ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
భారతదేశంలో సమ్మిళిత స్వర సాంకేతికతల పురోగతి: విధాన నివేదిక, డెవలపర్స్ టూల్‌కిట్ ఆవిష్కరణ
నాడు పోస్టు చేయడమైనది:
21 FEB 2026 1:05PM by PIB Hyderabad
భారతదేశంలో డిజిటల్ సమ్మిళితత్వానికి స్వర సాంకేతికతలు (వాయిస్ టెక్నాలజీ) మూలస్తంభాలుగా మారుతున్నాయి. కోట్లాది మంది ప్రజలు ప్రభుత్వ సేవలు, సమాచారం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థను పొందే విధానాన్ని ఇవి తీర్చిదిద్దుతున్నాయి. ఈ నేపథ్యంలో 2026 ఫిబ్రవరి 20న 'ఇండియా ఏఐ సదస్సు ఎక్స్‌పో 2026'లో స్వర సాంకేతికతలపై కొత్త 'విధాన నివేదిక', 'డెవలపర్స్ టూల్‌కిట్'ను ఆవిష్కరించారు. పారదర్శక, సమ్మిళిత, బాధ్యతాయుతమైన స్వర సాంకేతికతలకు మద్దతు ఇచ్చేలా ఒక విధానపరమైన ఆచరణాత్మక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడం ఈ నివేదిక ప్రధాన లక్ష్యం.
ఈ విధాన నివేదిక, డెవలపర్స్ టూల్‌కిట్‌లను ఐఐఎస్‌సీకి చెందిన ఆర్ట్‌పార్క్, డిజిటల్ ఫ్యూచర్స్ ల్యాబ్, ట్రైలీగల్ సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి. వీటికి భాషిణి, ఫేర్ ఫార్వర్డ్– ఏఐ ఫర్ ఆల్ కార్యక్రమాలు మద్దతు లభించింది. జర్మనీ దేశ ఆర్థిక సహకారం- అభివృద్ధి మంత్రిత్వ శాఖ (బీఎంజెడ్) నిధులతో జీఐజెడ్ (జర్మన్ డెవలాప్‌మెంట్ కోఆపరేషన్) ఈ ప్రాజెక్టును అమలు చేసింది. భారత్‌లో బాధ్యతాయుతమైన స్వర సాంకేతికతలను ప్రోత్సహించేందుకు పరిశోధన, సాంకేతిక నైపుణ్యం, వ్యవస్థల మధ్య సహకారాన్ని పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం.
భారత్ వంటి విభిన్న భాషలు కలిగిన దేశంలో స్వర సాంకేతికతలు 'డిజిటల్ ప్రజా మౌలికసదుపాయాల్లో ' కీలకమైన భాగం. ఇవి మాటల ఆధారిత అప్లికేషన్ల ద్వారా సామాన్యులు డిజిటల్ సేవలను పొందటాన్ని మరింత సులభతరం చేస్తాయి. అయితే ఈ స్వర సాంకేతికలను అభివృద్ధి చేయడం, అమలు చేయడం వల్ల సమాచార నిర్వహణ, సమ్మిళితత్వం, పారదర్శకత, నాణ్యత, బాధ్యతాయుతమైన వినియోగం వంటి అంశాలపై అనేక క్లిష్టమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ సవాళ్లను పరిష్కరించాలంటే విధానపరమైన ఫ్రేమ్‌వర్క్‌లు, సాంకేతిక పద్ధతులు, వ్యవస్థల సమన్వయం వంటి అంశాల్లో సరైన అనుసంధానం అవసరం.
ఈ విధాన నివేదిక భారత్‌లో పారదర్శక, బాధ్యతాయుతమైన స్వర వ్యవస్థల నిర్మాణంలో ఎదురవుతున్న కీలక అడ్డంకులను విశ్లేషిస్తుంది. ఇందులో డేటా సేకరణ, మోడల్ అభివృద్ధి నుంచి మౌలిక సదుపాయాలు, పరిపాలన పద్ధతుల వరకు అన్ని అంశాలు ఉన్నాయి. ప్రాథమిక స్వర డేటాసెట్‌లను 'డిజిటల్ పబ్లిక్ గుడ్స్'గా పరిగణించడం, ఏఐ మోడళ్లలో పారదర్శకత- అన్ని వర్గాల ప్రాతినిధ్యాన్ని పెంచడం, సుస్థిర ప్రజా మౌలికసదుపాయాలపై పెట్టుబడులు పెట్టడం, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే సాంకేతికత దుర్వినియోగం కాకుండా తగిన రక్షణ చర్యలను ఏర్పాటు చేయడంతో సహా స్వర-సాంకేతికత వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇది నిర్దిష్ట విధానపరమైన సిఫార్సులను ప్రతిపాదిస్తోంది.
