ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కనిపించని రక్షణ కవచం: బిలియన్‌కు పైగా భారతీయుల గుర్తింపునకు భద్రతనిస్తున్న కృత్రిమ మేధ

నాడు పోస్టు చేయడమైనది: 20 FEB 2026 1:14PM by PIB Hyderabad

భారత డిజిటల్ భద్రతా వ్యవస్థలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఏఐ ఆధారిత బయోమెట్రిక్ డూప్లికేషన్ గుర్తింపు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వేదికను అందుబాటులోకి తెచ్చింది. ఈ వేదిక ద్వారా ఆధార్ నమోదు, అప్‌డేట్‌ ప్రక్రియలో ఒకే వ్యక్తి వివరాలు మళ్లీ మళ్లీ నమోదు కాకుండా మరింత కచ్చితత్వంతో తనిఖీ చేయటం వీలవుతుంది.

భారత డిజిటల్ భద్రతా మిషన్‌లో ఈ "కనిపించని రక్షణ కవచం" నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. కోట్లాది గణనలను క్షణాల్లో పూర్తి చేసే వివిధ స్థాయిల ఏఐ రక్షణ వ్యవస్థ ఇది. పౌరుల నమ్మకాన్ని, డేటా సమగ్రతను కాపాడటానికి వేగవంతమైన కంప్యూటింగ్ సామర్థ్యాన్ని ఈ వ్యవస్థ వినియోగించుకుంటుంది.

భారీ స్థాయిలో జనాభా గణంకాల నకలు తొలగింపు

ఒక వ్యక్తికి ఒకే విశిష్ట గుర్తింపు ఉండాలన్న ప్రాథమిక సూత్రాన్ని అమలు చేయటానికి ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ డూప్లికేషన్ గుర్తింపు వ్యవస్థల్లో ఒకదాన్ని యూఐడీఏఐ నిర్వహిస్తోంది. ప్రతి కొత్త ఆధార్ నమోదును ఇప్పటికే ఉన్న డేటాబేస్‌తో పోల్చి చూస్తారు. తద్వారా ఆ వ్యక్తికి ఇదివరకే ఆధార్ లేదని, ఒకటే గుర్తింపు అని నిర్ధారిస్తారు.

హైదరాబాద్‌లోని అంతర్జాతీయ సమాచార సాంకేతిక సంస్థతో కలిసి స్వదేశీ సాంకేతికతతో వేలిముద్రలు, ముఖం, కనుపాప వంటి అన్ని రకాల బయోమెట్రిక్ విధానాలకు అత్యాధునిక ఏఐ మోడళ్లను యూఐడీఏఐ అభివృద్ధి చేసింది. ఈ మోడళ్లు ఎన్విడియా డీజీఎక్స్‌ వంటి అత్యంత శక్తివంతమైన విశ్లేషణాత్మక మౌలిక సదుపాయాలపై పనిచేస్తాయి. దీనివల్ల దేశంలోని అధిక జనాభాకు సంబంధించిన సమాచారాన్ని అత్యంత సురక్షితంగా, వేగంగా, సమర్థవంతంగా విశ్లేషించటం సాధ్యమవుతుంది.

ప్రతి నకలు తొలగింపు ప్రక్రియలో బిలియన్ల కొద్దీ గణనలు అవసరమవుతాయి. అత్యాధునిక విశ్లేషణాత్మక ఏఐ సాంకేతికత సాయంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నకలు గుర్తింపు ప్రక్రియను యూఐడీఏఐ విజయవంతంగా పూర్తి చేసింది. రాబోయే నెలల్లో దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియను పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తుంది.

సాంకేతికత ద్వారా ధ్రువపత్రాల తనిఖీ: ఆదిలోనే మోసాలకు అడ్డుకట్ట

నమోదు ప్రక్రియలో జరిగే మోసాలను అరికట్టటానికి ఇప్పుడు ఏఐ ఆధారిత డాక్యుమెంట్ మెటాడేటా ఎక్స్‌ట్రాక్షన్, అసలైన ఆధారాలతో సరిపోల్చే తనిఖీ పద్ధతులను యూఐడీఏఐ ఉపయోగిస్తోంది. పత్రాల ధ్రువీకరణకు ఈ వ్యవస్థ డిజిలాకర్ ఏపీఐలను వినియోగించుకుంటుంది. ఇక పత్రాల్లోని సమాచార విశ్లేషణకు అందులోని కీలక వివరాలను సేకరించటానికి ఎన్విడియా ఏఐ విశ్లేషణాత్మక మౌలిక సదుపాయాలను యూఐడీఏఐ వినియోగిస్తుంది.

సమర్పించిన పత్రాల ప్రామాణికతను ధ్రువీకరించటంలో ఈ వేదిక యూఐడీఏఐకి సహాయపడుతుంది. దీనివల్ల ఆధార్ నమోదు, అప్‌డేట్‌ ప్రక్రియకు పట్టే సమయం తగ్గటంతో ఆధార్ కార్డుదారులకు అందించే సేవల నాణ్యత మెరుగుపడుతుంది. 

 

***


(రిలీజ్ ఐడి: 2230774) సందర్శకుల సూచీ సంఖ్య : : 82
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Kannada