ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
స్పష్టంగా నిర్వచించిన ప్రజా ప్రయోజనాల కోసమే ఏఐ వనరులను వినియోగించాలని ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో నిపుణుల వ్యాఖ్య
సమానత్వం, సమ్మిళితత్వం, ప్రజా ప్రయోజనం దిశగా భవిష్యత్ ఏఐ పరివర్తన
వినియోగదారులు, సృజనకర్తలకు ఏఐ వినియోగాన్ని విస్తరించటం, విధానపరమైన సవాలు
ఏఐ పూర్తి సామర్థ్యాన్ని అందిపుచ్చుకునేందుకు ఆసియాలోని నైపుణ్య కొరతను
అధిగమించటం అత్యంత కీలకం
నాడు పోస్టు చేయడమైనది:
20 FEB 2026 2:42PM by PIB Hyderabad
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో భాగంగా నిర్వహించిన 'బిల్డింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏఐ: క్యాటలిటిక్ ఫండింగ్ ఫర్ ఈక్విటబుల్ ఆక్సెస్ టు కంప్యూట్ రిసోర్సెస్' సెషన్‌లో.. 'ఓపెనింగ్ అప్ కంప్యూటేషనల్ రిసోర్సెస్ ఫర్ న్యూ ఏఐ ఫ్యూచర్స్' అంశంపై రూపొందించిన వర్కింగ్ రిపోర్టును గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ సౌరభ్ గార్గ్ విడుదల చేశారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు, దాతృత్వ సంస్థలు, ప్రపంచ స్థాయి ఏఐ నిపుణులు ఈ చర్చలో పాల్గొన్నారు. గ్లోబల్ సౌత్ దేశాలకు అత్యాధునిక కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావటానికి, చౌకగా మార్చేందుకు.. ప్రోత్సాహక నిధులు, కొత్త సంస్థాగత నమూనాలు, దక్షిణ దేశాల మధ్య సహకారం వంటివి ఏ విధంగా తోడ్పడతాయో చర్చించారు.
కేవలం డేటా సెంటర్ల సామర్థ్యాన్ని పెంచడమే కాక, అందుబాటులోని వనరులను ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ఉపయోగించాలని ఈ చర్చ స్పష్టం చేసింది. కంప్యూటింగ్ సదుపాయాలను అందుబాటులో ఉంచటమే కాకుండా, వాటిని అంకుర సంస్థలు, పరిశోధకులు, సామాజిక సేవా సంస్థలకు ఉపయోగపడేలా వాస్తవ రూపంలోకి తీసుకురావటానికి ఉమ్మడిగా
డిమాండ్‌ను సృష్టించటం, ఉమ్మడి మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి, స్పష్టమైన లక్ష్యమున్న పాలనా వ్యవస్థ అత్యంత కీలకమని వక్తలు స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్త ఏఐ పరివర్తనలో సమానత్వం ప్రధానాంశంగా ఉండాలని కేంద్ర గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ సౌరభ్ గార్గ్ తెలిపారు. ఏఐ పురోగతి ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నప్పుడే దానికి నిజమైన విలువ ఉంటుందన్నారు. "ప్రపంచాన్ని ఏఐ మారుస్తుందనే విషయంలో అందరిదీ ఒకే అభిప్రాయం. ఈ మార్పు సమానత్వంతో, సమ్మిళితంగా, ప్రజా ప్రయోజనకరంగా ఉంటుందా? అనేదే అసలైన ప్రశ్న. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చల్లో ఇదే అత్యంత కీలకమైన అంశం" అని వ్యాఖ్యానించారు.
ఏఐ కొలాబరేటివ్ సీఈఓ మార్టిన్ టిస్నే ముఖ్యమైన హెచ్చరిక చేశారు. ఎంత వేగంగా సామర్థ్యాన్ని పెంపొందించినా దానికి తగిన వాస్తవ వినియోగం లేకపోతే.. వ్యవస్థకు, దానివల్ల కలిగే ప్రయోజనానికి మధ్య అంతరం పెరిగే ప్రమాదం ఉందన్నారు. "వచ్చే రెండేళ్లలో గ్లోబల్ సౌత్ దేశాలు సహా అనేక దేశాలు కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవటంలో విజయం సాధించవచ్చు. ఒకవేళ ఆ డేటా సెంటర్లు సమర్థవంతంగా వినియోగంలోకి రాకపోతే, అది ఆందోళన కలిగించే విషయమే" అని తెలిపారు.
విధానం, పెట్టుబడి, భారీ స్థాయిలో అమలును అనుసంధానించటానికి కొత్త సంస్థాగత వ్యవస్థల అవసరాన్ని పాట్రిక్ జె.మెక్‌గవర్న్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ విలాస్ ధార్ స్పష్టం చేశారు. కేవలం మార్కెట్‌పైనే ఆధారపడి సాంకేతికత అందుబాటులోకి రాకూడదని ఆయన తెలిపారు. "వినియోగదారులకు, సృజనకర్తలకు అందేలా భారీస్థాయిలో ఏఐని సేవగా మార్చటం కేవలం ఒక ఉత్పత్తికి సంబంధించిన సవాలు మాత్రమే కాదు.. విధానపరమైన సవాలు కూడా. ఈ పురోగతి ప్రైవేట్ మార్కెట్ ద్వారానో, క్షేత్రస్థాయిలో పనిచేసే స్వచ్ఛంద సంస్థలను డెవలపర్లుగా మారమని కోరడం ద్వారానో సాధ్యం కాదు. రాబోయే 12 నెలల్లో మన దృష్టంతా ఈ అంశాలన్నింటినీ అనుసంధానించే సంస్థల ఏర్పాటుపై, పెద్దఎత్తున జరిగే మార్పుకు మద్దతివ్వటంపై ఉండాలి" అని అన్నారు.
కంప్యూటింగ్ అవసరాలు కేవలం సాంకేతికత కోసమే కాక స్పష్టమైన అభివృద్ధి లక్ష్యాలతో ముడిపడి ఉండాలని, వివిధ దేశాల మధ్య సహకారంతో వీటికి మద్దతు లభించాలని ఖాలా సీఈఓ షికోహ్ గిటౌ స్పష్టం చేశారు. "ఇది కేవలం జీపీయూ సౌకర్యాన్ని కల్పించటం గురించి మాత్రమే కాదు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయ రంగాల్లోని సమస్యలను పరిష్కరించటంలోనూ జీపీయూ ఏ విధంగా ఉపయోగపడుతుందనేది ముఖ్యం. స్పష్టమైన ప్రయోజనాలు ఉన్నప్పుడు జీపీయూ డిమాండ్ స్పష్టమైన లక్ష్యంగా మారుతుంది. తద్వారా ఈ అంతరాలను తగ్గించటానికి అవసరమైన పాలనాపరమైన నిబంధనలు కూడా మరింత స్పష్టంగా రూపొందుతాయి" అని ఆమె పేర్కొన్నారు.
ఆధునిక కంప్యూటింగ్ సౌకర్యాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావటానికి ఉమ్మడి డిమాండ్‌ను సృష్టించటం, రాయితీతో సాంకేతికతను వినియోగించుకునే వెసులుబాటు కల్పించటం, నైపుణ్యాభివృద్ధి కీలకమైన మార్గాలని ఫిలాంత్రోపీ ఏషియా ఫౌండేషన్ సీఈఓ షాన్ సియో అన్నారు. "కొత్త క్లౌడ్ సేవలు లేదా
జీపీయూని సేవగా వినియోగించటం వంటి పరిణామాలు, సామాజిక మార్పు కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం ఏఐని వినియోగించేందుకు తోడ్పడతాయి. అంకుర సంస్థలకు, సామాజిక సేవా సంస్థలకు వీటిని మరింత సులభంగా ఎలా అందుబాటులోకి తీసుకురావాలి? మనం రూపొందిస్తున్న వ్యవస్థ గురించి ఆలోచించాలి. ప్రస్తుతం ఆసియాలో నైపుణ్యాల కొరత అధికంగా ఉంది. ఈ అద్భుతమైన శక్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకోకుండా ఇదే మనల్ని అడ్డుకుంటోంది" అని తెలిపారు.
భవిష్యత్తు ప్రణాళికను ఈ సమావేశం వివరించింది. ఇందులో భాగంగా అభివృద్ధికి ప్రభుత్వ నిధులు, దాతృత్వ పెట్టుబడులు, ఉమ్మడి కంప్యూట్ మౌలిక సదుపాయాలు, పరస్పర సమన్వయంతో కూడిన పాలనా చట్రాలన్నీ కలిసి ఏఐని ఒక ప్రపంచ ఉమ్మడి ప్రయోజనకారిగా తీర్చిదిద్దేందుకు దోహదపడతాయి.
***
(రిలీజ్ ఐడి: 2230819)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9