విధాన విశ్లేషణకు ఈ 'డెవలపర్స్ టూల్‌కిట్' అదనపు బలాన్ని చేకూరుస్తుంది. భారతీయ భాషల స్వర డేటాసెట్‌లతో పనిచేసేటప్పుడు, స్వర అప్లికేషన్‌లను రూపొందించేటప్పుడు డెవలపర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లపై ఇది పనిచేస్తుంది. అసమాన డేటా ప్రాతినిధ్యం, నాణ్యత హామీ విషయంలో బలహీనమైన యంత్రాంగాలు, పరిమితమైన మూల్యాంకన (ఎవల్యూషన్) పద్ధతులు, విచ్ఛిన్నంగా ఉన్న ప్రభుత్వ యంత్రంగంతో సహా భారతదేశపు స్వర, భాషా సాంకేతికల వ్యవస్థలో ఉన్న నిర్మాణాత్మక లోపాలను ఇది గుర్తించింది. సాంకేతిక అభివృద్ధి ప్రక్రియలోని వివిధ దశల్లోనే ప్రత్యేకమైన ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గుర్తిస్తూ ఈ టూల్‌కిట్.. ఒక 'అంచలపరమైన పూర్తి జీవిత కాల' విధానాన్ని పరిచయం చేస్తోంది. దీని ద్వారా సమ్మిళిత, పటిష్ఠమైన స్వర ఏఐ వ్యవస్థలను తయారుచేయొచ్చు. ఒక డిజిటల్ ఉత్పత్తి విషయంలో ఆలోచన నుంచి దాని ఉపయోగించటం వరకు ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడానికి ప్రస్తుతం భారత్‌లోని స్వర-సాంకేతికత రంగంలో అనుసరిస్తున్న ఆచరణాత్మక పద్ధతులను ఈ టూల్‌కిట్ వివరిస్తుంది.
“భారతదేశం 'స్వర ఆధారిత సేవలు ప్రథమం (వాయిస్ ఫస్ట్)’ డిజిటల్ వ్యవస్థ దిశగా వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో ఈ మార్పును బలమైన విధానపరమైన పునాదులు, ఆచరణాత్మక అమలు ఫ్రేమ్‌వర్క్‌లతో నిర్మించడం అత్యంత అవసరం. అపారమైన భాషా వైవిధ్యం ఉన్న మన దేశంలో స్వర సాంకేతికలు కేవలం ఒక ఆవిష్కరణ మాత్రమే కాదు.. అవి డిజిటల్ సమ్మిళితత్వానికి సాధనాలు. నేడు ఆవిష్కరించిన 'విధాన నివేదిక', 'డెవలపర్స్ టూల్‌కిట్' భారత్‌లో పారదర్శక, సమ్మిళిత, బాధ్యతాయుతమైన స్పీచ్ సాంకేతికతలను నిర్మించడానికి ఒక క్రమబద్ధమైన రోడ్‌మ్యాప్‌ను అందిస్తాయి. వ్యవస్థల మధ్య సమన్వయానికి విధానపరమైన సిఫార్సులు మార్గనిర్దేశం చేస్తే.. ఆ సూత్రాలను ఏఐ జీవన చక్రంలోని ప్రతి దశలోనూ అంటే డేటా సేకరణ, మోడల్ అభివృద్ధి నుంచి ఉపయోగం, నిర్వహణ వరకు ఆచరణాత్మక పద్ధతులుగా డెవలపర్స్ టూల్‌కిట్ మారుస్తుంది. స్వర సాంకేతికతలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ వాటి ప్రమాణాలు, మూల్యాంకన ఫ్రేమ్‌వర్క్‌లు, సాంకేతిక టూల్‌కిట్లు కూడా నిరంతరం మారుతూ ఉంటాయి. స్వర ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, బహుభాషా మద్దతును అందించేందుకు, పరస్పర మార్పు కోసం ప్రస్తుతం ఉన్న డిజిటల్, ఐటీ మౌలిక సదుపాయాలను వ్యవస్థాగతంగా తిరిగి పునర్నిర్మించాల్సి ఉంటుంది. వ్యవస్థలోని భాగస్వాములందరి సామూహిక కృషి ద్వారా భారత 'డిజిటల్ ప్రజా మౌలికసదుపాయాల్లో' స్వరాన్ని ఒక కీలకమైన పునాదిగా మార్చొచ్చు. తద్వారా భాషా పరమైన అక్షరాస్యత, డిజిటల్ అంతరాలను భారీ స్థాయిలో అధిగమించగలమని మేం విశ్వసిస్తున్నాం” - శ్రీ అమితాబ్ నాగ్, సీఈఓ, డిజిటల్ ఇండియా భాషిణి విభాగం.
