ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
విశ్వసనీయ డేటా, నైతిక పరిపాలన, ప్రజలకు జవాబుదారుతనం.. ఇవి పునాదులుగా కృత్రిమ మేధను అభివృద్ధి చేయాలన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడణవీస్
ఆహార భద్రత, వాతావరణ మార్పులకు తట్టుకొని నిలబడగలగడం.. వీటిని బలపరచడానికి ఏఐ ఆధారిత పరిష్కారాలను కనుగొనాలన్న విధాన రూపకర్తలు
భారత్‌లో వ్యవసాయ క్షేత్ర స్థాయిలో కృత్రిమ మేధను ఉపయోగిస్తే ప్రపంచ దేశాలకు అమూల్యమైన పాఠాలు దక్కుతాయి
వ్యవసాయంలో కృత్రిమ మేధ విజయ సాధనకు సమ్మిళిత డిజైనుతో పాటు మహిళలకు, పురుషులకు సమాన అవకాశాలు కీలకం
నాడు పోస్టు చేయడమైనది:
20 FEB 2026 2:04PM by PIB Hyderabad
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో భాగంగా ‘‘ఏఐ మీట్స్ అగ్రికల్చర్: బిల్డింగ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ క్లైమేట్ రిజిలియన్స్’’ అంశంపై కార్యక్రమాన్ని నిర్వహించారు. కృత్రిమ మేధ (ఏఐ) వ్యవసాయ పద్ధతుల్లో ఎలాంటి మార్పులను తీసుకు వచ్చి, ఆహార భద్రతను బలపరచడంతో పాటు పెద్ద ఎత్తున వాతావరణ అననుకూలతలకు తట్టుకొనే సామర్థ్యాన్ని పెంచగలదనే మార్గాల్ని అన్వేషించడానికి విధాన రూపకర్తలు, సంస్థలు, పరిశోధకులు, డిజిటల్ రంగంలోని నూతన ఆవిష్కర్తలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడణవీస్ కీలకోపన్యాసాన్ని ఇచ్చారు. తరువాత చేపట్టిన ఒక ఉన్నత స్థాయి చర్చ కార్యక్రమంలో భారత ప్రభుత్వం, ప్రపంచ బ్యాంక్ గ్రూపు, పరిశోధన సంస్థలు, నవకల్పన అనుబంధ విస్తారిత వ్యవస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

వ్యవసాయ రంగం ప్రస్తుతం వాతావరణ అనిశ్చితి, ఆర్థిక స్థిరత్వం, జాతీయ భద్రతల కూడలిలో నిల్చొని ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా ఆహార వ్యవస్థలు విషమ స్థితిని ఎదుర్కొంటున్నాయి. వాతావరణంలో అనిశ్చితులు తీవ్రతరమవుతున్నాయి. నీటి మట్టాలు పడిపోతున్నాయి. భూమి స్వస్థత క్షీణిస్తోంది. సరఫరా వ్యవస్థలు ఆటుపోట్లకు గురవుతున్నాయి. ప్రపంచమంతటా మార్కెట్లలో పరిస్థితులు అంచనాలకు అందడం లేదు. అభివృద్ధి చెందుతున్న దేశాల విషయానికి వస్తే, వ్యవసాయం ఆర్థిక వ్యవస్థలో ఓ రంగం మాత్రమే కాదు, అది జీవనోపాధిని, సామాజిక స్థిరత్వాన్ని, జాతీయ భద్రత నీ కల్పిస్తున్న రంగంగా ఉంటోంది. ఈ విషయాల్ని భారత్ బాగా అర్థం చేసుకుని, దేశాభివృద్ధి సాధనలో డిజిటల్ సార్వజనిక సదుపాయాల కల్పనకు, బాధ్యతతో నడుచుకొనే కృత్రిమ మేధకు చాలా ప్రాధాన్యాన్ని ఇస్తోంది’’ అని ఆయన వివరించారు.
పారదర్శకత్వంతో కూడిన సేవలను సమాజంలో అన్ని వర్గాల వారికీ పెద్ద ఎత్తున అందించడానికి సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం భారత్ ఏఐ మిషన్ లక్ష్యమని ముఖ్యమంత్రి శ్రీ ఫడణవీస్ అన్నారు. ఈ ఏఐ మిషన్ అమలులో వ్యవసాయ రంగానికి అగ్ర ప్రాధాన్యాన్ని ఇవ్వాలనీ, ఎందుకంటే ప్రస్తుతం కనీసం యాభై కోట్ల మంది భారతీయులు ప్రత్యక్షంగా గాని, లేదా పరోక్షంగా గాని ఆధారపడుతోంది వ్యవసాయంపైనేనని ఆయన అన్నారు. చిన్న రైతులకు వ్యవసాయం సవాళ్లతో కూడుకొని ఉండవచ్చుగాక, అయితే ఈ సమీకరణాన్ని కృత్రిమ మేధ మార్చివేస్తుంది. దీనికి కారణం, కృత్రిమ మేధ వాతావరణాన్ని ఎంతో సునిశితంగా లెక్కలు కట్టి అంచనాలను వెలువరించ గలదు.. తెగుళ్లు వ్యాప్తి చెందక ముందే హెచ్చరికలు చేయ గలదు.. సేద్యపునీటిని అవసరాల మేరకే కచ్చితంగా ఉపయోగించుకొనేందుకు తోడ్పడ గలదు.. ఎరువుల వినియోగంలో మార్గదర్శనం చేయ గలదు.. సరఫరా వ్యవస్థలో పారదర్శకతకు చోటు ఇవ్వగలగడంతో పాటు వాస్తవ కాల ప్రాతిపదికన మార్కెట్ సంబంధిత సలహాలను అందించ గలదు కూడా అని ఆయన వివరించారు. ‘‘ఏఐ అంటే అదేమీ ఇంద్రజాలం కాదు, దానిని విశ్వసనీయ డేటా, నైతిక పాలన, ప్రజలకు జవాబుదారుగా ఉండాలనే అంశాల పునాదిపై నిర్మించి తీరాలి, లేకపోతే దాని స్థాయిని విస్తరించడం జరిగే పని కాదు’’ అని శ్రీ ఫడణవీస్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ దేవేశ్ చతుర్వేది మాట్లాడుతూ, వ్యవసాయ రంగం కోసం ఒకదాని మీద మరొకటి ఆధారపడి పనిచేసే తరహా డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరును రూపొందించే దిశగా కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. ఏఐపై ఆధారపడుతూ పనిచేసే ఏకీకృత వేదికల వెనుక ఉన్న హేతుబద్ధతను ఆయన వివరిస్తూ, ‘‘ఒకసారి ఈ ఏఐ ఆధారిత వ్యవస్థ మనకు అందుబాటులోకి వచ్చిందంటే, వివిధ సేవలకు ఒకే వేదిక మన దగ్గర ఉంటుందన్న మాట. ఒక్క బటన్ ను క్లిక్ చేసినంత మాత్రాన గాని, లేదా బహుశా స్వరం ద్వారా గాని ఆయా సలహాల్ని పొందవచ్చు’’ అని ఆయన తెలిపారు. రైతుల ఐడీలు, ఏకీకృత డేటాసెట్ల కు ఎవరు కోరిన సమాచారాన్ని వారికి అందించడానికి ముందడుగు వేయాలని ఆయన చెప్తూ, ‘‘సాధారణ డేటానే అందిస్తూ ఉండటం వల్ల అది రైతులకు ఉపయోగకరం కాకపోవచ్చు.. దానికి బదులు ఈ డిజిటలీకరించిన సార్వజనిక మౌలిక సదుపాయాల సేవలను మహావిస్తార్ (MahaVistar) వంటి ప్లాట్‌ఫారాలతో ఏకీకరించి దాని ఆధారంగా లభ్యమయ్యే ఎంతో నిర్దిష్టంగా ఉండే డేటాను అందుబాటులోకి తీసుకు రావచ్చు’’ అని ఆయన అన్నారు.
ప్రపంచ బ్యాంక్ గ్రూపు దక్షిణాసియా ప్రాంత ఉపాధ్యక్షుడు శ్రీ జోహాన్స్ జుట్ ప్రపంచ అభివృద్ధి దృష్టికోణాన్ని అందిస్తూ, వ్యవసాయంలో కృత్రిమ మేధ ప్రవేశాన్ని ప్రపంచమంతటా చిన్న కమతాలున్న రైతుల పరంగా చూసినప్పుడు ఇది ఒక మార్పును ఆవిష్కరించే సన్నివేశంగా వర్ణించారు. ‘‘మనం వ్యవసాయంలో రైతులకు సహాయాన్ని అందించే క్రమంలో ఓ పెద్ద విప్లవం మలుపులో నిల్చొని ఉన్నాం’’ అన్నారాయన. ప్రభుత్వాలు పోషించాల్సిన ముఖ్య పాత్రను గురించి ఆయన విపులీకరిస్తూ, పునాదుల విషయంలో శ్రద్ధ వహించడం ప్రభుత్వానికి ప్రధాన బాధ్యత అవుతుందన్నారు. ఏఐ పాలన, ఇంటరాపరబులిటీ, విద్యా ప్రణాళికల్లో భాగంగా డిజిటల్ సేవల ఉపయోగానికి అవసరమైన నైపుణ్యాలను ఇప్పించడం వంటి అంశాలు దీనిలో ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. భారత్‌కున్న నాయకత్వ సామర్థ్యాన్ని ఆయన వివరిస్తూ, ‘‘ ఒకవేళ భారత్‌లో వ్యవసాయ క్షేత్రం స్థాయిలో ఏఐ ప్రభావవంతంగా పని చేసేటట్లు చూడగలిగితే గనక అప్పుడు అది స్వతహాగానే ప్రపంచంలో ఇతర దేశాలకు కీలక పాఠాలను అందించగలుగుతుంది’’ అని శ్రీ జుట్ అన్నారు.

