ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఔషధ, వైద్య ఉత్పత్తుల నియంత్రణలో సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్ - బ్రెజిల్ మధ్య అవగాహనా ఒప్పందం

నాడు పోస్టు చేయడమైనది: 21 FEB 2026 6:57PM by PIB Hyderabad

భారత్, బ్రెజిల్ దేశాలు ఔషధ, వైద్య ఉత్పత్తుల నియంత్రణ రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఈ రోజు ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత్ కు చెందిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) బ్రెజిలియన్ హెల్త్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఏఎన్వీఐఎస్ఏ) మధ్య కుదిరిన ఈ అవగాహన ఒప్పందం ఇరు దేశాల మధ్య నియంత్రణ పరమైన సహకారాన్ని మరింత లోతుగా పటిష్టం చేసే దిశగా ఒక అత్యంత కీలకమైన అడుగు. ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్‌లో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా ద సిల్వా ల సమక్షంలో ఈ చారిత్రాత్మక అవగాహన ఒప్పందం పత్రాలను ఏఎన్వీఐఎస్ఏ డైరెక్టర్-ప్రెసిడెంట్ మిస్టర్ లియాండ్రో సఫాటిల్, బ్రెజిల్‌లో భారత రాయబారి శ్రీ దినేష్ భాటియా పరస్పరం అందజేసుకున్నారు.  

 

 

ఈ అవగాహన ఒప్పందం ఔషధ తయారీ పదార్థాలు , మందులు, జీవ సంబంధిత ఉత్పత్తులు, వైద్య పరికరాలతో సహా వైద్య ఉత్పత్తుల రంగంలో సమాచార మార్పిడి, సహకారం కోసం ఒక వ్యవస్థీకృత ప్రణాళికను ఏర్పాటు చేస్తుంది. నియంత్రణ పద్ధతులలో ఏకరూపతను పెంపొందించడం, నియంత్రణ వ్యవస్థలపై పరస్పర అవగాహనను పెంచుకోవడం, వైద్య ఉత్పత్తులపై సమర్థవంతమైన, సమన్వయంతో కూడిన పర్యవేక్షణను సులభతరం చేయడం దీని లక్ష్యం.

 

తమ ప్రజలకు సురక్షితమైన, సమర్థవంతమైన, నాణ్యతతో కూడిన మందులు, వైద్య ఉత్పత్తులను అందుబాటులో ఉంచడంలో భారత్, బ్రెజిల్ దేశాల ఉమ్మడి నిబద్ధతను ఈ అవగాహన ఒప్పందం ప్రతిబింబిస్తుంది. ఈ ఒప్పందం సరఫరా శ్రేణులను బలోపేతం చేయడానికి, నియంత్రణ పరమైన ఉత్తమ పద్ధతులను ప్రోత్సహించడానికి, తక్కువ ధరల్లో వైద్య పరిష్కారాలు లభించేలా మద్దతునిస్తుందని భావిస్తున్నారు.

ఈ అవగాహన ఒప్పందం, ఆరోగ్య రంగంలో భారత్, బ్రెజిల్ మధ్య ఉన్న విస్తృత సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా, ద్వైపాక్షిక సంబంధాల కోసం ఇప్పటికే ఉన్న సంస్థాగత యంత్రాంగాలకు ఇది అదనపు బలాన్ని చేకూరుస్తుంది. ఆరోగ్యం, ఫార్మాస్యూటికల్స్, వైద్య సాంకేతిక రంగాలలో ఇరు దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యాన్ని ఇది స్పష్టం చేస్తుంది. ముఖ్యంగా, అభివృద్ధి చెందుతున్న (గ్లోబల్ సౌత్) దేశాలలో లప్రధాన భాగస్వాములుగా, ఇరు దేశాల ఉమ్మడి ప్రాధాన్యతలకు ఇది అద్దం పడుతోంది..

 

 

ఈ అవగాహన ఒప్పందం ద్వారా రెండు దేశాలు తమ జాతీయ చట్టాలు, నిబంధనలకు లోబడి సమాచార మార్పిడి, నియంత్రణ సామర్థ్య పెంపుదల, ఔషధ, వైద్య ఉత్పత్తుల నియంత్రణకు సంబంధించిన విషయాలలో సన్నిహితంగా పనిచేయాలనే తమ ఉద్దేశాన్ని పునరుద్ఘాటించాయి.

 

ఈ అవగాహన ఒప్పందం భారత్-బ్రెజిల్ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని, ఆరోగ్య, ఫార్మా రంగాలో కొత్త సహకార మార్గాలను తెరుస్తుందని భావిస్తున్నారు. అంతిమంగా ఇది రెండు దేశాలలో ప్రజారోగ్య ఫలితాలను మెరుగుపరచడంలో దోహదపడుతుంది.

***


(రిలీజ్ ఐడి: 2231386) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी