|
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’లో ‘ఏఐ ఇంపాక్ట్ స్టార్టప్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రిత్వశాఖ
· దేశంలో రూపొందే ఏఐ పరిష్కారాల తొలి సమీకృత సమాచార భాండాగారం ఈ సంకలనం: మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి శ్రీ అభిషేక్ సింగ్ · భారత్ ‘వినియోగాధ్యయన రాజధాని’గా మారాలంటే రాబోయే 12-18 నెలల్లో ప్రభావశీల ఏఐ అనువర్తనాల వినియోగం పెంపు అత్యంత కీలకం
నాడు పోస్టు చేయడమైనది:
18 FEB 2026 5:05PM by PIB Hyderabad
న్యూడిల్లీలో నిర్వహిస్తున్న “ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026”లో ఇవాళ మూడో రోజున ‘ఏఐ ఇంపాక్ట్ స్టార్టప్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. భారత్‌లో కృత్రిమ మేధ, డీప్-టెక్ స్టార్టప్ వ్యవస్థల స్థాయి, వైవిధ్యం, అంతర్జాతీయంగా పెరుగుతున్న గుర్తింపుపై సమగ్ర అధ్యయన సారాన్ని వివరించే పుస్తకమిది. అంకుర సంస్థల భారీ నమూనాలపై అధ్యయనం ప్రాతిపదికగా వివిధ రంగాలు, సాంకేతికతలు, భౌగోళిక ప్రదేశాల్లో వర్ధమాన ధోరణులపై ఈ పుస్తకం సమగ్ర అవగాహన కల్పిస్తుంది.
ఆరోగ్య సంరక్షణ వంటి ప్రధాన రంగాల్లో ఏఐ ఆవిష్కరణల బలమైన ఉనికితోపాటు ప్రాథమిక నమూనాలు, సమాచార నిధులు, వ్యర్థాల నిర్వహణ సాంకేతికతలు సహా వివిధ రంగాలలో వేగంగా విస్తరించే పనితీరును ఈ నివేదిక సూచిస్తుంది. భారత్ అవసరాల మేరకు వాయిస్-విజన్ ఆధారిత అప్లికేషన్ల రూపకల్పన, ప్రధాన మహానగర కేంద్రాలకు మించి అంకుర సంస్థల పెరుగుదల-విస్తరణ, అమలు స్థాయి పుంజుకోవడంలో ప్రభుత్వ భాగస్వామ్యాల పాత్రను కూడా ఇది వివరిస్తుంది. స్వదేశీ ఏఐ మౌలిక సదుపాయాల కల్పన, హార్డ్‌వేర్ సామర్థ్యంతో ‘ఎడ్జ్ ఏఐ’ ఏకీకరణలో వృద్ధి, తరుణ దశలో ప్రభావం నుంచి ప్రపంచ వృద్ధి వైపు అనేక అంకుర సంస్థల పరిణామాన్ని ఈ అధ్యయనం మరింతగా లోతుగా వివరిస్తుంది.
ఈ సందర్భంగా ఎన్‌ఐసీ డైరెక్టర్ జనరల్-మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి- భారత్ ఏఐ సీఈవో శ్రీ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ- డేటా సెంటర్లు, సమాచార దొంతరల నుంచి ప్రాథమిక నమూనాల దాకా ఏఐ మౌలిక సదుపాయాల అభివృద్ధి చాలా కీలకమన్నారు. అయితే- సేవల సౌలభ్యం మెరుగుదల, పౌరులకు... ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, విద్య, ఉపాధి వంటి రంగాల్లో ప్రత్యక్ష ప్రయోజనాల ప్రదానమే దీని విజయానికి నిజమైన కొలబద్ద అని ఆయన స్పష్టం చేశారు. ఈ రంగాలలో ఇప్పటికేగల పెద్ద సంఖ్యలోగల భారత అంకుర సంస్థలు ప్రభావశీల పరిష్కారాలను రూపొందిస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, పౌర వ్యవస్థలలో ఇటువంటి ఆవిష్కరణల గుర్తింపు, మూల్యాంకనం, స్థాయి పెంపు దిశగా నిర్దిష్ట చట్రంతో కూడిన యంత్రాంగం అవసరం పెరుగుతున్నదని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత నేపథ్యంలో ఆవిష్కృతమైన ఈ పుస్తకం లక్ష్యాన్ని వివరిస్తూ- దేశంలో రూపొందే ఏఐ పరిష్కారాల తొలి ఏకీకృత భాండాగారంగా ఈ సంకలనం ఉపయోగపడుతుందని చెప్పారు. కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, సంస్థలు సదరు పరిష్కారాల పరిపక్వతను అంచనా వేయడంతోపాటు వాటి వాస్తవిక పనితీరును అర్థం చేసుకోవడానికి ఇదొక ఉపకరణం కాగలదన్నారు. అంతేకాకుండా జనాభా స్థాయిలో విస్తరించేందుకు వీలుగా వాటిని అమలు చేసేందుకు వీలు కల్పిస్తుందని తెలిపారు. భాష ఆధారిత వ్యవసాయ సలహా సేవల వంటి కార్యక్రమాలతోపాటు బహుళ భారతీయ భాషలు, మాండలికాలలో చివరి అంచెదాకా సమాచార సౌలభ్యం దిశగా ఏఐ సామర్థ్యాన్ని ఇవి ప్రదర్శిస్తాయని పేర్కొన్నారు. ఇందుకోసం సుసంపన్న సమాచార నిధులు, అమలుకు సమన్వయ సహిత కృషి అవసరమన్నారు.
పరిష్కార ప్రదాతలతో అమలు సంస్థల క్రమబద్ధ సంధానం, ప్రయోగాత్మక దశ ఆవిష్కరణల స్థాయి నుంచి వివిధ రంగాలలో పెద్ద ఎత్తున స్వీకరణకు చేరడంపైనే భారత ఏఐ పయనంలో తదుపరి దశ పురోగమనం ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
భారత దేశం ఏఐ ‘వినియోగాధ్యయన రాజధాని’గా మారాలంటే రాబోయే 12-18 నెలల్లో ప్రభావశీల ఏఐ అనువర్తనాల వినియోగం పెంపు అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వేదికపై వంద పరిష్కారాల జాబితా వెల్లడైన నేపథ్యంలో రాబోయే ఏడాది నుంచి ఏడాదిన్నర వ్యవధిలో వాటిలో కనీసం పదింటిని అమలు చేయడం ఓ కీలక మలుపు కాగలదని వ్యాఖ్యానించారు.
అనంతరం ‘కల్ప ఇంపాక్ట్’ వ్యవస్థాపక సీఈవో శ్రీ సుశాంత్ కుమార్ మాట్లాడుతూ- ఈ మొత్తం నమూనాల నుంచి 8 ఆలోచనలను స్వీకరించామని తెలిపారు. “మా ముందుకొచ్చిన 8 ఆలోచనలను స్వీకరించాలని నేను భావిస్తున్నాను. ఆదిలో ఆరోగ్యం వంటి రంగాలు ‘ఏఐ’ని స్వీకరించడం మనం చూశాం. అయితే, ఇప్పుడు ప్రాథమిక నమూనాలు, సమాచార నిధుల ప్రాతిపదికన విస్తృత శ్రేణిలో వినూత్న రంగాలకు విస్తరించడం కూడా చూస్తున్నాం. మా తరుణ దశ వెంచర్లలో దాదాపు 47 శాతం స్థానిక మూలాలున్నవే. ఇక దాదాపు 68 శాతం అంతర్జాతీయంగా వృద్ధి దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ప్రాథమిక నమూనాలను రూపొందిస్తూ, మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. చివరలో ప్రస్తావిస్తున్న్పటికీ, అత్యంత ముఖ్యమైనది ‘ఎడ్జ్ ఇన్నొవేషన్’... దీనిద్వారా ఈ పుస్తకాన్ని శోధించాల్సిందిగా అందరికీ నా విజ్ఞప్తి” అని ఆయన వ్యాఖ్యానించారు.
భారత ఏఐ అంకుర వ్యవస్థ వృద్ధి పరిణతిని, ప్రయోగ స్థాయి నుంచి విధాన ప్రోత్సాహక వాతావరణం, సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాల లభ్యత, విస్తరిస్తున్న ప్రపంచ మార్కెట్ అనుసంధానంతో అంతర్జాతీయ పోటీతత్వ ఆవిష్కరణల దిశగా దాని పరిణామాన్ని ఈ పుస్తకావిష్కరణ విశదం చేస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2230023)
|