ఎం.ఎస్. స్వామినాథన్ రిసర్చ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధ విజయవంతం కావడానికి సమ్మిళితత్వ (ఇంక్లూజివ్) డిజైనుతో పాటు లైంగిక సమానత్వం (జెండర్ ఈక్విటీ) కీలకమని స్పష్టం చేశారు. ‘‘ ఏ సాంకేతికతా తనంతట తాను పేదలకు అనుకూలమైందిగానో, ధనికులకు అనుకూలమైందిగానో, మహిళలకు అనుకూలమైందిగానో ఉండదు.. అది, ఆ టెక్నాలజీని మనం ఉపయోగించే విధానాన్ని బట్టి ఉంటుంది’’ అని ఆమె తెలిపారు. ఏ ఒక్క వర్గాన్నీ విడిచిపెట్టే ధోరణి తగదని ఆమె హెచ్చరిక చేస్తూ, అల్గోరిదములు వాటికి అందించే డేటా సరిగా ఉంటేనే సరైన ఫలితాల్ని ఇస్తాయన్నారు. మహిళా రైతుల్నీ, సన్నకారు వర్గాల్నీ వెనుకపట్టునే వదలిపెట్టేయకుండా తగిన చర్యలను చేపట్టాలని ఆమె సూచించారు.
శిక్షణలో సాంకేతికత ఉపయోగాన్ని ప్రోత్సహిస్తున్న ఏక్‌స్టెప్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ శంకర్ మారువాడా మాట్లాడుతూ, ఆంక్షలకు తావు ఉండని (ఓపెన్) డిజిటల్ విస్తారిత అనుబంధ వ్యవస్థలకూ, సహకార ప్రధాన నవకల్పనలకూ పెద్దపీట వేయాలన్నారు. ఇదివరకటి వ్యవసాయ విప్లవాలతో ఆయన పోలికను చెబుతూ, ‘‘డేటా ద్వారా సమాచారాన్ని తోడటం, దానిని రైతుల వద్దకు చేర్చడం ఇప్పుడు ఒక ముఖ్య వాణిజ్య కార్యకలాపంగా మారిపోయింది’’ అన్నారు. డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రజలకు వివిధ రకాలైన సేవల్ని అందించడానికి తోడ్పడ్డ ఇంటరాపరబులిటీనే ప్రస్తుతం ఆంక్షలకు తావు ఉండని ఇంటరాపరబుల్ వ్యవస్థలకు కూడా వర్తింప చేయాలనీ, ఈ వ్యవస్థలు దేనికది గిరి గీసుకున్న వేదికల లాగా కాకుండా పరస్పర ఆశ్రిత నెట్‌వర్కుల మాదిరిగా పని చేయాలనీ ఆయన స్పష్టం చేశారు.
బృంద చర్చ కార్యక్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ విభాగం అదనపు ముఖ్య కార్యదర్శి శ్రీ వికాస్ చంద్ర రస్తోగి కూడా పాల్గొన్నారు. వ్యవసాయం పరంగా భిన్నమైన వాతావరణ స్థితులు నెలకొనే ప్రాంతాల్లో చిన్న కమతాల రైతులకు ఆచరణీయ, విశ్వసనీయ ఏఐ ఉపకరణాలు అందుబాటులోకి రావాలంటే నమ్మదగిన డేటాసెట్లకున్న ప్రాధాన్యం, ఒకటి కన్నా ఎక్కువ భాషలలో లభ్యమవుతూ ఉండటం, బలమైన పాలన ప్రణాళికలతో పాటు అభివృద్ధి మెలకువలని ఇతరులతో పంచుకోవడం ఎంతో ముఖ్యమని శ్రీ రస్తోగి చెప్పారు.
ఈ సమావేశం మొత్తం మీద తేల్చి చెప్పింది ఇదీ.. వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధను కేవలం నిరూపణలు లేదా ప్రయోగాత్మక ప్రాజెక్టులకు పరిమితం చేయకుండా, అన్ని వర్గాలనూ కలుపుకొని ముందుకు పోయేదిగా, రైతులకు ఉన్నత స్థాయి సూచనల్నీ సలహాల్నీ ఇచ్చే సార్వజనిక సదుపాయంగా, వాతావరణం విషయంలో లోతైన ముందస్తు అంచనాలను వెల్లడించేదిగా, మార్కెట్‌తో పాటు సరఫరా వ్యవస్థలకు సంబంధించి ఇప్పటి కన్న మెరుగైన సమాచారాన్ని ఇచ్చేదిగా తీర్చిదిద్దాలి. ఆహార భద్రత, వాతావరణ మార్పులకు తట్టుకొని నిలబడగలగడం, ఏఐ గవర్నెన్సు.. ఇవి ఒకదానితో మరొకటి సంబంధం కలిగినవేననీ, బాధ్యతాయుతమైన, విస్తృత కార్యాచరణ భారత్‌లో సాంకేతికత ఆధారిత వ్యవసాయ రంగ మార్పునకు సంబంధించిన భవిష్యత్తుకు భాష్యాన్ని చెప్పగలుగుతుందనీ వక్తలు పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2230776)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6