"ఈ నివేదిక విధాన నిర్ణేతలు, సాంకేతిక నిపుణులకు ఉపయోగపడే అనేక ఉత్తమ పద్ధతులు, అనుభవంతో కూడిన పాఠాలతో నిండి ఉంది. డిజిటల్ సమ్మిళితత్వం పట్ల మాకున్న ఉమ్మడి దార్శనికతను ముందుకు తీసుకెళ్లడం, డిజిటల్ అంతరాలను తగ్గించడం బీఎంజెడ్ లక్ష్యం. ముఖ్యంగా అక్షరాస్యత తక్కువగా ఉన్నవారికి లేదా డిజిటల్ మౌలిక సదుపాయాలు తక్కువగా అందుబాటులో ఉన్న కోట్లాది మంది ప్రజలకు డిజిటల్ ప్రపంచంలోకి ప్రవేశించడానికి 'స్వరం' అత్యంత సహజమైన, శక్తిమంతమైన సాధనం. స్వర ఏఐ(వాయిస్ ఏఐ) అనేది స్థానిక భాషలు, మాండలికాల్లో పనిచేసినప్పుడు అది ప్రభుత్వ సేవలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, ఆర్థిక భాగస్వామ్యానికి ఒక ముఖద్వారంగా మారుతుంది"- డాక్టర్ అరియాన్ హిల్డెబ్రాండ్ట్, డైరెక్టర్ జనరల్, ప్రపంచ ఆరోగ్యం- అవకాశాల సమానత్వం- డిజిటల్ సాంకేతికతలు- ఆహార భద్రత విభాగం, జర్మనీ దేశ ఆర్థిక సహకారం- అభివృద్ధి మంత్రిత్వ శాఖ
భాషావేత్తలు, సాంకేతిక నిపుణులు, ఏఐ నైతికత నిపుణులతో జరిగిన వరుస చర్చల ద్వారా ఈ విధాన నివేదిక, డెవలపర్స్ టూల్‌కిట్‌ను రూపొందించారు. భారత్‌లో కమ్యూనికేషన్ అంతరాలను తొలగించడానికి.. భాషా పరమైన, డిజిటల్ అడ్డంకులను అధిగమించడానికి 'భాషిణి' చేపట్టిన 'స్వర ఆధారిత సేవలు ప్రథమం (వాయిస్ ఫస్ట్)’ అనే బహుభాషా పరిష్కారాల విస్తృత కార్యకలాపాల్లో ఇవి ఒక ముఖ్యమైన భాగంగా నిలుస్తుంది.
భాగస్వాముల వివరాలు:
భాషిణి-
భాషిణి అనేది ఏఐ ఆధారిత భాషా అనువాద వేదిక. ఇది అక్షరాస్యత, భాష, డిజిటల్ అంతరాలను తొలగిస్తుంది. 'స్వర ఆధారిత సేవలు ప్రథమం (వాయిస్ ఫస్ట్)’ అనే బహుభాషా పరిష్కారాల ద్వారా భాషతో పాటు సాంకేతికతను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావడం, సహకారం - ఆవిష్కరణలను ప్రోత్సహించే అతిపెద్ద 'కో-క్రియేషన్ ఏఐ ప్లాట్‌ఫాం'గా నిలవడం.. భాషా, అక్షరాస్యత, డిజిటల్ అడ్డంకులను తొలగించి అందరికీ సమాన అవకాశాలను కల్పించడంతో సహా వినూత్నమైన స్వర ఆధారిత బహుభాషా ఏఐ పరిష్కారాల ద్వారా భాషిణి సమాచార రంగాన్ని సరికొత్తగా మారుస్తోంది.
జీఐజెడ్, 'ఫేర్ ఫార్వర్డ్ - అందరికీ కృత్రిమ మేధ'-
జీఐజెడ్ (జర్మనీ సొసైటీ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్) అనేది అంతర్జాతీయ సహకార రంగంలో 50 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఒక జర్మన్ ప్రభుత్వ సంస్థ. జర్మనీ దేశ ఆర్థిక సహకారం, అభివృద్ధి మంత్రిత్వ శాఖ (బీఎంజెడ్) తరపున జీఐజెడ్ ‘ఫేర్ ఫార్వర్డ్ - అందరికీ కృత్రిమ మేధ’ అనే ప్రాజెక్టును అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఏఐ పట్ల మరింత పారదర్శక, సమ్మిళిత, సుస్థిర విధానాన్ని రూపొందించడానికి కృషి చేస్తుంది.
ఐఐఎస్‌సీకి చెందిన ఆర్ట్‌పార్క్-
ఆర్ట్‌పార్క్ అనేది ఒక అంకుర ఇంక్యుబేషన్, యాక్సిలరేటర్ కార్యక్రమం. ఆవిష్కరణ స్థాయి నుంచి అంకుర స్థాయి వరకు ఎదిగే ప్రక్రియను ఇది సులభతరం చేస్తుంది. పరిశోధన రంగంలోని ఆవిష్కరణలను సామాన్యుల రోజువారీ సవాళ్లను పరిష్కరించే విధంగా మార్చడం దీని ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఏఐ, రోబోటిక్స్ వ్యవస్థలో ప్రయోగశాలల్లోని ఆలోచనలను మార్కెట్‌కు చేరవేయడానికి ఇది ఒక వారధిలా పనిచేస్తుంది.
డిజిటల్ ఫ్యూచర్స్ ల్యాబ్ -
డిజిటల్ ఫ్యూచర్స్ ల్యాబ్ అనేది ఒక స్వతంత్ర, బహుళ విభాగాల పరిశోధనా సంస్థ. ఇది భారత్, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సాంకేతికత, సమాజం మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధాన్ని అధ్యయనం చేస్తుంది. సాక్ష్యాధారాలతో కూడిన పరిశోధన, ముందుచూపు, ప్రజా భాగస్వామ్యం ద్వారా సమానమైన, సురక్షితమైన, సుస్థిర డిజిటల్ భవిష్యత్తును నిర్మించడానికి డీఎఫ్ఎల్ కృషి చేస్తుంది.
ట్రైలీగల్ -
ట్రైలీగల్ అనేది భారత్‌లో 25 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఒక సమగ్ర న్యాయ సేవల సంస్థ. ఈ సంస్థ ఫార్చ్యూన్ 500 కంపెనీలు, అంతర్జాతీయ పెట్టుబడి నిధులు, ప్రముఖ భారతీయ కార్పొరేట్ సంస్థలు, స్వదేశీ- అంతర్జాతీయ బ్యాంకులు, సాంకేతిక- మీడియా సంస్థలు, కుటుంబ కార్యాలయాలు, ఉన్నత స్థాయి సంపన్నులతో కూడిన విభిన్న సంస్థలు, వ్యక్తులకు న్యాయపరమైన సలహాలను అందిస్తుంది.
నాస్కామ్ ఏఐ-
భారత్‌లోని 280 బిలియన్ డాలర్లకు పైగా విలువైన సాంకేతిక పరిశ్రమకు నాస్కామ్ ప్రాతినిధ్యం వహిస్తోంది. దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి సాంకేతిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే దీని ప్రధాన లక్ష్యం. పరిశ్రమలోని వివిధ రంగాలకు చెందిన 3,500 కంటే ఎక్కువ సభ్య సంస్థలతో కూడిన ప్రతిభావంతులను ఇది ఏకం చేస్తోంది. భారతదేశపు ఏఐ వ్యవస్థ గొంతుకగా నాస్కామ్ ఏఐ వ్యవహరిస్తోంది. దేశంలో శక్తిమంతమైన, వినూత్నమైన, సుస్థిరమైన ఏఐ రంగాన్ని పెంపొందించడానికి నాస్కామ్ చేపట్టిన ఒక వ్యూహాత్మక కార్యక్రమం ఇది. ఏఐ సామర్థ్యాలను పెంపొందించటం, వివిధ రంగాల్లో ఏఐ వినియోగాన్ని వేగవంతం చేయటం, బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఇది ఒక ఉమ్మడి వేదికగా పనిచేస్తుంది.
వీటిని చూడండి:
సమ్మిళిత డిజిటల్ ఇండియా కోసం భారతీయ భాషా స్వర సాంకేతికతలు
సురక్షిత, బాధ్యతాయుతమైన స్వర సాంకేతిక వ్యవస్థను నిర్మించడం
***
(రిలీజ్ ఐడి: 2231314)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2