికి అన్ని రకాల సేవల్నీ అందుబాటులోకి తీసుకు వచ్చారు. భారత్‌నెట్ రెండో దశను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) ద్వారా రాష్ట్రం నాయకత్వం వహిస్తున్న నమూనాలో భాగంగా అమలు పరిచారు. దీన్లో 11,254 గ్రామ పంచాయతీలు కలిసి ఉన్నాయి. వాటికి అన్ని విధాలైన సేవల్నీ అందుబాటులోకి తీసుకు వచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో సవరించిన భారత్‌నెట్ కార్యక్రమంలో భాగంగా, ఈ ప్రాజెక్టును కొత్తగా ఏర్పాటు చేసిన స్పెషల్ పర్పస్ వెహికిల్ ‘ఆంధ్రప్రదేశ్ భారత్‌నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్’ (ఏపీబీఐఎల్) ద్వారా అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమం పరిధిలోకి మొత్తం 13,426 గ్రామ పంచాయతీలు వస్తాయి. వీటిలో నెట్‌వర్క్ పటిష్ఠతను పెంచే ఉద్దేశంతో, ఒకటో దశలో 1,692 గ్రామ పంచాయతీలను లీనియర్ నుంచి రింగ్ టోపోలాజీ పద్ధతికి అప్ గ్రేడ్ చేస్తారు. రెండో దశలో 11,254 గ్రామ పంచాయతీలను కవర్ చేయడానికి తోడు, కొత్తగా ఏర్పాటు చేసిన 480 గ్రామ పంచాయతీలలోనూ ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. దీనికి అదనంగా, చివరి బిందువు వరకూ సంధానాన్ని బలపరచడం కోసం 3,942 గ్రామాల్లో అవసరాల ఆధారంగా కనెక్టివిటీని సమకూరుస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి రూ.2,432 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో అయిదు లక్షల కన్నా ఎక్కువ గ్రామీణ గృహాలకు ఫైబర్ కనెక్షన్ ఇవ్వడానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుందనీ, ఇది డిజిటల్ పాలనను చెప్పుకోదగిన స్థాయిలో మెరుగుపరుస్తుందనీ, పౌరులకు ఇప్పటి కన్నా ఎంతో విస్తృతంగా సేవలను అందిస్తుందనీ ఆశిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ, సుదూర ప్రాంతాల్లోనూ ఆన్‌లైన్ విద్య, డిజిటల్ చెల్లింపులు, ఈ-పరిపాలన, టెలీమెడిసిన్ సేవల లభ్యత పెరుగుతాయి.
సమాజంలో అన్ని వర్గాల వారికీ డిజిటల్ సేవలను అందించడంతో పాటు టెలికమ్యూనికేషన్స్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాలను దృఢతరంగా మార్చడాన్ని కూడా వేగవంతం చేయాలనీ, తద్వారా జ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థనీ, డిజిటల్ రంగంలో సాధికారిత కలిగిన సమాజాన్నీ ఆవిష్కరించే దిశగా ముందడుగు వేసే విషయంలో కేంద్ర ప్రభుత్వ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉమ్మడి నిబద్ధతకు ఈ మెమొరాండంపై సంతకాల కార్యక్రమం అద్దం పడుతోంది.
మరింత సమాచారం కోసం ఈ కింది డీఓటీ హ్యాండిళ్లను సందర్శించవచ్చు: -
ఎక్స్ - https://x.com/DoT_India
ఇన్‌స్టా- https://www.instagram.com/department_of_telecom?igsh=MXUxbHFjd3llZTU0YQ==
ఫేస్‌బుక్ - https://www.facebook.com/DoTIndia
యూట్యూబ్: https://youtube.com/@departmentoftelecom?si=DALnhYkt89U5jAaa
***
(రిలీజ్ ఐడి: 2231894)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6