ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఏఐ యుగం కోసం శ్రామిక శక్తిని సిద్ధం చేస్తున్న భారత్ ప్రయత్నాలతో చిప్ డిజైన్ రంగానికి ఊపు: శ్రీ అశ్వినీ వైష్ణవ్
ఏఐ యుగం కోసం డీప్-ఎండ్ సెమీకండక్టర్ ప్రతిభను నిర్మిస్తున్న భారత్
2026లో ఉత్పత్తిని ప్రారంభించనున్న 4 సెమీకండక్టర్ ప్లాంట్లు
డిజైన్ నాయకత్వం నుంచి తయారీ స్థాయి వరకు... ఏఐ, సెమీకండక్టర్ మిషన్‌లకు ఊతమిస్తున్న భారత్: ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్
నాడు పోస్టు చేయడమైనది:
20 FEB 2026 8:49PM by PIB Hyderabad
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026లో భాగంగా నిర్వహించిన "సెమీకండక్టర్ వర్క్‌ఫోర్స్ ఇన్ ది ఏజ్ ఆఫ్ ఏఐ" సమావేశం... నైపుణ్యాభివృద్ధిని భారత కృత్రిమ మేధ ఆశయాలు, సెమీకండక్టర్ తయారీ ప్రణాళికల మధ్య నిర్ణయాత్మక అనుసంధానంగా స్పష్టం చేసింది. ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థల నాయకులను ఒకచోట చేర్చిన ఈ సమావేశం... భారత సెమీకండక్టర్ ప్రయాణ తదుపరి దశ పెరుగుతున్న నైపుణ్య కార్యక్రమాలపై కాకుండా... తయారీ వ్యవస్థ, విస్తరిస్తున్న పరికర భౌతిక శాస్త్రం, ప్రక్రియల ఏకీకరణ, అధునాతన తయారీ వ్యవస్థల గురించి లోతైన, సమగ్ర అవగాహనను కలిగించడంపైనే ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడింది.
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ తన ముఖ్యోపన్యాసంలో... ప్రపంచస్థాయిలో సమర్థమైన సెమీకండక్టర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం... ఏఐ సంస్థలు, ఏఐని వినియోగించే సంస్థలు సృష్టించే విలువ విషయంలో భారత్ దీర్ఘకాలిక స్థానాన్ని బలోపేతం చేయడం కోసం జాతీయ దృక్పథాన్ని వివరించారు. "అస్సాం నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు, కేరళ నుంచి తమిళనాడు వరకు దేశంలోని అన్ని ప్రాంతాల విద్యార్థులు ఇప్పుడు స్వయంగా చిప్‌లను రూపొందిస్తున్నారు. ఈ ఏఐ-ఆధారిత మేధస్సు యుగంలో సెమీకండక్టర్లు మన సాంకేతిక నిర్మాణంలో అత్యంత కీలక భాగంగా ఉంటాయి. ఈ సామర్థ్యం రాబోయే చాలా ఏళ్ల దాకా దేశానికి ప్రధాన బలం అవుతుంది" అని ఆయన అన్నారు.
ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్. కృష్ణన్ మాట్లాడుతూ... ఇండియా ఏఐ మిషన్, ఇండియా సెమీకండక్టర్ మిషన్‌ల వ్యూహాత్మక కలయికను ప్రధానంగా ప్రస్తావించారు. డిజైన్ నాయకత్వం నుంచి తయారీ స్థాయికి మారవలసిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు. "ఈ సమావేశం ఇండియా ఏఐ మిషన్, ఇండియా సెమీకండక్టర్ మిషన్ వంటి భారత ప్రధాన మిషన్ల కలయికను ప్రతిబింబించింది. సెమీకండక్టర్ల రంగానికి ఏఐ కేంద్రంగా ఉన్న విధంగానే ఏఐ రంగానికీ సెమీకండక్టర్లు కేంద్రంగా ఉన్నాయి. ఈ రంగాల్లో భారత్ నమ్మకమైన, దీర్ఘకాలిక భాగస్వామిగా ఉండటానికి... అధునాతన తయారీలో అగ్రగామిగా మారడానికి... ప్రపంచంలోని సెమీకండక్టర్ డిజైన్ రంగంలో 20 శాతంగా ఉన్న తోడ్పాటుకు మించి ముందుకు సాగడం చాలా ముఖ్యం. దేశవ్యాప్తంగా 10 ప్రధాన సెమీకండక్టర్ ప్లాంట్ల ఏర్పాటుకు మేం ఇప్పటికే కట్టుబడి ఉన్నాం. 2026లో వీటిలో కనీసం నాలుగు ప్లాంట్లు ఉత్పత్తిని ప్రారంభిస్తాయి, మిగిలినవీ త్వరలోనే వస్తాయి. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 దేశీయ సెమీకండక్టర్ పరికరాల తయారీ సహా మొత్తం వ్యవస్థపై దృష్టి సారిస్తుంది." అని వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత జరిగిన ప్యానెల్ చర్చలో శ్రామిక శక్తి అభివృద్ధిని శిక్షణ సమస్యగా కాకుండా వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాలుగా పునర్నిర్మించారు. అత్యంత కచ్చితత్వం, సుదీర్ఘ అభ్యసన ప్రక్రియలతో నిర్వచించే ఈ పరిశ్రమలో నిర్ధిష్ట పరిమిత నైపుణ్యాల సముపార్జన సరిపోదని వక్తలు స్పష్టం చేశారు. సాధనాలు పనిచేసే విధానాన్ని మాత్రమే కాకుండా తయారీ వ్యవస్థలోని ప్రక్రియలన్నింటి గురించి అవగాహన కలిగిన ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల తరం ఈ రంగానికి అవసరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో లామ్ రీసెర్చ్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ ఫ్రైడ్, డీజీఏ గ్రూప్ భాగస్వామి పాల్ ట్రియోలో, ఐఐఎస్‌సీలోని సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ సౌరభ్ చందోర్కర్ తదితరులు పాల్గొన్నారు. మానవ మూలధనం భారత సెమీకండక్టర్ రంగ విస్తరణ వేగాన్ని, విశ్వసనీయతను నిర్ణయిస్తుందనే సమష్టి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు.
ప్రపంచ సెమీకండక్టర్ తయారీ కేంద్రాలు గత ఐదు నుంచి ఏడు దశాబ్దాల్లో తమ సామర్థ్యాలను పెంచుకున్నప్పటికీ... భారత్ ఆ ప్రయాణాన్ని చాలా తక్కువ కాలపరిమితిలోనే పూర్తి చేయడానికి ప్రయత్నిస్తోందని పరిశ్రమ ప్రముఖులు గుర్తించారు. విద్యాసంస్థలు, పరికరాల తయారీదారులు, తయారీ కేంద్రాల మధ్య బలమైన సమగ్ర సహకారం ద్వారా పాఠ్యాంశాలు, పరిశోధన, ఆచరణాత్మక శిక్షణను వాస్తవ ఉత్పత్తి వ్యవస్థలకు అనుగుణంగా ఉంచడం ద్వారా మాత్రమే ఈ వేగం సాధ్యమవుతుందని వారు వాదించారు.
ఈ రంగానికి ఐఐఎస్‌సీ "సెమీఫస్ట్" సహకారాన్ని ఈ విధానం కోసం ఒక కార్యాచరణ నమూనాగా వారు పేర్కొన్నారు. సిమ్యులేషన్-ఆధారిత అభ్యసనాన్ని ప్రెజర్ గేజ్ సిస్టమ్‌లు, పీ-ఐడీ అభివృద్ధి వంటి వాస్తవ తయారీ వ్యవస్థ విభాగాల గురించిన ప్రత్యక్ష అవగాహనతో అనుసంధానించడం ద్వారా ఈ కార్యక్రమం విద్యార్థులను పరిమిత బాధ్యతలు గల పాత్రకు బదులుగా ఆధునిక సెమీకండక్టర్ తయారీ కార్యాచరణ సంక్లిష్టతల కోసం సంపూర్ణంగా సిద్ధం చేస్తుంది.
పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య సమన్వయం కీలక మలుపు దశకు చేరుకుందని చర్చా భాగస్వాములు గమనించారు. తొలిసారిగా ప్రతిభ అభివృద్ధి దీర్ఘకాలిక ఆకాంక్షగా లేదు... తక్షణ వ్యాపారం, జాతీయ ప్రాధాన్యంగా ఉంది. రాబోయే తయారీ ప్లాంట్ల విజయం, భారత విస్తృత సాంకేతిక లక్ష్యాలు... బలమైన, పరిశ్రమ కోసం సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని రూపొందించడంపైనే ఆధారపడి ఉంటాయి.
ఏఐ యుగంలో సెమీకండక్టర్ సామర్థ్యాన్ని కేవలం మౌలిక సదుపాయాల ద్వారా మాత్రమే నిర్వచించలేమని చర్చ తీర్మానించింది. దానిని నడిపించే లోతైన జ్ఞానమే దానిని నిర్వచిస్తుంది. ఆ స్థాయిలో సామర్థ్యాలను పెంపొందించడం... ప్రపంచ విశ్వసనీయ తయారీ, సాంకేతిక భాగస్వామిగా భారత్ ఆవిర్భావానికి కేంద్రంగా ఉంటుంది.
(రిలీజ్ ఐడి: 2231324)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2