నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
పీఎం - సేతు పథకం కింద కాన్పూర్‌లో ఏరోనాటిక్స్ లో ఇండియా, ఫ్రాన్స్ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రకటించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
19 FEB 2026 5:11PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ లో ఉన్న నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్ఎస్ఐటీ) లో 'నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్ ఇన్ ఏరోనాటిక్స్ అండ్ డిఫెన్స్' ఏర్పాటును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పరిశ్రమల ఏర్పాటు మంత్రిత్వ శాఖ (ఎంఎస్డీఈ) పరిధిలోని పీఎం - సేతు (ప్రధానమంత్రి స్కిల్లింగ్, ఎంప్లాయయాబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్ గ్రేడెడ్ ఐటిఐఎస్) పథకం కింద, ఫ్రెంచ్ రిపబ్లిక్ ప్రభుత్వ సహకారంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
భారత్, ఫ్రాన్స్ మధ్య 'ఇన్నోవేషన్ ఇయర్' (ఆవిష్కరణల సంవత్సరం), ఏరోనాటిక్స్‌లో నైపుణ్యం కోసం జాతీయ ప్రతిభా కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడితో కలిసి నిర్వహించిన ఉమ్మడి మీడియా సమావేశంలో ప్రధానమంత్రి ఈ ప్రకటన చేశారు.
కాన్పూర్‌లో ప్రతిపాదిత విమానయాన జాతీయ ప్రతిభా కేంద్రం (నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏరోనాటిక్స్) ఎంఆర్ఓ (మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాల్), విమానాశ్రయ నిర్వహణ, రక్షణ తయారీ, వాటికి సంబంధించిన రంగాలలో అత్యాధునిక నైపుణ్య శిక్షణపై దృష్టి సారిస్తుంది. భారత్ లో వేగంగా వృద్ధి చెందుతున్న ఏరోస్పేస్, రక్షణ రంగాలకు అండగా నిలుస్తూ, విమానయాన నైపుణ్య శిక్షణలో దేశ సామర్థ్యాన్ని బలోపేతం చేసే ఒక ప్రపంచ స్థాయి సంస్థగా ఇది రూపొందనుంది.
కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పరిశ్రమల ఏర్పాటు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌదరి మాట్లాడుతూ, “దూరదృష్టితో కూడిన ప్రధానమంత్రి నాయకత్వంలో, పీఎం - సేతు పథకం భారతదేశంలోని ఐటిఐ వ్యవస్థ భవిష్యత్తును పునర్నిర్వచిస్తోంది. కాన్పూర్‌లోని ఈ విమానయాన జాతీయ ప్రతిభా కేంద్రం ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగిన ఏవియేషన్ నిపుణులను తయారు చేయడమే కాకుండా, అభివృద్ధి చెందుతున్న, అత్యాధునిక సాంకేతిక రంగాలలో ఫ్రాన్స్‌తో భారతదేశానికి ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ చొరవ, మన నైపుణ్యాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, వృత్తిపరమైన చలనశీలతను పెంపొందించడం, ఏరోనాటిక్స్, రక్షణ, అధునాతన తయారీ రంగాలలో వస్తున్న కొత్త అవకాశాల కోసం మన యువతను సిద్ధం చేయడంలో ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది” అని అన్నారు.
పీఎం - సేతు పథకం పథకం కింద ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఆసక్తి వ్యక్తీకరణ లేఖను భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పరిశ్రమల ఏర్పాటు మంత్రిత్వ శాఖ, ఫ్రెంచ్ రిపబ్లిక్ ప్రభుత్వ ప్రతినిధులు పరస్పరం అందుకున్నారు. నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్యా శిక్షణ రంగాలలో 2025లో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ఆధారంగా రూపొందించిన ఈ ఆసక్తి వ్యక్తీకరణ పత్రం భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది.
ఉమ్మడిగా పాఠ్యప్రణాళిక రూపకల్పన, శిక్షకులకు శిక్షణ కార్యక్రమాలు, ఎప్పటికప్పుడు కార్యక్రమాలపై ఉమ్మడి సమీక్షలు నిర్వహించడం, ఇరు దేశాల మధ్య విద్యార్థులు, నిపుణుల మార్పిడి, భాషా శిక్షణ గమ్యస్థాన మార్గాల అభివృద్ధి, ఫ్రెంచ్ భాషా శిక్షణ ఇవ్వడం ద్వారా భారతీయులకు అంతర్జాతీయంగా (ముఖ్యంగా ఫ్రాన్స్‌లో) ఉద్యోగ అవకాశాలు సులభతరం చేయడం ఈ ప్రతిపాదిత భాగస్వామ్యంలోని ప్రధానాంశాలు. ఈ చొరవ కింద నిర్దేశిత కార్యకలాపాలను నియంత్రించే ఒక నిర్దిష్ట ఒప్పందం అమలులోకి వచ్చే వరకు, ఉభయ దేశాల ఉద్దేశాలను తెలియజేసే ఒక అధికారిక రికార్డుగా ఈ ఆసక్తి వ్యక్తీకరణ లేఖ పనిచేస్తుంది.
విమానయాన రంగంలో భారత-ఫ్రాన్స్ విమానయాన జాతీయ ప్రతిభా కేంద్రం ఏర్పాటు భారత నైపుణ్య నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో ఒక కీలక అడుగు. ఇది అంతర్జాతీయ భాగస్వామ్యాలను దృఢపరచడమే కాకుండా, ఉన్నత ప్రమాణాలతో కూడిన, పరిశ్రమలతో అనుసంధానించిన వృత్తి విద్యా శిక్షణ ద్వారా వికసిత భారత్ 2047 దార్శనికతను మరింత ముందుకు తీసుకెళ్తుంది.
మొత్తం రూ. 60,000 కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన పీఎం -సేతు పథకం దేశవ్యాప్తంగా 1,000 పారిశ్రామిక శిక్షణ సంస్థలను నవీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా మౌలిక సదుపాయాల ఆధునికీకరణ, పరిశ్రమల డిమాండ్‌కు అనుగుణంగా పాఠ్యప్రణాళికల మార్పు, అభ్యర్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం వంటి పనులు జరుగుతాయి. కాన్పూర్‌లో విమానయాన రంగానికి సంబంధించిన కేంద్రంతో పాటు, ఇతర ప్రతిపాదిత జాతీయ ప్రతిభా కేంద్రాలు ఆయా ప్రాంతాల పారిశ్రామిక బలాబలాలకు అనుగుణంగా వివిధ రంగాలకు ప్రాధాన్యతనిస్తాయి. ఇందులో భాగంగా లూధియానా, హైదరాబాద్, చెన్నై, భువనేశ్వర్లలో అత్యాధునిక తయారీ రంగం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, వేగంగా వృద్ధి చెందుతున్న సేవా రంగాలపై దృష్టి సారించనున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2230644)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7